ఎవరు మూర్ఖుడు?! విక్రమార్క బేతాళ కథలు!
విక్రమార్క బేతాళ కథలలో, దుర్వ్యసనాలకూ, దుష్టసావాసాలకూ బానిసైన గుణాకరుడు ఎలా మారాడు? యక్షిణిని పొందడం కోసం, కపర్ధముని చెప్పిన మంత్రం ఎందుకు ఫలించలేదు? అనే విషయాలను, గత భాగంలో తెలుసుకున్నాము. ఇక బేతాళుడు చెప్పిన అయిదవ కథ, ‘నలుగురు మూర్ఖుల కథ’. ఈ కథ, బేతాళుడు వేసిన చిక్కు ప్రశ్న, దానికి విక్రమార్క మహారాజు చెప్పిన సమాధానం ఏంటో, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/ny54-a7uuPM ]
జయపురం అనే నగరాన్ని, జయవర్ధనుడనే రాజు పాలిస్తుండేవాడు. ఆ రాజ్యంలోవున్న ఒక అగ్రహారంలో, విష్ణుస్వామి అనే వేదపండితుడుండేవాడు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. ఆ పండితుడికి, నలుగురు కొడుకులున్నారు. ఆ నలుగురూ, రకరకాల వ్యసనాలకి అలవాటు పడ్డారు. నిత్యం దుర్వ్యసనాల వల్ల ఎన్నో అనర్థమైన పనులు చేస్తూ, తండ్రి పేరుని చెడగొడుతుండేవారు. ఆ నలుగురిలో మొదటివాడు ధూర్తుడు, రెండవవాడు వ్యభిచారి, మూడవ వాడు విషయలోలుడు, నాలుగవవాడు పరమనాస్తికుడు. వారంతా, తండ్రి ఆస్తిని నాశనం చేసి, చివరికి దరిద్రులైపోయారు. ఒకనాడు కొంత జ్ఞానోదయం కలిగిన ఆ నలుగురూ, తండ్రి దగ్గరకి వచ్చి, ‘నాన్నగారూ! మేము ఎంత ప్రయత్నం చేసినా, మా దగ్గర ధనం నిలవడం లేదు. ఎందుకో చెప్పండి’ అని ప్రార్థించారు. విష్ణుస్వామి తన కొడుకులడిగిన ప్రశ్నకి, ఇలా సమాధానం చెప్పాడు.
మొదటి కుమారుడితో, ‘నాయనా, నీవు ధూర్త కర్మలను ఆచరించావు. ఆ కర్మలలో ప్రమాదకరమైనది జూదం. అది మొదట్లో లాభాలు ఇచ్చినట్లే ఇచ్చి, క్రమంగా, మొత్తం నీ దగ్గరున్న ధనాన్నంతా హరించివేస్తుంది. నీ ధూర్త బుద్ధే, నిన్ను జూదగాణ్ణి చేసింది. అందుకే, నీ దగ్గర ధనం నిలువలేదు’ అని చెప్పాడు. అది విన్న మొదటి పుత్రుడు, ‘తండ్రీ, మరి నాకు లక్ష్మీ అనుగ్రహం ఎలా కలుగుతుంది?’ అని ప్రశ్నించాడు. ‘కుమారా! పుణ్యతీర్థాలూ, వ్రతాలూ ఆచరించడం వలన, ముందుగా పాపం నశిస్తుంది. నీవు తల్లిదండ్రుల మాట జవదాటకూడదు. అప్పుడే నీ దగ్గర లక్ష్మీ స్థిరంగా నిలుస్తుంది’ అని ప్రబోధించాడు.
రెండవ కుమారుడితో, ‘కుమారా! వ్యభిచారం మహాపాపకర్మ. నీవు అదే ఆచరిస్తున్నావు. వ్యభిచారం వల్ల ఆరోగ్యం నశిస్తుంది. ఆయుర్దాయం తగ్గిపోతుంది. ఆర్ధిక నష్టం కూడా సంభవిస్తుంది. నీకు ఈ దోషం పోవాలంటే, బ్రహ్మచర్యాన్ని పాటించాలి. అలా చేస్తేనే, నీకు సకలశుభాలూ కలుగుతాయి’ అని తెలియపరిచాడు.
మూడవ కుమారుడితో, ‘కుమారా! నీవు విషయలోలుడివైపోయావు. మాంసం భుజించడం, మద్యం తాగడం లాంటి వ్యసనాలు, అనారోగ్యానికి హేతువులు. అవి ఎన్నో పాపాలను మన చేత చేయిస్తాయి. దొంగతనం లాంటి ఘోరమైన పనులకు కూడా, ఈ వ్యసనాలే కారణం. కనుక, నీకున్న పాపాలన్నీ తొలగిపోవాలంటే, సర్వోత్తముడైన శ్రీ మన్నారాయణుడిని, వ్రతపూర్వకంగా ఆరాధించి, నీ దగ్గర మిగిలిన ద్రవ్యాన్ని, ఆయన పూజలకే వినియోగించు’ అని చెప్పాడు.
నాలుగవ కుమారుడితో, ‘నాయనా, నువ్వు ఘోరమైన పాపం చేస్తున్నావు. పరమనాస్తికుడిగా మారి, దైవం ఉనికిన ప్రశ్నిస్తున్నావు. ముందు నువ్వు దైవాన్ని నిందించడం మానుకో. నాస్తిక భావాలను పోగొట్టుకో. నీ పాపాలు పోవాలంటే, ఆస్తికమార్గాన్ని అవలంభించు. ఆత్మశుద్ధి చేసుకుని, సకల ప్రాణులలో, ఆ దైవం నిండి వుందని గ్రహించు’ అని బోధించాడు. విష్ణుస్వామి చెప్పిన విధంగానే, అతడి కుమారులంతా నడుచుకున్నారు. ఆయన ప్రబోధించిన మార్గాన్నే, అనుసరించారు. వారి సత్ర్పవర్తనకి మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై, వారికి మృత సంజీవనీ విద్యని ప్రసాదించాడు. ఆ నలుగురూ సంతోషంగా ఆ విద్యని గ్రహించి, తిరుగు ప్రయాణమయ్యారు. దారిలో వారికి ఒకపులి కళేబరం కనిపించింది. ఆ నలుగురిలో ఒకడు, దాని ఎముకలన్నింటినీ ఒకచోటికి చేర్చి, మంత్రాన్ని పఠించి, నీళ్ళు చల్లాడు. వెంటనే ఆ పులికి అస్థిపంజరం ఏర్పడింది. రెండవవాడు మంత్రించి, ఆ అస్థిపంజరం మీద తాను నీళ్ళు చల్లాడు. వెంటనే, దానికి మాంసం చేకూరింది. మూడవవాడు మంత్రజలం చల్లగానే, రక్తం, చర్మం పుట్టాయి. చివరిగా నాలుగవవాడు మంత్రజలం చల్లగానే, ఆ పులికి ప్రాణం వచ్చి, లేచి నుంచుంది. వెంటనే కళ్లముందున్న నలుగురినీ చంపి, తినేససింది. ఆ విధంగా, వారి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
విన్నారుగా మహారాజా! ఈ కథలో ఉన్న నలుగురు అన్నదమ్ములలో, పెద్ద మూర్ఖుడు ఎవరు? అని ప్రశ్నించాడు. అందుకు విక్రమార్కుడు సమాధానంగా, ‘విప్రుడా! ఆ నలుగురూ మూర్ఖులే. అయితే, చివరగా, ముందూ వెనకా ఆలోచించకుండా, అది క్రూర జంతువనీ, తమ ప్రాణాలను తీస్తుందనీ గ్రహించక, దానికి ప్రాణం పోసిన ఆఖరివాడే, అందరికన్నా మూర్ఖుడు’ అని సమాధానం చెప్పాడు, విక్రమార్కుడు. విక్రమాదిత్యమహారాజు చెప్పిన సమాధానాలకు, విప్రురూప బేతాళుడు పరమానందభరితుడై, ‘జయిూభవ! విజయిూభవ! బుద్ధికుశలతలో నిన్ను మించిన వాడు మరోకడులేడు, ఉండబోడు’ అని ఆశీర్వదించాడు.
Link: https://www.youtube.com/post/Ugwv7OmjT0RAHJa6twl4AaABCQ
Post a Comment