గణపతి అర్చనకు తులసి సమర్పించవచ్చా?

 

గణపతి అర్చనకు తులసి సమర్పించవచ్చా?

వినాయకచవితినాడు తులసి సమర్పించవచ్చు - అని కొందరంటారు. 
అయితే, ఆ రోజు కూడా తులసి సమర్పించరాదని చెబుతూ, 'సమర్పించవచ్చు' అనే మాటకు ఎక్కడా ప్రమాణం లేదని, కొంతమంది వాదన.

అసలు గణేశ చతుర్థినాడు తులసి సమర్పించరాదా? 

గణేశ విధానాలకు పరమ ప్రమాణమైన గ్రంథాలలో ఒకటి, 'ముద్గల పురాణం'. దానిలో స్పష్టంగా ఇలా చెప్పబడి ఉంది..

ఒక ప్రత్యేక కారణంగా, తులసి తన అర్చనకు పనికిరాదని, గణేశుని శాపం. అటుపై తులసి పశ్చాత్తప్తురాలై, గణపతి అనుగ్రహం కోసం తపస్సు నాచరించింది. అప్పుడు గణపతి ప్రత్యక్షమై, తులసీ దేవికి ఎన్నో వరాలనిచ్చి, 'వినాయక చవితినాడు మాత్రమే నీ దళాలతో నన్ను పూజించవచ్చు' అని అనుగ్రహించాడు.

'భాద్రశుక్లచతుర్య్థాం యే మహోత్సవ పరాయణాః ౹
పూజయిష్యంతి మాం భక్త్యా తత్ర త్వం ధారయామ్యహం ౹౹
ఏకవింశతి పత్రాణి హ్యర్చయిష్యంతి మానవాః ౹
తత్ర తే పత్రమేకం మే మాన్యం దేవి భవిష్యతి ||
ఉల్లంఘన సమం పాపం న భూతం న భవిష్యతి ||'

'భాద్రపదమాసంలో వచ్చే నా చవితి మహోత్సవాలలో సమర్పించే 21 పత్రులలోకెల్లా, తులసీ పత్రమే అత్యంత గొప్పదిగా నేను స్వీకరిస్తాను. కనుక, ఆ రోజున 21 పత్రాలలో తులసి పత్రం కూడా నాకు సమర్పించాలి. ఆ రోజున తులసిని సమర్పించకుండా పూజిస్తే, ఆ ఉల్లంఘన దోషానికి వారు పాపులుగానే పరిగణించబడతారు'.

పై వృత్తాంతం ఆధారంగా, వినాయక చవితి నాడు మాత్రమే, తప్పకుండా తులసిని సమర్పించాలి..

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes