మరణించిన తరువాత కర్ణుడు తిరిగి భూమిపైకి ఎందుకు పంపబడ్డాడు?
‘పితృ దేవతలు’ అంటే, గతించిన మన పితరులు మాత్రమే కాదు. మనందరిలో ఉన్న జీవుల రాకపోకలనూ, వారి గతులనూ సమర్థవంతంగా నిర్వహించే దేవతలు, పితృ దేవతలు. మనం చేసే పితృ కర్మలు ఎవరికి చెందుతాయి? అసలీ పితృ దేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏమిటి? కర్ణుడి మరణానంతరం ఏం జరిగింది? మహాలయ పక్షాలు ఎందుకంత ప్రత్యేకం - అనేటటువంటి ఆసక్తికర విషయాల గురించి, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/vfBBesZcTbw ]
బ్రహ్మ దేవుడు తన సృష్టిలో భాగంగా, దేవతలతో పాటు, పితృదేవతలను కూడా సృష్టించాడు. బ్రహ్మ పుత్రులైన పితృదేవతలు, ఏడుగణాలుగా విభజించబడి ఉంటారు. వీరిలో మూడు గణాలవారైన వైరాజులూ, అగ్నిష్వాత్తులూ, బర్హిషదులనేవారికి, ఆకారం ఉండదు. మిగిలిన సుఖాలినులూ, హవిష్మంతులూ, ఆజ్యపులూ, సోమపులనే నాలుగు గణాలకు, ఆకారం ఉంటుంది. అయితే, ఈ ఏడుగణాలవారూ, ప్రాణులందరిలో అమితమైన సామర్థ్యాన్నీ, చైతన్యాన్నీ కలిగిస్తుంటారు. ఆకారం లేని పితరులు, వైరాజుడనే ప్రజాపతి కుమారులు. అందుకే వీరిని వైరాజులని అంటారు. ఈ పితృదేవతలు, చంద్రలోకానికి పైన, ద్యులోకంలో ఉంటారు. వీరి భార్య స్వధా దేవి.
ఈ వైరాజుల మానస పుత్రిక మేన. ఈమె హిమవంతుడిని వివాహం చేసుకుని, ముగ్గురు కుమార్తెలను కన్నది. ఉమ, ఏకపర్ణ, అపర్ణ. హిమవంతుడు, ఉమను రుద్రుడికీ, ఏకపర్ణను భృగువుకూ, అపర్ణను జైగీషవ్యుడికీ ఇచ్చి వివాహం చేశాడు. ఇలా వైరాజ పితృదేవతల సంతతి, వృద్ధి చెందింది. ఇక అగ్నిష్వాత్తుల మానస పుత్రిక పేరు, అచ్చోద. ఆమె నదీరూపంగా ఉండేది. అచ్చోదను, పితృదేవతలు ఒక సరస్సులో సృష్టించారు. ఆమె తెలియక, తన తండ్రులలో ఒకరైన మావసుడిపై మనస్సు పడింది. దాంతో, ఆమె తన దివ్యత్వాన్ని కోల్పోయింది. అసంబద్ధంగా, ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయి ప్రవర్తించినందువల్లనే, ఆమెకు ఇంతటి నష్టం ప్రాప్తించింది.
మావసుడు మాత్రం, అచ్చోదను కామించక, ఇంద్రియ నిగ్రహంతోనే ప్రవర్తించాడు. అచ్చోద మావస్య కాలేదు. అంటే, మావసుడికి ప్రియురాలు కాలేదు. అందుకే, ఆమె అమావస్య అయింది. అమావస్య, కాలానుక్రమంలో, అమావాస్యగా మారింది. ఈమె అంటే పితృదేవతలకు ఉండే మమకారంతో, అచ్చోద ‘అమావాస్య’గా మారిన రోజున, తమను అర్చించినా, శ్రాద్ధకర్మలు నిర్వహించినా, అనంత ఫలాలను పొందేలా, పితృదేవతలు ఆశీర్వదించారు. బ్రాహ్మణుల పితరులు అగ్నిష్వాత్తులనీ, క్షత్రియలకు బర్హిషదులనీ, వైశ్యులకు కావ్యలనీ, శూద్రులకు సుఖాలినులు పితరులనీ, నంది పురాణంలో వివరించబడింది.
మనం శ్రాద్ధ కర్మలను అనుసరించేటప్పుడు, తండ్రి, తాత, ముత్తాతలకు పిండాలను పెడతుంటాం. మూడు తరాల వారికి చేసే శ్రాద్ధకర్మలలో, పితామహుడూ, ప్రపితామహుడూ, ప్రప్రపితామహుడూ అనే ముగ్గురూ, వసు, రుద్ర, ఆదిత్య స్వరూపులు. మనం చేసే శ్రాద్ధ కర్మలు వీరికే చెందుతాయి. దేవతలకు స్వహావషట్కారాలతో, పితృదేవతలకు స్వధానమస్కారాలతో, పూజలు జరుగుతుంటాయి. మరణించిన మన పితరులకు ఊర్థ్వ లోకాలలో ఆకలి దప్పులు ఉండకూడదని తర్పణాలూ, పిండప్రదానాలు చేస్తాం. అయితే, కర్మ క్షయం కాని జీవుడు మరణించిన తరువాత, తిరిగి పుడతాడనేది నిజం. కానీ, వెంటనే అని కచ్చితంగా చెప్పలేం. ఒక లెక్క ప్రకారం, పునర్జన్మకు 300 సంవత్సరాలు పడుతుంది. కానీ, వెంటనే పుట్టిన సందర్భాలు కూడా లేకపొలేదు. అది ఆ జీవుని యొక్క సంకల్ప బలం, తనకి గల ప్రారబ్ద, ఆగామి, సంచితం అనే కర్మలపైన ఆధార పడి ఉంటుంది. ఒకవేళ వెంటనే పుట్టినా సరే, మనం చేసే పితృకర్మల ఫలితం వారికి అందుతుంది. వారు ఊర్థ్వలోకాలలో ఉన్నా, తిరిగి జన్మించినా సరే, మనం పెట్టినది వారికి ఏది ఆహారమో, ఆ రూపంలో అందుతుంది. ఇలా చేయడానికి, ఒక వ్యవస్థ ఏర్పాటు చేయబడింది. అదే, పితృదేవత వ్యవస్థ.
మనం చేసే శ్రాద్ధకర్మలు, వసు, రుద్ర, ఆదిత్య రూపాలలో ఉన్న మన పితరులకు చేరుతుంది. అంటే, ఒక జీవి ఆవుగా పుడితే, మనం పెట్టే ఆహారం, గడ్డిగా మారి, అతనికి చేరుతుంది. ఒకవేళ గతించిన వారు ముక్తిని పొంది, లేదా ఉత్తమ గతులలో ఉండి, మనం చేసినవి అవసరం లేని స్థితిలో ఉంటే, మనం చేసిన పితృకర్మల ఫలితం, మనకే లభిస్తుంది. అయితే, గతించిన వారి స్థితి మనకు తెలియదు కనుక, మనం జీవించి ఉన్నంత కాలం, పితృకర్మలు చేయవలసినదే అని, శాస్త్రాలు చెబుతున్నాయి. పితృకార్యాలు చేయడానికి అనువైన మాసం, భాద్రపద మాసంలోని కృష్ణ పక్షం. దీనిని ‘మహాలయ పక్షాలు’ అని అంటారు. ఈ పక్షములో, పితరులు అన్నాన్నీ, ప్రతి రోజూ జలమునూ, కోరతారు. పితరులు చనిపోయిన తిధి రోజునా, మహాలయ పక్షములలో, తర్పణములూ, యధావిధిగా శ్రాద్ధ విధులూ నిర్వర్తిస్తే, పితృ దేవతలంతా, సంవత్సరమంతా తృప్తి చెందుతారు. వారు ఉత్తమ గతిని పొందుతారు.
ఈ మహాలయ పక్షాలు ఇంత ప్రాముఖ్యత చెందడం వెనుక, ఒక గాథ దాగి ఉంది. దానశీలుడిగా పేరు పొందిన కర్ణుడు, మరణానంతరం, స్వర్గానికి బయలుదేరాడు. మార్గమధ్యంలో, ఆకలీ, దప్పిక కలిగాయి. ఇంతలో ఒక ఫలవృక్షం కనిపించడంతో, పండు కోసుకుని, తిందామని చేతిలోకి తీసుకోగా, అది కాస్తా, బంగారపు ముద్దగా మారిపోయింది. ఏ పండు పట్టుకున్నా, అన్నీ బంగారు ముద్దలుగా మారిపోయాయి. నీరు తాగి సరిపెట్టుకుందామని సెలయేటిని సమీపించి, దోసిట్లోకి నీటిని తీసుకోగానే, అది కూడా బంగారపు నీరుగా మారిపోయింది. స్వర్గంలో కూడా, అదే పరిస్థితి ఎదురైంది. తనకెందుకిలా జరుగుతోందో అర్థంకాక చింతిస్తుండగా, ‘కర్ణా! నీవు దానశీలిగా పేరు పొందావు. చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు. అయితే, ఆ దానాలన్నీ, బంగారం, వెండి, డబ్బు రూపేణా చేశావు గానీ, కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి, ఆకలి తీర్చలేదు. అందుకే నీకీ దుస్థితి ప్రాప్తించింది', అని అశరీరవాణి పలుకులు వినిపించాయి.
వెంటనే తన తండ్రి అయిన సూర్యదేవుని దగ్గరకు వెళ్లి, జరిగిన విషయాన్ని చెప్పి, తిరిగి భూలోకం వెళ్లే అవకాశం ఇవ్వమని వేడుకున్నాడు. అందుకు సూర్యభగవానుడు సరేననడంతో, భాద్రపద మాసం, బహుళ పాడ్యమి నాడు, భూలోకానికి చేరుకున్నాడు, కర్ణుడు. పేదలకూ, బంధుమిత్రులకూ, అందరికీ అన్నసంతర్పణ చేసి, మాతా పితరులకు తర్పణాలు వదిలి, తిరిగి అమావాస్యనాడు స్వర్గానికి వెళ్లాడు. అలా కర్ణుడు భూలోకంలో గడిపిన ఆ 15 రోజులను, మహాలయ పక్షాలుగా పిలుస్తారు. ఎప్పుడైతే కర్ణుడు అన్నసంతర్పణలూ, పితృ తర్పణాలూ చేశాడో, అప్పుడే తన కడుపు నిండిపోయింది.
చంద్రమండల ఉపరితలంపై నివసించే పితృదేవతలకు, అమావాస్యతిథి, మిట్టమధ్యాహ్నమవుతుంది. అందుకే, భాద్రపద అమావాస్య రోజునా, దీపావళి అమావాస్య రోజునా, పితృదేవతలు, పుత్రులిచ్చే తర్పణములకు ఎదురు చూస్తూ ఉంటారని, ధర్మగ్రంథాలు తెలుపుతున్నాయి. మనం విధిగా శ్రాద్ధ కర్మలను నిర్వహించడం వలన, వంశాభివృద్ధి జరుగుతుంది. సకలాభీష్టాలు సిద్ధిస్తాయి.
సర్వేజనాః సుఖినోభవంతు!
Post a Comment