సృష్టి చక్రం గురించి శ్రీ కృష్ణుడు చెప్పిన అద్భుతాలు!
'భగవద్గీత' తృతీయోధ్యాయం - కర్మ యోగం (15 - 19 శ్లోకాలు)! - భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 1 నుండి 6 వరకూ ఉన్న అధ్యాయాలను, కర్మషట్కము అంటారు. దీనిలో మూడవ అధ్యాయం, కర్మ యోగం. ఈ రోజుటి మన వీడియోలో, కర్మ యోగంలోని 15 నుండి 19 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..
[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/MNnc9zKzoa4 ]
సృష్టి చక్రం గురించి శ్రీ కృష్ణుడు ఈ విధంగా అంటున్నాడు..
కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షరసముధ్భవమ్ ।
తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితమ్ ।। 15 ।।
మానవుల విహిత కర్మలు, వేదములలో చెప్పబడ్డాయి. మరియు, వేదములు ఆ భగవంతుని నుండే వ్యక్తమయ్యాయి. కాబట్టి, సర్వ వ్యాపి అయిన భగవంతుడు, నిత్యమూ యజ్ఞ కార్యములలో స్థితుడై ఉంటాడు.
వేదములు భగవంతుని శ్వాస నుండి వెలువడ్డాయి. ఈ సనాతనమైన వేదములలో, మనుష్యుల విధులను, ఆ భగవంతుడే స్వయంగా వివరించాడు. ఈ విధులు ఏ విధంగా తయారుచేయ బడ్డాయంటే, వాటిని నిర్వర్తించడం ద్వారా, ప్రాపంచికంగా కూరుకుపోయిన మనుష్యులు, నెమ్మదిగా తమ వాంఛలను నియంత్రణ చేసుకుని, తమని తాము తమో గుణం నుండి రజో గుణానికీ, రజో గుణం నుండి సత్వ గుణానికీ ఉద్ధరించుకోవటం, నేర్చుకోవచ్చు. ఈ విధులు యజ్ఞంలాగా, ఆయనకే అంకితం చేయడానికి నిర్దేశింపబడ్డాయి. కాబట్టి, భగవంతుని అర్పితముగా, పవిత్రం చేయబడిన విధులు, దైవికంగా, భగవత్ సంబంధముగా ఉండి, భగవంతునితో అభేదంగా ఉంటాయి.
ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహ యః ।
అఘాయురింద్రియారామ: మోఘం పార్థ స జీవతి ।। 16 ।।
వేదములచే నిర్దేశించబడిన ఈ యజ్ఞ చక్రములో, తమ బాధ్యతలను నెరవేర్చని వారు, పాపులు. వారు తమ ఇంద్రియ భోగముల కోసమే, జీవిస్తారు. అట్టి వారి జీవితము, వ్యర్థము.
ఇక్కడ చక్రం అంటే, ఒక సృష్టి క్రమంలో జరిగే క్రమబద్ధ పరిణామాలు. ఈ విశ్వం అనే చక్రంలో, అందరు సభ్యులూ తమ విధులను నిర్వర్తించి, దాని యొక్క చక్కటి పరిభ్రమణానికి దోహదపడతారు. మనము కూడా ప్రకృతి చక్రం నుండి కావలసిన వాటిని తీసుకుంటాము కాబట్టి, మనము కూడా, మనకు నిర్దేశించబడిన విధులు, నిర్వర్తించాలి. ఈ పరంపరలో, మన మానవులకు మాత్రమే, తాము చేసే పనులను, స్వీయ-స్వేఛ్చ ద్వారా ఎంచుకునే అవకాశం కల్పించబడింది. కాబట్టి, మనం ఈ ప్రకృతి పరిణామానికి అనుకూలంగా ఉండి దోహద పడొచ్చు, లేదా, ఈ విశ్వ వ్యవస్థ ఆటంకం లేకుండా నడవటానికి, ఉపయోగపడవచ్చు. వివిధ ఆధ్యాత్మిక స్థాయిలలో ఉన్న అన్ని ప్రాణులనూ క్రమశిక్షణతో ఉంచి, నేర్పించి, ఉద్ధరించటానికే, ఈ ప్రకృతి యొక్క చక్రం, భగవంతుని ద్వారా ఏర్పాటు చేయబడింది. ఈ యజ్ఞంలో, తమ కర్తవ్యాన్ని నిర్వహించటం ద్వారా పాలుపంచుకొనని వారు, తమ ఇంద్రియములకు బానిసలై, పాపపు జీవితాన్ని గడుపుతారని, శ్రీ కృష్ణుడు అర్జునుడికి విశదీకరిస్తున్నాడు.
యస్త్వాత్మరతిరేవ స్యాదాత్మతృప్తశ్చ మానవః ।
ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే ।। 17 ।।
కానీ, ఎవరైతే ఆత్మయందే రమింతురో, పరిపూర్ణ జ్ఞానంతో, ఆత్మ యందే సంతుష్టులుగా ఉందురో, వారికి ఎట్టి కర్తవ్యమూ ఉండదు.
బాహ్యమైన వస్తువుల కోసం కోరికలను త్యజించిన వారు మాత్రమే, ఆత్మ యందు రమిస్తూ, సంతుష్టులుగా ఉండగలరు. ప్రాపంచిక కోరికలే, మన బంధానికి మూలకారణం, కోరికలే, అన్ని పాపాలకీ మూల కారణం. అందుకే, వాటిని త్యజించాలి. కోరికలను త్యజించడం అంటే, ప్రాపంచిక కోరికలను వదిలిపెట్టడం. అంతేకానీ, ఆధ్యాత్మిక పురోగతి కోసం, లేదా, భగవత్ ప్రాప్తి కోసం ఉన్న కోరిక కాదు. మానసిక వాంఛలు, మనలను మాయా ప్రపంచంలోకి గిరగిరా విసిరివేస్తాయి. ఎప్పుడైతే జీవాత్మ భగవంతుని నుండి విడిపోతుందో, అప్పుడు భౌతిక శక్తి, దానిని మాయలో కప్పివేస్తుంది. ఈ మాయ వలన, తనను తాను శరీరమే అనుకుంటూ, తనను తాను ఆత్మనని మరచి పోయి ఉండటం చేత, దారుణమైన దుఃఖాలను అనుభవిస్తుంది. జ్ఞానోదయమయిన వారు, ఆత్మ అనేది భౌతిక మయినది కాదనీ, దివ్యమైనదనీ, అందుకే నాశములేనిదనీ తెలుసుకుంటారు. నశ్వరమైన ప్రాపంచిక వస్తువులు ఏవీ, నిత్యమైన ఆత్మ దాహాన్ని తీర్చలేవు కాబట్టి, ఆ ఇంద్రియ వస్తు-విషయములపై ఉండే యావ, మూర్ఖత్వం. ఈ విధంగా, ఆత్మ-జ్ఞానులైన మహాత్ములు, తమ మనస్సుని భగవంతుని యందే సంయోగం చేసి, తమలో తాము అంతులేని ఆనందాన్ని అనుభవిస్తారు. భగవంతునితో సంయోగమునొందిన వారు, వేదముల శిరస్సుపై నడుస్తారు. అంటే, వారు ఇక వేదములలో చెప్పిన నియమములను, పాటించవలసిన అవసరం లేదు.
నైవ తస్య కృతేనార్థో నాకృతేనేహ కశ్చన ।
న చాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయః ।। 18 ।।
ఇటువంటి ఆత్మ జ్ఞానులైన వారు, తమ విధులను చేయటం వలన కానీ, చేయకపోవటం వలన కానీ, వారికి వచ్చేవీ, పోయేవీ ఏమీ ఉండవు. తమ స్వార్థ ప్రయోజనం కోసం, వారు ఇతర జీవుల మీద ఆధార పడవలసిన అవసరమూ లేదు.
జ్ఞానోదయమైన మహాత్ములు, అలౌకిక ఆత్మ స్థాయిలో ఉంటారు. వారి యొక్క ప్రతి పని కూడా, భగవత్ సేవలో అతీంద్రియమైనదే. కాబట్టి, శారీరిక స్థాయిలోనున్న ప్రాపంచిక జనులకు, వారి వర్ణాశ్రమ ధర్మముల ప్రకారం సూచింపబడిన విధులు, అటువంటి వారికి వర్తింపవు. జ్ఞానోదయమయిన జీవాత్మలు, పరిశుద్ధ మనస్సు కలిగి, భగవంతుని యందే రమిస్తూ ఉండే స్థాయిని చేరుకుంటారు. ఇటువంటి మహాత్ములు, నేరుగా భక్తియందే, పూర్తి ఆధ్యాత్మిక కర్మల యందే నిమగ్నమయి ఉంటారు. అంటే, ధ్యానం, అర్చనా, కీర్తనా, గురు సేవా వంటివి. ఇటువంటి జీవాత్మలు, తమ ప్రాపంచిక కర్తవ్యములను త్యజిస్తే, అది పాపం అనిపించుకోదు. వారు కావాలనుకుంటే, ప్రాపంచిక విధులను నిర్వర్తించవచ్చు కానీ, వాటిని తప్పకుండా చేయాల్సిన అవసరం లేదు. అటువంటి సత్పురుషులు, ప్రహ్లాదుడూ, ధృవుడూ, అంబరీషుడూ, పృథువూ, మరియు విభీషణుడూ. అతీంద్రియ స్థాయిని చేరుకున్న తరువాత కూడా, తమ విధులను నిర్వర్తించారు. ఇక కర్మ యోగులు, బాహ్యంగా తమ విధులను చేసినా, అంతర్గతంగా తమ మనస్సు, భగవంతుని యందే చేర్చిన వారు. తమ ప్రాపంచిక ధర్మాన్ని విడిచి పెట్టి, సన్యాస జీవితాన్ని తీసుకున్నవారు, కర్మ సన్యాసులు. శంకరాచార్యులూ, మధ్వాచార్యులూ, రామానుజాచార్యుల వంటి వారు, బాహ్యంగా, అంతర్గతంగా, శారీరికంగా, మన: పూర్వకంగా, భగవత్ భక్తి లోనే నిమగ్నమై ఉంటారు.
ఈ శ్లోకంలో, శ్రీ కృష్ణుడు అర్జునుడికిజ్ఞానోదయమయ్యే ఈ రెండు మార్గాలనూ, సూచిస్తున్నాడు.
తస్మాత్ అసక్తః సతతం కార్యం కర్మ సమాచర ।
అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః ।। 19 ।।
కాబట్టి, మమకార బంధాలను విడిచిపెట్టి, ఆసక్తి రహితుడవై, నీ పనులను ఒక కర్తవ్యములాగా నిర్వహించుము. కర్మ ఫలములపై ఆసక్తి లేకుండా పని చేయటం వలన, మానవుడు ఆ పరమాత్మను చేరుకోగలడు.
జనులు పూర్తి ఆధ్యాత్మిక జ్ఞాన స్థాయి చేరనంత వరకూ, వారి వారి విహిత కర్మలను చేస్తుండమని చెప్పాడు. జ్ఞానోదయమైన మహాత్ములు, విధింపబడిన కర్మలను చేయనవసరం లేదని అన్నాడు. కాబట్టి, అర్జునుడికి ఈ రెంటిలో ఏది యోగ్యమయినది? అంటే, ప్రస్తుతం చేయాల్సిన కర్తవ్యాన్ని వదిలి, సన్యాసం తీసుకోవడం కన్నా, తన క్షత్రియ ధర్మాన్ని నిర్వర్తించి, దానిని భగవదర్పితం చేయమని, శ్రీ కృష్ణుడు బోధిస్తున్నాడు.
ఇక మన తదుపరి వీడియోలో, ముల్లోకాలలో తన విధి గురించి, శ్రీ కృష్ణుడి సంభాషణ తెలుసుకుందాము..
కృష్ణం వందే జగద్గురుం!
Post a Comment