వాయు పంచకం - ప్రాణాయామం!
ఆరోగ్యం, ఆయుష్షూ ఉంటేనే, మనిషి జీవితాన్ని సఫలం చేసుకోగలడు. సిరిసంపదలూ, పదవీ, వైభవాలు ఎన్ని ఉన్నా, వాటిని అనుభవించాలంటే, మనిషికి ఆయువు ఉండాలి, ఆరోగ్యవంతుడై ఉండాలి.
[ కర్మ ఫలితం గురించి భీష్ముడు చెప్పిన కథ! = https://youtu.be/ncpSVL9FrJo ]
ఈ దేహమనే యంత్రం దృఢంగా, పదికాలాలపాటు సక్రమంగా పనిచేయాలంటే, దేహాన్ని నడిపేది ప్రాణమని గ్రహించి, దానిని భద్రంగా కాపాడుకోవాలి. యంత్రం పనితీరు, విద్యుత్ ప్రసరణపైనే ఆధారపడినట్లు, ప్రాణంపైనే, దేహం పనితీరు ఆధారపడి ఉంటుంది. మనలోని చూపు, మాట, శ్వాస, వినికిడి, రక్త ప్రసరణ వంటి అన్ని శారీరక కార్యకలాపాలకూ కావలసిన శక్తి, ప్రాణంనుంచే లభిస్తుంది. మనిషి నిద్రపోయినా, ప్రాణం మెలకువగానే ఉండి, జీర్ణ, శ్వాస క్రియలకు శక్తినిస్తుంది. మనసును కలల ప్రపంచంలోకి తీసుకుపోతుంది.
ఇంతటి దివ్యశక్తి కలిగిన ప్రాణం, మనిషిలో ఎక్కడ ఉంటుంది? ఎలా ఉంటుంది..?
హృదయ గుహలో, పురీతత్ అనే నాడీమండలంలో, ఆత్మ నీడగా, ఆత్మను అనుసరించి, మనస్సుతో అనుసంధానమై, జ్యోతి రూపంగా ప్రాణం ఉంటుందంటాయి, ఉపనిషత్తులు. సృష్టిలో, అది రెండు మహాకార్యాలు నిర్వహిస్తుందంటుంది, శాస్త్రం. సృష్టికి ఆధారమైన ఆకాశ, పృథివి, వాయువు, అగ్ని, జలం వంటి స్థూల పంచ భూతాలను, సూక్ష్మాంశాలైన ఇంద్రియ, మనో బుద్ధులను సమైక్యపరచి, జీవ సృష్టి చేయడం,వాటి మనుగడకు కావలసిన శక్తిని అందించడం, ఈ రెండు పనుల్లో భాగంగానే, ప్రాణం శరీర ధారణ, శ్వాస ధారణా చేస్తుంది.
శరీరాన్ని అంటి పెట్టుకున్న ప్రాణం, ఆ శరీరాన్ని కాపాడేందుకు, విశ్వమంతా నిండి ఉన్న మహాప్రాణంతో, అనుక్షణం అనుసంధానమవుతుంది. ప్రకృతిలో సమృద్ధిగా దొరికే ప్రాణవాయువును, శ్వాస రూపంలో గ్రహిస్తుంది. సూర్యుడి ప్రాణశక్తితో ఉత్పత్తి అయిన ఆహారాన్ని జీర్ణంచేసి, దేహాన్ని పరిపుష్టీకరిస్తుంది. ఈ ప్రక్రియలన్నీ సజావుగా సాగేందుకు వీలుగా, ప్రాణం తనను తాను, అయిదు విభాగాలు చేసుకుంటుంది. ఏ రంగూ లేని సూర్యకిరణం, పట్టకంలో ప్రవేశించి, వివిధ వర్ణాలుగా వెలువడినట్లు, ప్రాణం శరీరాన్ని దాలిస్తే, ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అనే పంచ వాయువులుగా మారుతుంది. వీటినే, వాయు పంచకమనీ, పంచ ప్రాణాలనీ అంటారు.
వాయు పంచకంలో మొదటిదైన మూల ప్రాణాన్ని, ఊపిరిగా చెబుతారు. అది మనిషి హృదయస్థానంలో ఉండి, చూపు, మాట, శ్వాస, వినికిడి పనులకు సహకరిస్తుంది. అపాన వాయువు, శరీరంలోని అధో భాగంలో సంచరిస్తూ, మల, మూత్ర, వీర్య విసర్జన క్రియలు, సాఫీగా జరిగేలా చూస్తుంది. శారీరక సమతౌల్యాన్ని కాపాడుతుంది. వ్యాన వాయువు, వేలకొద్దీ నాడుల్లో సంచరిస్తూ, ప్రాణశక్తిని, శరీరమంతా నింపుతుంది. ఉదాన వాయువు, కంఠ స్థానంలో ఉండి, మనసును గాఢ నిద్రలోకి దించి, సేద దీర్చి, శాంతిని అందిస్తుంది. సమాన వాయువు, నాభి స్థానంలో ఉండి, జీర్ణ క్రియకు జఠరాగ్నిని ప్రజ్వలింపజేసి, అన్న సారాన్ని శరీరానికి అందజేస్తుంది.
శరీరంలో ప్రాణశక్తి సమంగా ప్రసరిస్తేనే, ఆరోగ్యం. లేకపోతే, అనారోగ్యం. ప్రాణశక్తి క్షీణిస్తే, మరణం తప్పదు. దీర్ఘ కాలం, మనిషి ఆయురారోగ్యాలతో ఉండాలంటే, ప్రాణ శక్తిని పెంచుకోవాలి. ప్రాణ చలనాన్ని నిరోధిస్తేనే, ఇది సాధ్యం. శ్వాసను నియంత్రిస్తేనే, ప్రాణ చలనాన్ని నిరోధించగలం. ఈ క్రియను బోధించేదే, ప్రాణాయామం. దీర్ఘ శ్వాసను తీసుకోవడం, దాన్ని బంధించడం, తిరిగి నెమ్మదిగా వదలడమనే ప్రక్రియనే, ప్రాణాయామమంటారు. పూజలు, యజ్ఞయాగాదుల ఆరంభంలోనూ, ధ్యాన, యోగ ప్రక్రియల్లోనూ, దీనిని తప్పక ఆచరిస్తారు. మనిషికి ప్రాణాయామం, మూడు మహోపకారాలు చేస్తుంది. దీర్ఘాయువునూ, ఆరోగ్యాన్నీ ప్రసాదించడంతోపాటు, చిత్త చాంచల్యాన్ని నిరోధిస్తుంది. తపస్సు, ధ్యానాన్ని సిద్ధింపజేస్తుంది..
🚩 కృష్ణం వందే జగద్గురుం 🙏
Post a Comment