పురాణ కథలు కట్టు కథలా?!
సరస్వతీ దేవిని నదిగా మారమని ఎవరో శిక్షించారనీ, అలాగే త్రిమూర్తులనూ గాయత్రి నదిగా మారమన్నదనీ పురాణాల్లో కథలు వింటుంటాం.
ఇవన్నీ కట్టు కథల్లా, అసంగతంగా అనిపిస్తాయి. వీటిలో ఏవైనా అంతరార్థాలున్నాయా? ఇంత అజ్ఞాన కరమైన కథలు ఉన్న పురాణాలని ఎలా నమ్మడం? దేవతలకి కూడా కోపతాపాలుంటాయా?
[ ఎవరి శాపంవల్ల ‘సరస్వతీ దేవి’ నదిగా మారింది? = https://youtu.be/ziecu5wQhwI ]
ఈ శాపకథలను కాదనడానికి వీలు లేదు. ఉదాహరణకి, సరస్వతీ దేవి శాపవశాత్తూ నదిగా మారిందనీ, కలియుగ ప్రారంభానికి శాపవిమోచనమై, అంతర్ధానమౌతుందనీ పురాణ కథ.
దానిని నిన్న మొన్నటి దాకా కొట్టిపారేశారు. కానీ, ఇటీవల దశాబ్దాలుగా, శాటిలైట్స్ పంపిన ఫోటోల ఆధారంగా, ఐదువేల ఏళ్ళకు పూర్వం భారతదేశంలో, ఒక మహానది ప్రవహించేదన్న జాడలు కనిపించాయి. అది సరస్వతీ నదేనని ఋజువై, వేద పురాణాల్లో వర్ణించిన సరస్వతీ నది, ఊహాజనితం కాదని, సాక్ష్యాలతో నిరూపణ అయ్యింది. పైగా పురాణం చెప్పిన కథ ప్రకారం, సరస్వతీ శాపవిమోచనం, కలియుగారంభానికే నన్నది, ఐదువేల ఏళ్ళ క్రితం అంతరించినది అన్న విషయంతో సరిపోతోంది. దీనిని బట్టి, పురాణాలను కొట్టిపారేయనవసరం లేదనీ, సరియైన దృష్టితో పరిశీలించవలసిన బాధ్యత ఉందనీ, అర్ధమౌతోంది.
సూక్ష్మమైన దైవీయ భూమికలలో జరిగే అంశాలని, మన లౌకికస్థాయిలో అన్వయించరాదు. పురాణ కథల్లో కేవలం చరిత్ర మాత్రమే ఉండదు. మంత్ర సంకేతాలూ, యజ్ఞ సంకేతాలూ, ఉపాసనా మర్మాలూ, వైజ్ఞానిక సూత్రాలూ, ఖగోళ విజ్ఞానాలూ, తాత్త్విక మర్మాలూ, ధార్మిక మర్మాలూ కలగలసి ఉంటాయి. వాటి శాస్త్ర పరిచయంతో, పురాణాలను సరిగ్గా విశ్లేషించాలి.
సృష్టి నిర్వహణకు ఉపకరించే పరమేశ్వరుని శక్తులే, దేవతలు. వాటి స్పందనలూ, ప్రకోపాలూ, ప్రభావాలూ, వివిధ భావాలుగా సంకేతించారు. సృష్టి స్థితి లయ కారకమైన భగవత్ శక్తులే, పృథ్విలో జల దేవతలుగా, వాయు, అగ్న్యాది పంచభూత శక్తులుగా, ప్రవర్తిల్లుతుంటాయి. చూడడానికి నదులన్నీ ఒకేలా ఉన్నా, వాటి జల లక్షణాలలో తేడాలు ఉంటాయి. అవి భౌతిక విజ్ఞానానికి అందేవి, కొంత మాత్రమే.
అత్యంత సూక్ష్మమైన దైవీయ విజ్ఞానానికి సంబంధించిన దైవీయ విజ్ఞానాలు చాలా ఉన్నాయి. వాటిని దర్శించిన మహర్షులు, ఆయా నదుల్లో ఉన్న దేవతా శక్తుల మహిమను మనం పొందాలని, వాటి విషయాలను అందించారు. దేవతాశక్తులు పృథ్విపై అడుగిడడానికి, దైవీయ భూమికలో జరిగే సంకల్పాలూ, ప్రేరణలే, పురాణ కథల్లో చెప్పారు. మన కోపతాపాలకి స్థాయి అల్పమైనది. దేవతల స్థాయి, లోకకల్యాణార్ధం జరిగే లీలా విలాసం.
🚩 ఓం నమో సూర్యనారాయణాయ 🙏
Post a Comment