కార్తీక మాసంలో దీపారాధనకు ఎందుకంత ప్రాధాన్యత? Karthika Deepam

 

కార్తీక మాసంలో దీపారాధనకు ఎందుకంత ప్రాధాన్యత?

కార్తీకమాసం అనగానే, తెల్లవారు ఝామున స్నానాలూ, ఉభయ సంధ్యల్లో శివకేశవాది ఆలయాలలో దీపారాధనలూ, నదులలో, తటాకాలలో దీపాలను విడిచి పెట్టడం.. చక్కని సందడి!


ఇందులో దివ్యత్వంతో పాటు, ఉత్సాహం, ఉల్లాసం వెల్లివిరుస్తాయి..

చిరు చలిలో బద్ధకాన్ని వదుల్చుకుని చేసే స్నానం, చిరు దీపాలు నీటి అలల్లో తేలియాడుతుంటే ఉండే సౌందర్యం..

ప్రకృతిలో దివ్యత్వాన్ని ప్రతిష్ఠించి, ప్రదర్శించే హైందవ మతంలోని దివ్యకళా చాతురిని కొనియాడవలసిందే..

కార్తీకంలో, దేశమంతా ప్రత్యేకంగా, ఆధ్యాత్మిక చైతన్యంతో విలసిల్లుతుంది. ఎవరికి తగ్గ నియమాన్ని వారు పాటిస్తూ, దైవాన్ని కొలుచుకుంటారు.

కార్తీకం దీపానికీ, మాఘం స్నానానికీ, వైశాఖం దానానికీ ప్రాధాన్యం..

కృత్తికా నక్షత్రం నాడు, పూర్ణిమ ఏర్పడే మాసం కార్తికం..

కృత్తిక అగ్ని నక్షత్రం. అగ్నియందు ఈశ్వర స్వరూపాన్ని ఆవిష్కరించి, ఆరాధించడమే యజ్ఞం..

అందుకే వేదాలలో 'నక్షత్రేష్టి' అనేది, కృత్తికా నక్షత్రంతోనే ప్రారంభమవుతుంది. ఆ యజ్ఞతత్వానికి సంకేతంగానే, 'దీపారాధన' అనేది కార్తీకంలో ప్రధానమయ్యింది..

కార్తీకంలో దీపార్చన, దీప దానం వంటివి, యజ్ఞఫలాలను ప్రసాదిస్తాయి..

భర్తృహరి తన శతక సాహిత్యంలో, పరమేశ్వరుని 'జ్ఞానదీపం'గా అభివర్ణించాడు. ఈ దీపం, యోగుల హృదయ గృహంలో సుస్థిరంగా దీపిస్తోందని సంభావించాడు..

జ్యోతిర్లింగ స్వరూపుడైన శివునకు ప్రతీకగా, ప్రతి దీపమూ ఒక జ్యోతిర్లింగమై భాసిస్తూ, విశ్వవ్యాపకమైన ఈశ్వరజ్యోతిని దర్శించి, ఉపాసించమని ఉపదేశించే మాసమిది..

ఓం నమః శివాయ!

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes