రామ రాజ్యంలో ‘కుక్క తీర్పు’! Lord Rama and the Dog’s Justice


రామ రాజ్యంలో ‘కుక్క తీర్పు’!

‘రామ రాజ్యం’ సువర్ణ రాజ్యం అనే మాట అక్షరాలా నిజం.. ప్రజలను తన కన్నబిడ్డల్లా కాపాడుకునే రాజు కలిగిన రాజ్యం,  ఎల్లప్పుడూ సుభిక్షంగానే ఉంటుంది. రాముడు రాజ్యాన్నేలే సమయంలో, ప్రజలు ఎంతో సంతోషంగా జీవించేవారు. వారికి  ఎటువంటి సమస్య వచ్చినా, రాముడే స్వయంగా పరిష్కరించేవాడు. ప్రజలలో శాంతి సామరస్యాలను నింపేవాడు. అటువంటి రాముడిని, ఒక కుక్క సందిగ్ధంలో పడేసింది. అసలు అక్కడ వచ్చిన సమస్యేంటి? కుక్క రాముడి దగ్గరకు ఎందుకు వెళ్ళింది? కుక్క చెప్పిన తీర్పేమీటి - అనేటటువంటి ఆసక్తికర విషయాలను, ఈ  రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/Jz6P4r4nM3Y ]

రాముడు అయోధ్యను పాలించే రోజుల్లో, ప్రజల సమస్యలను చెప్పుకోవటానికీ, న్యాయం పొందడానికీ, ఒక సభా వేదిక  ఉండేది. సమస్యల్లో ఉండే ప్రజలు, అక్కడున్న ఒక పెద్ద గంటను మ్రోగిస్తే, వెంటనే భటులు వచ్చి, వారిని లక్ష్మణుడి వద్దకు  తీసుకువెళ్ళేవారు. తరువాత లక్ష్మణుడు, వారిని శ్రీ రాముడి వద్దకు తీసుకునిపోయి, తగిన న్యాయం జరిగేటట్లు చేసేవాడు. అలా గడుస్తుండగా, ఒక రోజు సూర్యాస్తమయం తరువాత, ఎవరో ఆ గంటను మ్రోగించారు. భటులు వచ్చి చూసే సరికి, మనుషులెవ్వరూ కనిపించలేదు. దానితో వారు తిరిగి లోపలికి వెళ్ళిపోయారు. మళ్ళీ గంట మ్రోగింది. ఈసారి వచ్చి చూసే సరికి మనుషులు ఎవరూ లేరు కానీ, ఒక కుక్క మాత్రం అరుస్తూ ఉంది. అక్కడున్న వారిలో ఒక భటుడు, రెండవ వాడితో, ‘ఈ కుక్క  ఇందాక కూడా ఇక్కడే ఉంది, బహుశా ఇదే గంట కొట్టిందేమో! అని వారిలో వారు అనుకుని, నవ్వుకుంటూ లోపలికి  వెళ్ళిపోయారు.

ఈ సారి గంట ఆగకుండా మ్రోగుతూ ఉంది. భటులు వచ్చి చూసే సరికి, వారు ఇంతకముందు అనుకున్నట్లు, ఆ కుక్కే గంటకు కట్టిన త్రాడును తన నోటితో పట్టుకుని లాగుతూ, గంటను మ్రోగిస్తూ ఉంది. వారు వెంటనే లక్ష్మణుడి  దగ్గరకు వెళ్ళి, వారు చూసిన విషయం చెప్పారు. అయితే, ఇక్కడొక విషయం ఏంటంటే, జంతువుల భాష సాధారణ మనుష్యులకు అర్థం కాదు. కానీ, అక్కడున్న రామ లక్ష్మణులకీ, సభలో ఉన్న మరికొంత మంది మంత్రులకీ, ఆ జంతువుల  భాషను అర్ధం చేసుకునే విద్య తెలుసు. దాంతో లక్ష్మణుడు ఆ కుక్క దగ్గరకు వచ్చి, ఎందుకు గంట మ్రోగిస్తున్నావు? అని ప్రశ్నించాడు. అప్పుడు ఆ కుక్క, ‘అయ్యా నాకు అన్యాయం జరిగింది. శ్రీ రాముడితో చెప్పుకుని, న్యాయం పొందడానికి వచ్చాను’ అని అన్నది. అప్పుడు లక్ష్మణుడు ‘అయితే సభ లోపలికి వచ్చి, నీ సమస్య రాముడికి వివరించు’ అని అన్నాడు. అప్పుడా కుక్క, ‘మా వంటి జంతువులు సభలోనికిగానీ, గుడిలోనికి గానీ, బ్రాహ్మణుల ఇళ్ళలోనికి గానీ ప్రవేశిస్తే, మనుషులు అసహ్యించుకుని తరిమి కొడతారు. కాబట్టి, నేను ఈ సభ లోపలి రావడానికి, రాజు అనుమతి కావాలి. మీరు వెళ్లి శ్రీ రాముడికి చెప్పండి. వారు అనుమతిస్తేనే లోపలికి వస్తాను’ అని అన్నది.

దాంతో లక్ష్మణుడు రాముడి వద్దకు వెళ్ళి, జరిగిన విషయాన్ని చెప్పి, ‘మీరు అనుమతినిస్తే, ఆ కుక్క లోపలికి వచ్చి, తనకు జరిగిన అన్యాయం గురించి మొరపెట్టుకోవాలనుకుంటోంది’ అని అన్నాడు. వెంటనే రాముడు, ఆ కుక్కను లోపలికి తీసుకురమ్మని చెప్పాడు. లక్ష్మణుడు బయటకు వెళ్లి ఆ కుక్కతో, ‘నీకు లోపలికి రావడానికి, శ్రీ  రాముడు అనుమతినిచ్చారు’ అని చెప్పగా, ఆ కుక్క సభ లోపలికి వచ్చింది. అయితే, ఆ కుక్క తలకి చిన్న దెబ్బ తగిలి, రక్తం  కారడాన్ని, రాముడు గమనించాడు. ఆ కుక్కను చూసి శ్రీ రాముడు, ‘నీకు జరిగిన అన్యాయం ఏమిటో, భయం లేకుండా  చెప్ప’మన్నాడు. అప్పుడు ఆ కుక్క, ‘మహారాజా.. ధర్మ రక్షకులైన మీకు నమస్కరిస్తున్నాను. నేను ఈ రోజు బ్రాహ్మణులు  నివసించే వీధిలో నిలబడి ఉండగా, ఒక సన్యాసి అకారణంగా, తన చేతిలోని కర్రతో, నా తలపై కొట్టి గాయపరిచాడు.  కాబట్టి, అతనిని పిలిచి విచారించి, నాకు న్యాయం చెయ్యండి’ అని చెప్పింది. అప్పుడు రాముడు, ‘ఆ సన్యాసి పేరు చెప్పగలవా?’ అని  అడగగా, తనకు తెలియదని బదులు చెప్పింది కుక్క. అప్పుడు రాముడు భటులను పిలిచి, ‘మీరు ఈ కుక్క చెప్పే ప్రాంతానికి వెళ్లి, దీనిని గాయపరచిన వ్యక్తిని తీసుకుని రండి’ అని ఆజ్ఞాపించాడు.

వారు అక్కడకు వెళ్లి, ‘ఈ రోజు సాయంత్రం ఒక కుక్కను  కొట్టిన సన్యాసి ఎవరో, వారిని రాజుగారు తీసుకుని రమ్మనారు’ అంటూ దండోరా వేశారు. అప్పుడొక సన్యాసి వచ్చి, ఆ వ్యక్తి తానే అని చెప్పగా, భటులు అతనిని తమ వెంట న్యాయ సభకు తీసుకుని వెళ్ళారు. అప్పుడు శ్రీ రాముడు ఆ కుక్కతో, ‘ఇతనేనా  నిన్ను గాయపరిచింది?’ అని అడుగగా, ఆ కుక్క అవునని బదులిచ్చింది. తరువాత రాముడు ఆ సన్యాసిని, ‘నీ పేరు  ఏమిటి? నీవెందుకు ఈ కుక్కను కొట్టావు?’ అని ప్రశ్నించాడు. ఆ సన్యాసి బదులిస్తూ ‘మహారాజా, నా పేరు సర్వర్దశిద్ధుడు. నేను ఈ రోజు ఉదయం నుండి, భిక్ష కోసం చాలా ఇళ్ళు తిరిగాను. కానీ, కొన్ని కారణాల వల్ల, నాకు ఎక్కడా భిక్ష దొరకలేదు. సాయంత్రం అయ్యేసరికి, నాకు ఆకలి ఎక్కువైంది. అలాంటి సమయంలో, ఈ కుక్క నేను పోతున్న దారిలో, నాకు అడ్డగా వచ్చి  నిలబడింది. నేను దీనిని అవతలకు పొమ్మని తరిమాను. కానీ, ఇది అటూ ఇటూ తిరుగుతూ, అక్కడే ఉండి నన్ను ఇబ్బంది పెట్టింది. దాంతో నాకు విసుగు పుట్టి, కోపంతో దీనిని కొట్టాను. దాంతో ఇది దూరంగా వెళ్లి పోయింది. క్షణికావేశంలో ఈ  కుక్కను కొట్టి గాయపరిచాను’ అని రాముడి సభలో ఒప్పుకున్నాడు.

అతను చెప్పింది విన్న రాముడు, ‘కోపం, మిత్రుని వలె, మనతో ఉన్నట్టు ఉంటుంది. కానీ, అది పెద్ద శత్రువు. ఎన్ని పూజలు చేసినా, కోపం విడిచి పెట్టకపోతే, ఆ పూజలు బూడిదలో పోసిన పన్నీటితో సమానం. అందుకే, ముందు కోపాన్ని విడిచి పెట్టాలి. మనం కోరుకున్నది దక్కకపొతే, కోపం వస్తుంది. కాబట్టి, కోరికలపై మోహాన్ని వదిలేయాలి. మనస్సును అదుపులో పెట్టుకోకపొతే, చిన్న నిప్పురవ్వ ఇంటిని కల్చేసినట్లు, కోపం మనిషిని సర్వనాశనం చేస్తుంది’ అని చెప్పాడు. ‘కుక్కను కొట్టిన ఈ సన్యాసి తాను తప్పు చేసినట్టు, అందరి ముందూ ఒప్పుకున్నాడు. కాబట్టి, అతనికి ఎలాంటి శిక్ష వేయాలి?’ అని రాముడు సభలో ఉన్న మంత్రులను అడిగాడు. వారందరూ ఆలోచించి, ఇతనికి  ఎటువంటి శిక్ష వేయాలో, తమకర్థం కావడం లేదని, తప్పుకున్నారు. అప్పుడు రాముడు ఆ కుక్కతో, ‘ఇతనికి ఏ శిక్ష  వేయమంటావో నీవే చెప్పు’ అని అడగగా, అందుకు కుక్క, ‘ఇతనిని కులపతిగా నియమించండి, ఆ అధికార పదవే, ఇతనికి  తగిన శిక్ష’ అని బదులు చెప్పింది. రాముడు దానికి అంగీకరించి, ఆ సన్యాసిని తన ఊరికి కులపతిగా చేశాడు. కుక్క తీర్పుకు, సభలోని వారందరూ ఆశ్చర్యపోయారు.

ఆ తీర్పును రాముడు కూడా సమర్ధించడంతో, మంత్రులు అయోమయంలో పడ్డారు. మహారాజా, కులపతి అయిన వాడు, దేవాలయాల బాధ్యతలు నిర్వహిస్తాడు. వాటికి సంబంధించిన అస్తులన్నీ, అతని  ఆధీనంలోనే ఉంటాయి. అతను దర్జాగా బ్రతుకుతాడు. ఇది అతనికి మీరిచ్చిన వరం అవుతుంది కానీ, శిక్ష ఎలా అవుతుంది? అని ప్రశ్నించారు. అప్పుడు రాముడు, ‘మీ అనుమానాలను ఈ శునకమే తీరుస్తుంది’ అని చెప్పగా, అప్పుడా కుక్క ‘సభాసదులారా, నేను పోయిన జన్మలో, అదే పదవిలో ఉన్నాను. నేను ఎంతో ధర్మంగా ఉండే వాడిని. ప్రజల ధనాన్ని వృధా కాకుండా, సద్వినియోగం చేసేవాడిని. అలాంటి నాకే, ఈ కుక్క జన్మ వచ్చింది. ఇక ఈ కోపిష్టి అయిన సన్యాసి, ఆ పదవిని, కొంతకాలం చేసినా చాలు. అధికార గర్వంతో, అనేక పాపాలు చేస్తాడు. దాంతో, నరకానికి పోతాడు. కాబట్టి, తప్పు చేసిన ఒక  వ్యక్తిని శిక్షించడానికి, అనువైన కారణాలు చట్టబద్దంగా లేనప్పుడు, అతనిని ఎదో ఒక ఉన్నత పదవిలో అధికారిగా నియమిస్తే, వాడి పాపం పండుతుంది.’ అని సమాధానం ఇచ్చింది. శునకం ఇచ్చిన తీర్పుకు రాముడితో సహా, అక్కడున్న వారందరూ  తృప్తిచెందారు.

శ్రీ రామ రక్ష!

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes