శల్య సారధ్యం? కర్ణుడి చావుకు అనేక కారణాలలో ఒక ముఖ్య కారణం! What was the real motive of King Shalya of Mahabharata

 


శల్య సారధ్యం? కర్ణుడి చావుకు అనేక కారణాలలో ఒక ముఖ్య కారణం!

ధర్మ తత్త్వజ్ఞులు ధర్మశాస్త్రమనీ, ఆధ్యాత్మవిదులు వేదాంతమనీ, నీతి విచక్షణులు నీతి శాస్త్రమనీ, కవులు మహాకావ్యమనీ పేర్కొనే మహాభారతంలో ఉన్న పాత్రలన్నీ ప్రత్యేకమే. వాటిలో ఒక ప్రముఖ పాత్ర, శల్యుడిది. 'శల్య సారధ్యం' అనే మాటను మన పెద్దల నోట వింటూ ఉంటాం. మద్ర దేశాధీశుడైన శల్యుడు, కురుక్షేత్రంలో కౌరవుల తరుపున పోరాడినా, కర్ణుడి ఓటమికి ఎలా కారణమయ్యాడు? పాండవుల మేనమామ, కౌరవుల పక్షాన పోరాడడానికి కారణం ఏంటి? ప్రత్యేక శక్తులతో గొప్ప వీరుడిగా పేరుగడించిన శల్యుడు, ధర్మరాజు చేతిలో మరణించడానికి అసలు కారణం - వంటి ముఖ్య ఘట్టాల గురించి తెలుసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను పూర్తిగా చూడండి..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/dcA8F2bMWxo ]

శల్యునికి, వారసత్వంగా మద్ర రాజ్యం వచ్చిన మాట నిజమే అయినా, ఆ రాజ్యాన్ని కాచుకోగల పరాక్రమం, అతని సొత్తు. అస్త్ర విద్యలోనూ, గదాయుద్ధంలోనూ, రథాన్ని తోలడంలోనూ, శల్యుని ప్రతిభ అసామాన్యం. పాండురాజు రెండవ భార్య మాద్రికి సోదరుడు, శల్యుడు. నకుల, సహదేవులకు, ఇతను సొంత మేనమామ. శల్యుడికి రుక్మ రథుడనే కుమారుడు కూడా ఉన్నాడు. అంతేకాకుండా, శల్యునికి ఒక ప్రత్యేక శక్తి ఉంది. అతని ఎదురుగా నిలబడి ఎవరైతే యుద్ధం చేస్తారో, వారి మనసులో ఎంత క్రోధం ప్రబలుతూ ఉంటే, శల్యునికి అంత బలం చేకూరుతుంది. కురుక్షేత్ర సమయంలో శల్యుడిని తన పక్షాన చేర్చుకోవాలనుకున్నాడు, దుర్యోధనుడు. పాండవులు స్వయనా సోదరి కొడకులు కాబట్టి, వారికి వ్యతిరేకంగా పోరాడేందుకు శల్యుడు ఒప్పుకోడని తెలిసి, ఒక పన్నాగం పన్నాడు.

పాండవుల అజ్ఞాతవాసం ముగిసిన తరువాత, వారిని పలుకరించేందుకు శల్యుడు బయలుదేరాడు. కానీ, మార్గ మధ్యలో శల్యునికి, అంగరంగ వైభవోపేతమైన గుడారాలు కనిపించాయి. అవన్నీ పాండవులవే అని తలచి, వాటిలోకి ప్రవేశించాడతను. ఆ గుడారాలలోకి శల్యుడు ప్రవేశించగానే, సేవకులతనికి సాదరంగా స్వాగతం పలికి, అద్భుతమైన విందును ఏర్పాటు చేశారు. ఇదంతా పాండవులు తనకోసం ఏర్పాటు చేసిన విందు కార్యక్రమమనుకుని మురిసిపోయాడు శల్యుడు. విందు ముగిసిన వెంటనే, తన వద్ద ఉన్న సేవకుని పిలచి, ‘తక్షణమే వెళ్లి, మీ స్వామిని పిలుచుకు రా! రాబోయే కురుక్షేత్ర సంగ్రామంలో, నా మద్దతును ఆయనకు తెలుపుతాను' అంటూ ఆజ్ఞ జారీ చేశాడు. వెంటనే సైనికుడితో పాటు దుర్యోధనుడు లోపలికి వచ్చేటప్పటికి, శల్యుడు ఖంగుతిన్నాడు. కానీ జరగాల్సిన పొరపాటు జరిగిపోయింది. అన్న మాటను వెనక్కు తీసుకోవడం రాజధర్మం కాదు. అందుకే, కురుక్షేత్రంలో కౌరవుల పక్షానే తన సర్వ సేనలనూ నిలిపేందుకు నిశ్చయించుకున్నాడు.

కానీ, పాండవుల మీదున్న మమకారంతో, అక్కడి నుండి హుటాహుటిన బయలుదేరి, ధర్మరాజును కలుసుకుని, దుర్యోధనుడు తనను ఏరకంగా మభ్య పెట్టాడో, వివరించాడు. దుర్యోధనుడి కుట్రకు తగిన ఉపాయాన్ని ఆలోచించి, శల్యునితో, ‘జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు వారి పక్షాన యుద్ధం చేసినా, మాకొక సహాయం చేస్తానని మాట ఇవ్వగలవా?' అని అడిగాడు ధర్మరాజు. దానికి సంతోషంగా సరేనన్నాడు శల్యుడు. ‘నువ్వు రథాన్ని అద్భుతంగా తోలగలవు కాబట్టి, బహుశా ఏదో ఒక రోజున నీకు కర్ణుని రథానికి సారథ్యం వహించే బాధ్యతను అప్పగిస్తారు. ఆ సమయంలో నువ్వతడిని అడుగడుగునా అవహేళన చేస్తూ, అతని ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీయాలి. నీ మాటలతో అతను మానసికంగా క్రుంగిపోవాలి.' అని చెప్పి, శల్యుడి దగ్గర మాట తీసుకున్నాడు ధర్మరాజు.

ఆ విధంగానే, కురుక్షేత్ర సంగ్రామంలో 17వ రోజున, కర్ణుడి రథాన్ని నడిపే బాధ్యతను, శల్యునికి అప్పగించాడు దుర్యోధనుడు. అదే అదను కోసం ఎదురుచూస్తున్న శల్యుడు, అడుగడుగునా అతడిని సూటిపోటి మాటలతో దెప్పిపొడుస్తూ, పాండవులను వేనోళ్ల పొగడుతూ, కర్ణుడిని కృంగదీశాడు. కానీ, కర్ణుని పరాక్రమాన్ని ప్రత్యక్షంగా గమనిస్తున్న శల్యునికి, అతనిపై గౌరవం పెరిగింది. అందుకే, ఒకానొక సమయంలో కర్ణుడు విడిచే అస్త్రాన్ని, అర్జునుని తల మీదకు కాకుండా, ఛాతీ మీదకు గురిపెట్టమని సూచించాడు. కానీ, అప్పటికే శల్యుని పట్ల అపనమ్మకం ఏర్పడిపోయిన కర్ణుడు, అతని మాటను పట్టించుకోక, అమూల్యమైన అవకాశాన్ని కాస్తా, చేజార్చుకున్నాడు. ఆ సమయంలో కృష్ణుడు రథాన్ని తొక్కిపట్టడంతో, ఆ అస్త్రం కాస్తా, అర్జునుని తల మీదుగా వెళ్లిపోయింది. అయితే, అప్పటికే కర్ణునికున్న శాపాలు ఒక్కొక్కటిగా ఫలించడంతో, అర్జునుని చేతిలో మరణం సంభవించింది. అలా కర్ణుని చావుకి ఉన్న వంద కారణాలలో, శల్య సారధ్యం కూడా ఒకటిగా మిగిలిపోయింది. అందుకే 'ఏదైనా బాధ్యతను నమ్మి ఒకరి చేతికి అప్పగించినప్పుడు, వారు దానిని చేజేతులారా చెడగొట్టడాన్ని, శల్య సారథ్యం' అంటాం.

ఇక కర్ణుని మరణం తరువాత, కౌరవ సేన చిన్నబోయింది. మర్నాడు యుద్ధాన్ని నడిపించగల యోధుడెవరా అని ఆలోచించిన దుర్యోధనుడికి, శల్యుడే గుర్తుకువచ్చాడు. అలా 18వ రోజున కురుక్షేత్ర సంగ్రామంలో, కౌరవసేనకు శల్యుడు నాయకత్వం వహించాడు. ఆ ఘట్టాన్నే, శల్యపర్వం అంటారు. కర్ణుడి విషయంలో, ఇచ్చిన మాటకు కట్టుబడిన శల్యుడు, అతడి ఓటమికి కారణమయ్యాడే కానీ, యుద్ధరంగంలో అతని పరాక్రమం, వీరోచితమనే చెప్పాలి. కురుక్షేత్ర యుద్ధం మొదలైన తొలిరోజునే, ఉత్తరకుమారుని సంహరించాడు. ఇక సేనాపతి బాధ్యతను వహించిన తరువాత, అతడి పోరాట పటిమను అడ్డుకోవడం, ఎవరి తరమూ కాలేదు. నకులుడూ, సహదేవుడూ, సాత్యకీ, ఇలా పలువురు యోధులు ఒక్కసారిగా మీద పడుతున్నా, వారిని చిత్తుచేసి పారేస్తున్నాడు శల్యుడు. దానికి కారణం, ఎదుటివారిలోని క్రోధం, తనకు బలంగా మారడం. సాధారణంగా యుద్ధం చేసేవారెవరైనా, కోపంతోనే కలబడతారు. 

శల్యునికున్న బలం తెలిసిన కృష్ణుడు, అతన్ని సంహరించే బాధ్యతను ధర్మరాజుకే అప్పగించాడు. ఎందుకంటే, ధర్మరాజు పరమ శాంత స్వభావి. ధర్మం కోసం యుద్ధం చేస్తున్నాననే భావనతో తప్ప, ఎదుటివాడిని చంపాలన్న కాంక్షతో యుద్ధం చేసే నైజం కాదు. కాబట్టి, శల్యునితో యుద్ధం చేయగల సమవర్తి, ధర్మరాజు. అలా వీరి మధ్య జరిగిన పోరులో, అనేకసార్లు శల్యునిదే పైచేయి అయినప్పటికీ, తుట్టతుదకు ధర్మరాజు వదిలిన బాణానికి, శల్యుడు నేల కూలక తప్పలేదు. అలా భారతంలోని శల్యపర్వంలో, శల్యుని కథ ముగిసింది.

కృష్ణం వందే జగద్గురుం!

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes