మానం అవమానం! మంచిమాట Most Admired Personalities

 


మానం అవమానం! మంచిమాట

కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాతకం ।
మౌనేన కలహో నాస్తి, నాస్తి జాగరతో భయం ।।

కృషి వల్ల కరవుండదు. అంటే, వ్యవసాయాన్ని జీవనోపాధిగా మలచుకుని జీవించే జనం ఉండే సమాజానికి, కరవు కాటకాలు ఎదురుకావు. పట్టుదలతో పనిచేసేవాడికి, ఫలితం తప్పక ఉంటుందని చెబుతారు. జపం వల్ల పాపం నశిస్తుంది. మౌనంగా ఉంటే, కలహం ఉండదు. మెలకువగా ఉండేవానికి భయం ఉండదనేది, మన సనాతన ధర్మ నానుడి.

దేశంకోసం, సమాజం కోసం, పరోపకారం కోసం తమ జీవిత కాలాన్నంతటినీ వినియోగించేవాళ్ళు ఉత్తములు. వీరికి 24 గంటల సమయం తక్కువ. ఎందుకంటే ప్రతి క్షణమూ వీరికి విలువైనదే. ఇలాంటి మహనీయులు లోకంలో, చాలా తక్కువమంది ఉంటారు. ఇటువంటి మహనీయులను కాక, మిగతావారిని రెండు విభాగాలు చేయవచ్చును. ఇలాంటి ఎన్నో మంచి విషయాలు తెలుసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి, మీ అభిప్రాయాన్ని తెలియజేయండి..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/jRZISK3gne0 ]

తీరిక వేళలలో సత్కాలక్షేపం చేసేవారు ఒక వర్గం అయితే, ఉబుసుపోక ఇతరుల కాలాన్ని కూడా వృధా చేస్తూ, విసిగిస్తూ, కబుర్లు చేసేవారు మరొక వర్గం. ఈనాడు చాలామంది విలువైన కాలాన్ని, వాట్సప్ మెసేజీలతో, ఫేస్‌బుక్‌లతో, ఛాటింగ్‌లతో, గాసిప్‌లతో, టీవీ సీరియల్స్‌ను చూడటంలో వృధా చేస్తున్నారు. ఉత్పాదకత లేని వ్యాసంగాలవి. సంగీత సాహిత్యాదులతో, సద్గోష్ఠులతో, ఇంటినీ, పెరటితోటనూ, పరిససరాలనూ తీర్చిదిద్దడంలో, ఇతర ఉపయోగ్యములైన వ్యావృత్తులతో సమయాన్ని వినియోగించడం, మేలైన పని. తమ తీరిక వేళల్లో ఇలా ఉత్తమమైన పనులతో, శారీరక, మానసిక ఉల్లాసాన్ని తాము పొందుతూ, తోటివారు పొందేలాగా కాలాన్ని వినియోగించవచ్చును. ఇటువంటివారు, ద్వితీయ శ్రేణికి చెందినవారుగా పరిగణించవచ్చు.

ఇక చివరివర్గంవారు, తమ సమయాన్నీ, ఇతరుల కాలాన్నీ వృధా చేసేవారు. పొద్దు ఎలా గడపాలో తెలియక, ఇరుగిళ్ళకో, పొరుగిళ్ళకో అనవసరంగా వెడుతుంటారు. అక్కడ ఏవేవో పోచికోలు కబుర్లు చెప్పడం, ఇతరుల గురించి లేనిపోని విషయాలు చర్చించడం, విమర్శలు చేయడం, అభాండాలు వేయడం, చాడీలు చెప్పడం, ఇలాంటి పనికిమాలిన పనులతో, తమ కాలాన్నీ, ఎదుటివారి కాలాన్నీ పాడుచేస్తుంటారు. ఇది కూడని పని. ఇలాంటివారి గురించి ఒక సామెత వుంది. ‘లబ్ధ్వాపి కామధేనుంతే లాంగలే వినియుజ్యతే’ అని.

‘కోరిన కోరికలు తీర్చే కామధేనువు లభిస్తే, దాని విలువ తెలుసుకోలేక, దానిని పొలం దున్నడానికి ఉపయోగించడం’ అని ఈ మాటకు అర్థం. అమూల్యమైన కాలాన్ని, ఇరుగుపొరుగులతో బాతాఖానీ కోసం వినియోగించేవారు కూడా, ఇలాంటి మూర్ఖులే. ఏదైనా తప్పనిసరి పని ఉంటేనో, ఆహ్వానించబడితేనో తప్ప, ఎవరింటికీ వెళ్ళకూడదు. ఇక, అసలు విషయంలోకి వెళితే..

వయస్సు, ధనం, గృహ కలహాలు, మంత్రం, ఔషధం, దాంపత్యం, దానం, మానం, అవమానం, ఈ విషయాల్లో, విధిగా మౌనాన్ని పాటిస్తూ ఉండాలని, పెద్దలు సూచించారు. అంటే, ఈ విషయాలను ఇతరులకు వెల్లడించరాదని, అర్థం. మానాన్నీ, అవమానాన్నీ సమానంగా తీసుకుని ముందుకు సాగేవారు, తమ గమ్యాన్ని త్వరగా చేరుకుంటారు. అప్పుడు మానం, అవమానం, రెండూ మధురంగానే కనిపిస్తాయి. మాన్యులంటే, గౌరవింపదగినవారు. ఉత్తములు అందరినీ మాన్యులుగానే భావిస్తారు. మాన్యతకు అర్హతలేమిటి? ధనమా, సిరి సంపదలా, జ్ఞానమా, వయస్సా, అనుభవమా, ఏవైనా ప్రత్యేక లక్షణాలా? వాస్తవానికి ఇవేమీ కావు.

ప్రత్యేకతల వల్ల లభించే గౌరవం, తాత్కాలికమే. ఆ ప్రత్యేకతలు తొలగిపోయినప్పుడు, గౌరవం సైతం కరిగిపోతుంది.

ప్రపంచాన్ని శాసించే దిక్పాలకులు రావణుడికి బందీలైనప్పుడు, వారి ప్రాభవం అడుగంటింది. ఆంజనేయుడు విడిపిస్తే గానీ, వారు పూర్వ వైభవాన్ని తిరిగి పొందలేదు. ఆ కారణంగానే, గ్రహ దోష నివారణకు మారుతిని ఆరాధించాలంటారు.

ఎంతటి వారికైనా పదవిలో ఉన్నంతవరకే ‘పరపతి’. ఆ వైభవం అంతరించగానే, అంతవరకూ చక్రం తిప్పినవారు సైతం, సాధారణ వ్యక్తులుగా మారిపోతారు. ఉత్తములకు ఈ సమస్య ఉండదు. వారి సౌజన్యం, చంద్రుడి చుట్టూ వెన్నెలలా, అందరినీ ఆహ్లాదపరుస్తుంది. సర్వజన ప్రియుడిగా మార్చేస్తుంది.

ఈ సత్యాన్ని అర్థం చేసుకున్నవారు, అందరితోనూ ఆత్మీయంగా ఉంటారు. సమభావంతో మసలుతారు. ఇతరులు తమకు నచ్చినట్లుగా వ్యవహరిస్తూ, ఆగ్రహానుగ్రహాలకు వశులై, కొందరికి ఇష్టులుగా, మరికొందరికి అయిష్టులుగా మెలుగుతుంటారు. మానవ సంబంధాలు ఉత్తమంగా ఉండాలనుకునేవారు, ప్రయత్నించి తమ ప్రవర్తనను మార్చుకుంటారు. సాధ్యమైనంత ఎక్కువ హృదయాలకు, చేరువవుతారు.

జీవితంలో మౌనానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. మౌనంగా ఉన్నప్పుడే, చేతులు దక్షతను ప్రదర్శిస్తాయి. పనులను బాగా చేయగలుగుతాయి. మాటలు తగ్గించి, మనస్సును లక్ష్యంపై పెడితే, పనిలో ఏకాగ్రత కుదురుతుంది. నోరు మాట్లాడకుండా ఉన్నప్పుడే, హృదయం మాట్లాడుతుంది. వేదాలూ, పురాణాలు కూడా, మౌనానికే ప్రాధాన్యం ఇచ్చాయి. ఇక్కడ మౌనం అంటే, కేవలం మాట్లాడకుండా ఉండటం మాత్రమే కాదు. బాహ్య మౌనం కంటే, మానసిక మౌనమే ముఖ్యం. మౌనంగా ఉండటం వల్ల, అంతులేని మనశ్శాంతి కలుగుతుంది. అందుకే, మౌనాన్ని తపస్సు అంటారు. మౌనాన్ని పాటిస్తూ, తపోదీక్షలో ఉన్నవారే మునులు.

ఈ లోకంలో మన జ్ఞాపకాలు, ఆత్మీయుల మనస్సుల్లో అమృత బిందువులు కావాలి. ఆత్మీయులు, మన గురించి తెలియని వారికి కూడా ఎంతో ఘనంగా చెబుతారు. అదే మన కీర్తి పతాకం. జెండా ఎవరు ఎగురవేసినా, అది రెపరెపలాడుతూ కనువిందు చేస్తుంది. మంచివారి స్మృతులు సైతం, అలాంటివే.

అహంకారం, అగ్నిశిఖ వంటిది. అది ప్రదర్శించినవారినే, అంతం చేస్తుంది. నవనందులు - మహాజ్ఞానీ, ఆత్మాభిమానీ అయిన చాణక్యుడి శిఖను పట్టుకుని సభలో ఈడుస్తూ, ఘోరంగా అవమానించారు. ఫలితంగా, అనంతర కాలంలో, వారు రాజ్యాధికారం కోల్పోయారు.
రావణుడూ, వాలీ, తమ సోదరులను దారుణంగా అవమానించి, ఏ విధంగా నష్టపోయారో, మనకు తెలిసిందే. ద్రౌపదిని అవమానించిన కౌరవులూ, సమూలంగా నాశనమయ్యారు.

వసిష్ఠ-విశ్వామిత్రుల కథా, ఇందుకు భిన్నం కాదు. వసిష్ఠుడిపై విశ్వామిత్రుడి శక్తులేవీ పని చేయలేదు. అలా జరుగుతున్న కొద్దీ, అవమానంతో రగిలిపోయిన విశ్వామిత్రుడు, చివరకు రాజీపడ్డాడు.

ఎంతటివారికైనా, కోపం వల్ల కార్యభంగం తప్పదు. ఓర్పుతోనే, కార్యసాఫల్యం లభిస్తుంది. సహనం గొప్ప శక్తి. అనేక సంవత్సరాలు కఠిన తపస్సు చేసిన పార్వతీదేవి, కనీసం ఆకులనూ, ఆహారంగా స్వీకరించకుండా, ‘అపర్ణ’ అనిపించుకుంది. సాక్ష్యాత్ మహాదేవుణ్ని పతిగా పొందింది.

చీకట్లు అంతరించగానే మనోహరమైన ఉదయం సాక్షాత్కరించినట్లు, కష్టాల తరవాత సుఖాలు వేచి ఉంటాయి. అంతవరకూ నిరీక్షణ తప్పదు.

మనిషి మానావమానాలనూ, సుఖ దుఃఖాలనూ, శీతోష్ణాలనూ, సమ దృష్టితో చూడాలంటాడు గీతాచార్యుడు. దీనినే ‘స్థితప్రజ్ఞూత’ అంటారు. శ్రీకృష్ణుడు స్వయంగా, స్థితప్రజ్ఞుడు. ఆధ్యాత్మిక సోపానాలకు స్థితప్రజ్ఞత, వెలుగుదారి వంటిది. మనమూ, ఆ బాటలోనే నడిచే ప్రయత్నం చేద్దాం!

కృష్ణం వందే జగద్గురుం!

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes