తక్షశిల విశ్వవిద్యాలయంలో చాణక్యుడు చెప్పిన అద్భుతమైన నీతి కథ! Chanakya Niti

 

తక్షశిల విశ్వవిద్యాలయంలో చాణక్యుడు చెప్పిన అద్భుతమైన నీతి కథ!

అన్నివైపులనుండీ సమస్యలు చుట్టుముడుతున్నప్పుడు, మనమందరమూ ఏం చేయాలో! ఎలా స్పందించాలో..! ఇంచుమించు 2300 సంవత్సరాల క్రితం, తక్షశిల విశ్వవిద్యాలయంలోని విద్యార్థులకు చాణక్యుడు చెప్పిన ఈ అద్భుతమైన నీతి కథ ద్వారా తెలుసుకుని, మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/5_2r_arldt4 ]

ఒక అడవిలో, ఒక లేడి భారంగా అడుగులు వేస్తూ వెడుతోంది. అది నిండు గర్భిణి. దానికి అప్పుడే నొప్పులు వస్తున్నాయి. అది ప్రసవానికి అనుకూలమైన ప్రదేశం కోసం వెదుకుతోంది. దానికి ఒక దట్టమైన గడ్డి భూమి కనబడింది. ఆ ప్రదేశానికి అటుప్రక్క నది ప్రవహిస్తోంది. అదే అనుకూలమైన ప్రదేశం అనుకుంది లేడి. నొప్పులు మొదలయ్యాయి. నిట్టూర్పులు విడుస్తూ, అటూ ఇటూ తిరుగుతోంది. అప్పుడే, దట్టమైన మబ్బులు కమ్మాయి. ఉరుములూ, పిడుగులూ..

పిడుగు పడి కొద్ది దూరం లోనే, గడ్డికి నిప్పంటుకుంది. దూరంగా తన ఉనికిని గమనించి, కుడి వైపు నుండి ఒక సింహం వస్తోంది. ఎడమవైపు నుండి ఒక వేటగాడు, బాణం సరి చూసుకుంటున్నాడు. ఇంకో వైపు నది వెళ్ళనివ్వదు!

భగవాన్! ఆ లేడి ఇప్పుడు ఏమి చెయ్యాలి? 
ఏం జరగబోతోంది?
లేడి బిడ్డకు జన్మనిస్తుందా? ఆ బిడ్డ బ్రతుకుతుందా?
సింహం లేడిని తినేస్తుందా?
వేటగాడు లేడిని చంపేస్తాడా?
నిప్పు లేడి వరకూ వచ్చి, లేడి కూనను కబళించేస్తుందా?
ఒక వైపు నిప్పూ, రెండవ వైపు నదీ, మిగిలిన రెండు వైపులా, మృత్యువు రూపంలో వేటగాడూ, సింహం..

కానీ, లేడి మాత్రం, ఇవేవీ పట్టించుకోలేదు. అది తన బిడ్డను కనడం మీదే దృష్టిని పెట్టింది.. అప్పుడు పరిణామాలు ఇలా జరిగాయి..
పిడుగు కాంతికి వేటగాడి కళ్ళు చెదిరాయి. గురి తప్పి, బాణం సింహానికి తగిలింది. వర్షం పడి, సమీపిస్తున్న మంటలు ఆరిపోయాయి. లేడి పిల్ల, తల్లి గర్భంలోనుండి బయటకు వచ్చింది. అది ఆరోగ్యంగా ఉంది..

ఏది జరిగితే అది జరగనీ.. నేను బిడ్డకు జన్మనివ్వడం మీదనే దృష్టిని పెడతానని లేడి అనుకోకుండా, ప్రాణం గురించి ఆలోచించి తప్పటడుగు వేసి ఉండి వుంటే ఏం జరిగేది???

మన జీవితాలలో కూడా, అన్ని వైపులా సమస్యలు చుట్టు ముడుతూనే ఉంటాయి. నెగటివ్ ఆలోచనలతో సతమవుతూనే ఉంటాము. మన తక్షణ కర్తవ్యాన్ని విస్మరిస్తాము. భగవంతుడిపై భారం వేసి, మన పని మనం చెయ్యడమే, మన కర్తవ్యం. మనకు జరగాల్సిన మంచేదో ఆయనే చూసుకుంటాడు..

సర్వేజనాః సుఖినోభవంతు!

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes