హిమాలయాలకు ఉత్తర భాగాన ఉన్న గుప్త నిధి రహస్యాన్ని తెలియజేసిన సంవర్తనుడు!


హిమాలయాలకు ఉత్తర భాగాన ఉన్న గుప్త నిధి రహస్యాన్ని తెలియజేసిన సంవర్తనుడు!


మరుత్తు తలపెట్టిన అశ్వమేధ యాగం! రెండవ భాగం - భీష్ముడి విషయంలో చింతిస్తున్న ధర్మరాజుకు, అశ్వమేధ యాగం చేసి, దాన ధర్మాలు చేయమని హితవు చెప్పాడు, వ్యాసుడు. అందుకు కావాల్సిన సంపద, నిధి రూపంలో ఉందనీ, దానిని చేజిక్కించుకోమనీ సలహా ఇచ్చి, మరుత్తు మహారాజు కథనూ, బృహస్పతి అతనిని అవమానించడం, నారదుడి సలహా మేరకు, సంవర్తనుడిని కలిసి యాగానికి ఉపద్రష్టగా ఉండమని వేడుకోవడం, మన గత వీడియోలో తెలుసుకున్నాము. ఇక ఈ రోజుటి మన వీడియోలో, సంవర్తునుడు విధించిన షరతు ఏంటి? అందుకు మరుత్తు ఒప్పుకున్నాడా? యజ్ఞ వాటిక మొదలు, సమస్త సామగ్రినీ బంగారముతో చేయించిన మరుత్తుకు, అంత సంపద ఎక్కడి నుండి వచ్చింది? మరుత్తు యాగం పూర్తయ్యిందా? అనేటటువంటి విషయాలను, తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/SpDeK1UDtbg ]

సంవర్తునుడు పెట్టిన షరతు ఏంటంటే, ఏకారణం చేతనూ, యాగం భగ్నం కాకూడదు. నీ యాగానికి ఉపద్రష్టగా వ్యవహరిస్తున్నానని నా అన్నకు తెలిస్తే, అతడు నీపై గల ద్వేషంతో, యజ్ఞమునకు భంగం కలిగిస్తాడు. ఒకవేళ, అలా జరిగినా, ‘నేను నిన్ను శపిస్తాను’ అని హెచ్చరించి, కార్యమును జాగ్రత్తగా నిర్వహించమని, సూచించాడు. అందుకు మరుత్తు, 'నాకు మీ కృప లభించింది. నాకిక విచారములేదు. దేవేంద్రుడూ, ఇంద్రుడే కాదు, పరమేశ్వరుడే అడ్డువచ్చినా, నేనిక చలించను. నేను నా ప్రయత్నంలో విఫలమైతే, సూర్యుడూ, చంద్రుడూ ఉన్నంత కాలం, నాకు పుణ్యలోకాలు ఉండవు' అంటూ శపధం చేశాడు. అయితే సంవర్తనుడు, మహేంద్రుడి కంటే ధనవంతుడిని చేసి, తన చేత యాగం చేయిస్తానంటూ మరుత్తుకు మాట ఇచ్చాడు. అంత సంపద ఎలా సాధ్యం అని అడగగా, ‘హిమాలయాలకు ఉత్తరభాగాన, ముంజవంతం అనే పర్వతం ఉంది. అక్కడ శివుడు, పార్వతితో కలసి, దేవతలూ, సిద్ధులూ, గరుడులూ, గంధర్వులూ మొదలైన వారితో చేరి, విహరిస్తుంటారు. అక్కడ ఆకలి దప్పులూ, రోగాలూ మొదలైనవి ఉండవు. ఆ పర్వతం మీద అనేక బంగారు కొండలూ, బంగారుమయమైన ఇసుకా, పుష్కలంగా లభిస్తుంది. మనం అక్కడకు పోయి, శివపార్వతులను ప్రార్ధించి, వారి కరుణతో, బంగారు రాళ్ళనూ, ఇసుకనూ తీసుకు వద్దాం, నీవు సేవకులను సిద్ధం చేసుకో. ఎంతమందిని అక్కడకు తీసుకువెళితే, అంత సంపదను తెచ్చుకోవచ్చు’ అంటూ, తన ఆలోచనను మరుత్తుకు తెలియజేశాడు.

సంవర్తనుడి ఆజ్ఞ ప్రకారమే, మరుత్తు తన సైన్యంతో వెళ్లి, పార్వతీ, పరమేశ్వరులను ప్రార్ధించి, వారి కరుణతో అంతు లేని సంపదలను తీసుకుని, నగరానికి వచ్చాడు. ఆవిధంగా, మరుత్తు ధనవంతుడై, యజ్ఞ వాటిక మొదలు, సమస్త సామగ్రినీ బంగారముతో చేయించి, మహా వైభవంగా యజ్ఞం ప్రారంభించాడు. ఈ సంగతి తెలుసుకున్న బృహస్పతి, తనలో తాను కృంగి కృశించి పోయాడు. దేవేంద్రుడు అది గమనించి, 'దేవతలకు గురువైన మీరిలా ఎందుకు శోకిస్తున్నారు? ఇందుకు కారణమైన వారెవరో చెప్పినట్లైన, వారిని నేను కఠినంగా శిక్షిస్తాను' అని అన్నాడు. అప్పుడు బృహస్పతి, జరిగిన విషయాన్నీ, మరుత్తు యాగానికి తన విరోధి అయిన సంవర్తనుడు ఉపద్రష్టగా ఉన్న సంగతినీ, తెలియజేశాడు. అతడు ఉపద్రష్టగా ఉండి యజ్ఞము చేయిస్తున్నందుకు, నా మనస్సు చాలా చింతిస్తోంది. అతడిని ఎలాగైనా ఉపద్రష్టగా ఉండకుండా నిరోధించాలి! అని ఇంద్రుడితో వాపోయాడు. వెంటనే అగ్నిని పిలిపించి, ‘నీవు ఎలాగైనా మరుత్తును, ఆ యజ్ఞమునకు బృహస్పతిని ఉపద్రష్టగా ఉంచమని, నా మాటగా చెప్పి, అతను అంగీకరించేలా చేయాలి’ అని అన్నాడు. ఇంద్రుడి మాట ప్రకారం, తన నిజస్వరూపంతో మరుత్తు దగ్గరకు వెళ్లగా, అతడు అగ్ని దేవుడికి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి, సత్కరించాడు. అప్పుడు అగ్నిదేవుడు తన రాక వెనుక దాగిన మర్మాన్ని వివరించాడు. తాను దేవేంద్రుడి దూతగా వచ్చానంటూ, 'బృహస్పతి, నీ యజ్ఞానికి యాజకత్వం వహించడానికి అంగీకరించాడు. అందువలన, నీవు మానుష్యత్వం వీడి, దైవత్వం పొందవచ్చు. కనుక నీవు బృహస్పతిని యాజకుడిగా చేసి, యజ్ఞము నిర్వహించు' అని చెప్పాడు.

అందుకు మరుత్తు వినయంగా, దేవ గురువు బృహస్పతికి శతకోటి నమస్కారాలు చేసి, ‘నేను చేయబోవు యజ్ఞానికి యాజకుడిగా ఉండమని చెప్పినప్పుడు, ఆయన నన్ను మానవుడనని చులకన చేసి, నిరాకరించాడు. నేను తరువాత కష్టపడి, బృహస్పతి తమ్ముడిని అతి ప్రయాసతో, నా యజ్ఞానికి యాజకుడిగా ఉండడానికి సమ్మతింపచేసి, యజ్ఞముకు కావలసిన ఏర్పాట్లు చేస్తున్నాను. ఈ యాగానికి సంవర్తనుడు సమర్ధుడని నమ్ముతున్నాను’ అంటూ సమాధానమిచ్చాడు. మరుత్తుని ఒత్తిడి చేస్తున్న అగ్ని దేవుడి మాటలను సావధానంగా విన్న సంవర్తనుడు ఇక సహించలేక, 'అగ్నిదేవా! నీవింకా ఇలా మాట్లాడుతుంటే, నేను నిన్ను, నా కంటి చూపుతో కాల్చివేస్తాను' అని అరిచాడు. ఆ మాటలకు అగ్నిదేవుడు భయపడి, దేవేంద్రుని వద్దకు తిరిగి వెళ్ళిపోయాడు. మరుత్తు తన మాటలకు ప్రభావితం కాలేదనీ, అతనిని బలవంత పెట్టడానికి ప్రయత్నించడం చూసిన సంవర్తనుడు ఆగ్రహించి, నన్ను భస్మం చేస్తానని హెచ్చరించాడనీ చెప్పాడు.

ఇంద్రుడు అగ్ని దేవుడితో, 'నీవు తిరిగి వెళ్ళి మరుత్తును ఎలాగైనా, నయానో, భయానో, బృహస్పతి యాజకత్వానికి ఒప్పించు. అలా ఒప్పుకోక పోతే, నా వజ్రాయుధాన్ని ప్రయోగించి, అతడిని యమ సదనానికి పంపుతానని బెదిరించు' అని చెప్పాడు. 'దేవేంద్రా! నాకు తిరిగి వెళ్ళాలంటే భయంగా ఉంది. సంవర్తనుడు నన్ను భస్మం చేస్తాడని భయపడుతున్నాను. కనుక నా బదులుగా వేరెవరినైనా పంపు' అని అన్నాడు. ఇక గత్యతరం లేక అగ్ని దేవుడిని వదిలి, ధృతరాష్ట్రుడనే గంధర్వుడిని, మరుత్తు వద్దకు పంపాడు. అయితే, ముందుగా జరిగిన విషయమేదీ, గంధర్వుడైన ధృతరాష్ట్రుడికి తెలియదు. ఇంద్రుడి మాట ప్రకారం, మరుత్తుతో సంవర్తనుడి ముందు, తాను వచ్చిన పనిని వివరించాడు. 'నీ యాగమునకు బృహస్పతిని యాజకుడిగా నియమించు. లేకపోతే తన వజ్రాయుధాన్ని నీ పై ప్రయోగించగలడు' అని హెచ్చరించాడు. అయితే, బృహస్పతి అన్న మాటలూ, తరువాత జరిగిన పరిణామాలూ మరుత్తు వివరిస్తుండగానే, ఇంద్రుడు ప్రయోగించిన వజ్రాయుధం, అతని వైపుకు దూసుకు వచ్చింది. దానిని చూపిస్తూ ధృతరాష్ట్రుడు, 'రాజా! అటుచూడు. వజ్రాయుధం నీ మీదకు దూసుకు వస్తోంది. దానిని ఎలా ఎదుర్కుంటావో, నీ ఇష్టం' అంటూ బెదిరించసాగాడు. ఇంతలో తన వైపుకు వస్తున్న వజ్రాయుధాన్ని చూసి, ‘నన్ను ఈ వజ్రాయుధం బారి నుండి రక్షించండి’ అంటూ సంవర్తనుడిని వేడుకున్నాడు. అప్పుడు సంవర్తనుడు చిరునవ్వు నవ్వి, 'నీవు భయపడకు. నా దగ్గరున్న సంస్థంభన విద్యతో, వజ్రాయుధాన్ని తిప్పికొడతాను. ఒక్క వజ్రాయుధాన్నే కాదు. దేవతలు ప్రయోగించే ఏ ఆయుధాన్నైనా, నేను నా విద్యతో తిప్పికొట్టగలను. నీవిక వజ్రాయుధాన్ని గురించి మరచిపో.

ఇంద్రుడి మాటకు ఎదురితిరిగి మరీ నా చేత యాగం జరిపిస్తున్నందుకు, చాలా సంతోషిస్తున్నాను. నీవు ఏదైనా వరం కోరుకోమని అన్నాడు సంవర్తనుడు. అప్పుడు మరుత్తు, 'మీరుండగా నాకు ఇంద్రుడి వలన భయంలేదు. మీ తపోశక్తితో, ఇంద్రుడికి నా మీదున్న కోపమును పోగొట్టి, దేవేంద్రుడు దిక్పాలకాది దేవతలతో యజ్ఞానికి విచ్చేసి, నేను సమర్పించు హవ్యమును స్వీకరించేటట్లుజేసి, నాకు పుణ్యలోకప్రాప్తి కలిగించండి' అంటూ కోరుకున్నాడు. అందుకు సంవర్తనుడు, నా ఆహ్వానం మీద దేవేంద్రుడు, సోమపానం చేయడానికి వస్తాడు. అతడితో దేవతలందరూ వస్తారు. ఇక నీవు యజ్ఞాన్ని మొదలు పెట్టు. అని భరోసా ఇచ్చాడు. ఇంద్రుడు పంపిన వజ్రాయుధాన్ని తన శక్తితో ఆపి, దానిని తిరిగి పంపించాడు. ధృతరాష్ట్రుడిని కూడా సగౌరవంగా పంపించాడు. తరువాత సంవర్తనుడు, దేవతలను ఆవాహన చేసి ఆహ్వానించాడు. దేవతలు సంవర్తనుడి ఆహ్వానం అందుకుని, యజ్ఞానికి విచ్చేశారు. మరుత్తు సంవర్తనుడి ఆజ్ఞమీద దేవేంద్రాది దేవతలను సగౌరవంగా ఆహ్వానించి, అర్ఘ్యపాద్యములు ఇచ్చి, సత్కరించాడు. వారికి ఆసనాలు సమర్పించి, చేతులు జోడించి, 'నా ఆహ్వానాన్ని మన్నించి, నీవు దేవతలతో నా గృహమునకు విచ్చేసి, నా జన్మసఫలం చేశావు.  ఈ మహాత్ముడు బృహస్పతికి స్వయానా తమ్ముడు. మహా తపస్వి. నా అభ్యర్ధన మన్నించి, నేను చేస్తున్న యజ్ఞానికి యాజకత్వం వహిస్తున్నాడు. దయా సాగరా.. నా యందు కోపం మానుకుని కరుణించి, నన్ను చల్లగా చూడు' అంటూ దేవేంద్రుడిని అర్థించాడు. ఇంద్రుడు కరిగిపోయి, 'నీ వలన నేను ప్రీతి చెందాను మరుత్తు మహారాజా. బృహస్పతికి తమ్ముడైన ఈ సంవర్తనుడు, మహిమాన్వితుడని చెప్పడంలో, సందేహమేముంది' అంటూ చిరనవ్వు నవ్వాడు.

ఆ మాటలకు సంవర్తనుడు, 'దేవేంద్రా ! నేను పిలువగానే యజ్ఞముకు విచ్చేయడం, నా తపః ఫలం కాక మరేమిటి? మీ రాకతో మరుత్తు చేస్తున్న ఈ క్రతువు పుణ్యాల రాశి అయింది. కరుణాతరంగా! నీ దయ నా మీద ప్రసరింప చేస్తే, ఈ యజ్ఞము మంత్ర లోపం లేకుండా, నిర్వహిస్తాను. నీవు దయతో వీక్షించు. నీ రాకతో మరుత్తు పుణ్యలోక అర్హతను పొందాడు' అంటూ దేవేంద్రుడిని స్తుతించాడు. సంవర్తనుడి ప్రశంశలకు మహదానంద భరితుడైన దేవేంద్రుడు, ‘ఈ యజ్ఞవాటికను ఉదాత్తంగా తీర్చిదిద్దండి. గంధర్వులనూ, అప్సరసలనూ పిలిచి, నృత్య-సంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేయండి. ఈ యజ్ఞము నిర్విఘ్నంగా జరిగేలా, ఏర్పాట్లు చేయండి’ అని దేవతలను ఆజ్ఞాపించాడు. అలా ఇంద్రుడి సహకారంతో, సంవర్తనుడు యజ్ఞమును చక్కగా నిర్వహించి, దేవతలకు సోమపానం అందించాడు. దేవతలంతా సోమపానం స్వీకరించి, సంతుష్టులయ్యారు. వారంతా మరుత్తు వీడ్కోలందుకుని, స్వర్గలోకం చేరారు. దేవతలు యజ్ఞమునకు వచ్చి, సోమరసపానము చేసి వెళ్ళిన తరువాత కూడా, యజ్ఞము కొనసాగింది. యాగము పూర్తికాగానే, మరుత్తు బ్రాహ్మణులకు అపారంగా దాన ధర్మాలు చేశాడు. అంతేకాక, ఆ యజ్ఞ నిర్వహణకు వాడిన బంగారు పాత్రలూ, కలశములు కూడా, బ్రాహ్మణులకు దానంగా ఇచ్చాడు. తరువాత సంవర్తనుడి ఆజ్ఞ మేరకు, జనరంజకంగా పాలన సాగించాడు మరుత్తు. కానీ, బ్రాహ్మణులకు ఒక చిక్కువచ్చి పడింది. వారు దానంగా పొందిన బంగారమును మోసుకు వెళ్ళ లేక, వారి జీవనముకు కావలసినంత బంగారము మాత్రం వెంట తీసుకుని, మిగిలినది బంగారు కలశాలలో భద్రపరచి, 'ఈ నిధిని భవిష్యత్తులో ఎవరు కనుక్కుంటారో, వారికి ఈ నిధి సొంతమవుతుంది' అని శాసనం వ్రాసిపెట్టి, వెళ్లారు.

కాబట్టి ధర్మనందనా! 'నీవు ఆ నిధిని స్వాధీన పరచుకుని, అశ్వమేధ యాగమును నిర్వహించు. అది పార్వతీ పరమేశ్వరుల కరుణ ద్వారా లభించిన సంపద' అని వ్యాసుడు, జరిగిన గాధను వివరించాడు. అయితే, వ్యాసుడు అశ్వమేధ యజ్ఞానికి కావలసిన ధనము సమకూర్చుకునే మార్గం చెప్పినా, ధర్మరాజుకు శోకము తగ్గ లేదు. అది చూసిన శ్రీకృష్ణుడు, 'ధర్మజా! ఏపని అయినా, నిశ్చింతగా, నిర్మలంగా చెయ్యాలి కానీ, ఇలా చింతించడం తగదు. ఇప్పటివరకు బోధించిన జ్ఞానం ఏమైంది? నీకింకా, కామ, క్రోధ, మద, మాత్సర్య, మోహాలు తగ్గినట్లు లేదు. ఇక నీ ఆలోచనలు కట్టి పెట్టి, యాగ నిర్వహణ చేపట్టు' అని హితబోధ చేశాడు. ఆ విధంగా బ్రాహ్మణులు దాచి పెట్టిన నిధిని చేజిక్కించుకుని, అశ్వమేధ యాగాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాడు, ధర్మనందనుడు.

🚩 శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే
శివస్య హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయం శివః
యథా శివమయో విష్ణుః ఏవం విష్ణుమయం శివః
యథాంతరం న పశ్యామి తథా మే స్వస్తిరాయుషి 🙏

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes