'సిద్ధి' – భగవంతుడిని యదార్థముగా తెలుసుకో.. Bhagavadgita


'సిద్ధి' – భగవంతుడిని యదార్థముగా తెలుసుకో..

ఆధ్యాత్మిక సాధనలో పరిపూర్ణతను సాధించిన జీవులు, భగవంతుడిని గూర్చి యదార్థముగా తెలుసుకొనలేరు!

'భగవద్గీత' సప్తమోధ్యాయం - జ్ఞాన విజ్ఞాన యోగం (01 – 05 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, ఇప్పటివరుకూ మనము చెప్పుకున్న 1 నుండి 6 వరకూ ఉన్న అధ్యాయాలను కర్మషట్కము అంటారు. ఇక 7 నుండి 12 వరకూ ఉన్న అధ్యాయాలను, భక్తి షట్కము అంటారు. భక్తి షట్కములోని మొదటిదైన ఏడవ అధ్యాయం, జ్ఞాన విజ్ఞాన యోగం. ఈ రోజుటి మన వీడియోలో, జ్ఞాన విజ్ఞాన యోగంలోని 01 నుండి 05 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/9leknUYx5Fs ]

భగవంతుడి యొక్క భౌతిక ప్రకృతి శక్తీ, మాయా బలీయమైనది. దానిని అధిగమించటం, చాలా కష్టం. కానీ, ఆయనకి శరణాగతి చేసినవారు, ఆయన కృపకు పాత్రులై, మాయను సునాయాసముగా దాటిపోగలరు. తనకు శరణాగతి చేయని నాలుగు రకాల మనుష్యుల గూర్చీ, మరియూ తన యందు భక్తిలో నిమగ్నమయ్యే నాలుగు రకాల మనుష్యుల గురించీ, ఈ అధ్యాయంలో శ్రీ కృష్ణుడు వివరించబోతున్నాడు.

01:15 - శ్రీ భగవానువాచ ।
మయ్యాసక్తమనాః పార్థ యోగం యుంజన్ మదాశ్రయః ।
అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు ।। 1 ।।

భగవంతుడిలా అంటున్నాడు.. ఓ అర్జునా, నా యందు మాత్రమే మనస్సును నిలిపి, భక్తి యోగాభ్యాసము ద్వారా నాకు శరణాగతి చేసి, నీవు ఎట్లయితే నన్ను సంపూర్ణముగా, సందేహానికి తావు లేకుండా తెలుసుకొనగలవో, ఇప్పుడు వినుము.

మనస్సు తన యందు అనన్య భక్తితో లగ్నం చేసి, భక్తితో తనను సేవించువారు, యోగులలో శ్రేష్ఠులు. సహజంగా, ఈ ప్రతిపాదన కొన్ని ప్రశ్నలకు దారితీస్తుంది. భగవంతుడిని గూర్చి తెలుసుకునే మార్గం ఏమిటి? ఆయనపై ధ్యానం చేయటం ఎలా? ఒక భక్తుడు ఎలా దేవుడుని పూజించాలి? అని. అర్జునుడు ఈ ప్రశ్నలను అడగకపోయినా, తన కరుణచే, భగవంతుడు ముందే ఊహించి చెప్పనారంభిస్తున్నాడు. 

02:13 - జ్ఞానం తేఽహం సవిజ్ఞానమిదం వక్ష్యామ్యశేషతః ।
యత్ జ్ఞాత్వా నేహ భూయోఽన్యత్ జ్ఞాతవ్యమ్ అవశిష్యతే ।। 2 ।।

ఏ జ్ఞానాన్నీ, విజ్ఞానాన్నీ తెలుసుకున్న పిదప, ఇంక ఏమీ తెలుసుకోవటానికి ఈ లోకంలో మిగిలి ఉండదో, దానిని నేను నీకు సంపూర్ణముగా తెలియచేస్తాను.

ఇంద్రియమనోబుద్ధులచేత తెలుసుకోబడిన దానిని, జ్ఞానము అంటారు. ఆధ్యాత్మిక సాధన వలన, అంతర్గతంగా, లో నుండి తెలియవచ్చిన దానిని, విజ్ఞానము అంటారు. విజ్ఞానమనేది, బుద్ధిచే నేర్చుకున్నది కాదు. నేరుగా, అనుభవపూర్వకంగా తెలుసుకున్నది. గురువు, మరియు శాస్త్రముల నుండి మనకు తెలిసేది జ్ఞానం. ఆ జ్ఞానాన్ని అనుసరించి, మనం సాధనాభ్యాసం చేసి, అంతఃకరణ శుద్ధి చేసుకున్నప్పుడు, మనలోనుండే ఉదయించిన వివేకమునే, విజ్ఞానం అంటారు. వేద వ్యాస మహర్షి - భగవంతుని యొక్క దివ్య గుణములూ, స్వభావమూ, కీర్తీ మరియు భక్తి విశేషములను విశదీకరిస్తూ, శ్రీమద్ భాగవతం రాయాలని సంకల్పించినప్పుడు, ఆయన జ్ఞానంపై ఆధారపడి రాయలేదు. మొదట భగవంతుని పట్ల అనుభవపూర్వక విజ్ఞానం కోసం, భక్తిలో నిమగ్నమయ్యాడు. భక్తి యోగము ద్వారా, ప్రాపంచిక తలంపులు ఏమీ లేకుండా, వేద వ్యాసుడు తన మనస్సుని భగవంతునిపైనే నిమగ్నం చేశాడు. దీనితో, భగవంతుని అధీనంలో ఉండే ఆయనకే చెందిన బాహ్య శక్తి, మాయ సమేతంగా వేద వ్యాసునికి, సర్వోత్కృష్టుఁడైన దివ్య భగవంతుని దర్శనం కలిగింది. ఆ విధంగా, అంతర్గత విజ్ఞానంతో, ఈ ప్రసిద్ధ పురాణాన్ని వ్రాశాడు. సర్వోత్క్రుష్ట పరమాత్మ యొక్క సిద్ధాంత జ్ఞానంచే ఆర్జునుడిని ప్రకాశితం చేస్తాననీ, అతనికి దాని అంతర్గత విజ్ఞాన వికాసానికి తోడ్పడతాననీ, శ్రీ కృష్ణుడు ప్రకటిస్తున్నాడు. భగవంతుడి ద్వారా తెలుసుకున్న ఈ విజ్ఞానం తరువాత, ఇక తెలుసుకోవటానికి ఈ సృష్టిలో ఇంకేమీ మిగలదు.

04:14 - మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే ।
యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్త్వతః ।। 3 ।।

వేల మందిలో ఏ ఒక్కరో పరిపూర్ణ సిద్ధి కోసం ప్రయత్నిస్తారు. పరిపూర్ణ సిద్ధిని సాధించిన వారిలో, ఎవరో ఒకరు మాత్రమే నన్ను యదార్థముగా తెలుసుకుంటారు.

'సిద్ధి' అన్న పదం, పరిపూర్ణత కోసం వాడబడింది. ఈ పదానికి ఎన్నో అర్థాలున్నాయి. సిద్ధి అన్న పదానికి సంస్కృత నిఘంటువు నుండి కొన్ని అర్థాలు చూసినట్లయితే, అలౌకికమైన శక్తుల సంపాదనా, పనిలో సాఫల్యమూ, విజయమూ, నిపుణతా, నెరవేర్చుటా, సమస్యకి పరిష్కారం, వంట లేదా ఏదేని పని పూర్తి, స్వస్థత, లక్ష్యాన్ని చేరుకొనుట, పక్వమునకు వచ్చుట, అత్యున్నత సుఖమూ, మోక్షమూ, అసాధారణమైన నైపుణ్యమూ, పరిపూర్ణత. అయితే, ఇక్కడ శ్రీ కృష్ణుడు, ఈ పదాన్ని ఆధ్యాత్మికతలో పరిపూర్ణత కోసం వాడుతున్నాడు. అసంఖ్యాకమైన ఆత్మలలో, అతి కొద్ది వాటికి మాత్రమే, మానవ దేహం లభించింది. మానవ జన్మ పొందిన వారిలో, కొద్ది మంది మాత్రమే, పరిపూర్ణత కోసం ప్రయత్నిస్తారు. పరిపూర్ణతను సాధించిన ఆ జీవాత్మలలో, నా సర్వశ్రేష్ఠమైన స్థాయినీ, మరియూ దివ్య మహిమలనూ యెఱింగిన వారు, చాలా అరుదు. ఆధ్యాత్మిక సాధనలో పరిపూర్ణత సాధించిన జీవులు, భగవంతుడిని గూర్చి యదార్థముగా తెలుసుకొనలేరు. ఎందుకంటే, దేవునిపై భక్తి లేకుండా, ఆయన గురించి తెలుసుకోవటంగానీ, గ్రహించటంగానీ సాధ్యం కాదు. కర్మ, జ్ఞాన, హఠ యోగుల వంటి ఆధ్యాత్మిక సాధకులు, వాటితో పాటుగా, భక్తిని కూడా జోడించకపోతే, భగవంతుడి గురించి తెలుసుకోలేరు. భక్తి రహితంగా, ఆధ్యాత్మిక పురోగతి కోసం పాటు పడే వారు, భగవంతునిపై సిద్ధాంత పరమైన జ్ఞానానికే, పరిమితమై పోతారు. వారికి పరమ సత్యము యొక్క వాస్తవిక, అనుభవపూర్వక విజ్ఞానం లభించదు. చాలా మంది మనుష్యులలో, కొద్ది మంది మాత్రమే, ఆ భగవంతుడిని యదార్థముగా తెలుసుకుంటారు.

06:22 - భూమిరాపోఽనలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ ।
అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా ।। 4 ।।

భూమీ, నీరూ, అగ్నీ, వాయువూ, ఆకాశమూ, మనస్సూ, బుద్ధీ మరియు అహంకారమూ, ఇవి నా భౌతిక, ప్రాకృతిక శక్తి యొక్క ఎనిమిది అంగములు.

ఈ జగత్తుని కూర్చిన భౌతిక శక్తి, అద్భుతమైన వైవిధ్యంగలదీ, నిగూఢమైనదీ. దీనిని వర్గీకరణ చేసుకుంటే, మన మితమైన బుద్ధులకి కొంత మేర, అర్థం అవుతుంది. కానీ, ఈ ప్రతి ఒక్క వర్గంలో కూడా, అసంఖ్యాకమైన ఉప-వర్గాలున్నాయి. ఆధునిక శాస్త్రంలో అనుసరించే వర్గీకరణ ఏమిటంటే, అక్కడ పదార్ధాన్ని మూలకముల సమ్మేళనముగా పరిగణిస్తారు. ప్రస్తుతం, 118 మూలకాలు కనుగొనబడి, పీరియాడిక్ టేబుల్ లో పొందుపరచబడ్డాయి. భగవద్గీతలో, మరియూ సాధారణంగా, వైదిక తత్వజ్ఞానంలో, సమూలమైన వేరే పద్ధతి వాడబడింది. పదార్ధాన్ని ప్రకృతి అంటారు. అంటే, భగవంతుని శక్తి. దాని యొక్క ఎనిమిది అంగాలను, ఈ శ్లోకంలో చెప్పటం జరిగింది. ఆధునిక శాస్త్ర పద్ధతి యొక్క సహాయంతో, ఇది ఎంత అద్భుతమైన పరిజ్ఞానమో, మనం అర్థం చేసుకోవచ్చు. ఈ విశ్వంలో ఉన్నదంతా, భగవంతుడి భౌతిక శక్తి యొక్క స్వరూపమే. కేవలం, ఈ ఒక్క ప్రకృతి శక్తియే, ఇన్ని వివిధ రకాల ఆకారములూ, స్వరూపములూ, మరియూ పదార్ధములుగా రూపాంతరం చెందింది. ఇదే విషయం, తైత్తరీయ ఉపనిషత్తులో, విస్తారంగా వివరించబడింది. భౌతికశక్తి యొక్క ప్రప్రథమ మూల స్వరూపము, 'ప్రకృతి'. భగవంతుడు ఈ లోకాన్ని సృష్టించాలని సంకల్పించినప్పుడు, ఆయన అలా, దాని వంక చూశాడు. అది కదిలించబడి, మహత్తుగా వికసించింది. ఈ మహత్తు మరింత వికసించి, అహంకారముగా వ్యక్తమయ్యింది. ఈ మహత్తూ, అహంకారమూ, రెండూ కూడా, ఆధునిక శాస్త్రము కన్నా సూక్ష్మమైనవి. అహంకారము నుండి పంచ-తన్మాత్రలు, అంటే, ఐదు గ్రాహ్యతలైన రుచీ, స్పర్శా, వాసనా, దృష్టి మరియు శబ్దములు వచ్చాయి. వాటి నుండి, ఆకాశం, గాలి, అగ్ని, నీరు మరియు భూమి అను పంచ మహా భూతములు జనించాయి. పంచ మహా భూతములు, ఆయన  శక్తి యొక్క రూపాంతరములే కాక, మనస్సూ, బుద్ధి, మరియు అహంకారములు కూడా, భగవంతుడి విశిష్ట శక్తి స్వరూపాలు. ఇవన్నీ కేవలం, తన భౌతిక శక్తీ, మాయ యొక్క విభాగాలే.

08:56 - అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరామ్ ।
జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్ ।। 5 ।।

ఓ గొప్ప బాహువులు కలవాడా, అర్జునా, ఇది నాయొక్క తక్కువ స్థాయి శక్తి. కానీ, దానికి అతీతంగా, నాకొక ఉన్నతమైన శక్తి ఉంది. అదే, జీవ-ఆత్మ శక్తి. ఇది ఈ జగత్తు యందున్న జీవరాశులకు మూలాధారమైన జీవాత్మలను, కలిగి ఉంటుంది.

ఎనిమిది విధముల ప్రకృతి, తన తక్కువ స్థాయి భౌతిక శక్తి. ఉన్నది కేవలం అది మాత్రమే కాదు. ఇంకొక ఉన్నతమైన ఆధ్యాత్మిక శక్తి కూడా ఉంది. ఇది జడ పదార్ధం కంటే, పూర్తిగా అతీతమైనది. ఈ శక్తి యే, 'జీవ శక్తి'. ఇది జగత్తు లోని సమస్త ఆత్మలనూ, కలిగి ఉంటుంది. ఆత్మ, భగవంతుని యొక్క ఆధ్యాత్మిక శక్తిలో భాగమే అని, భగవంతుడు వివరిస్తున్నాడు. కాబట్టి, భగవంతుడు సర్వోన్నత శక్తిమంతుడు. ఉన్నదంతా - ఆధ్యాత్మికమైన, భౌతికమైన - ఆయన నిమ్న స్థాయి, లేదా ఆయన ఉన్నత స్థాయి శక్తులతో కూడుకున్నదే. ఎలాగైతే సూర్యుడు ఒక చోటే ఉన్నా కానీ, తన సూర్య కిరణములచే ఈ సౌర కుటుంబమంతా ఎలా వ్యాపిస్తాడో, అదే విధంగా, ఒక్కడే భగవంతుడు, తన అనంతమైన శక్తులచే, ఈ మూడు లోకాలలో వ్యాపించి ఉంటాడు. ఆత్మ అనేది భగవంతుని శక్తి స్వరూపము, మరియు ఆయనే సర్వోన్నత శక్తిమంతుడు. ఒక్కసారి, మనం ఆత్మ అనేది భగవంతుని శక్తి స్వరూపమని ఒప్పుకున్నప్పుడు, ఆ తదుపరి, సమస్త సృష్టి యొక్క అద్వైతం అవగతమవుతుంది. మూడు అస్థిత్వాలున్నాయి: 1) పదార్థము లేక ద్రవ్యము. ఇది నశించేది. 2) జీవాత్మలు. ఇవి నాశము లేనివి. 3) భగవంతుడు. ఈయన పదార్థము, మరియు ఆత్మలను కూడా నియంత్రించే వాడు. భగవంతునిపై ధ్యానం చేయటం వలనా, ఆయనతో ఏకమవటం వలనా, మరియూ ఆయనలా అవటం వలనా, ఆత్మ ఈ ప్రపంచపు మాయ నుండి స్వేచ్ఛను పొందుతుంది.

ఇక మన తదుపరి వీడియోలో, అర్జునుడికి భగవంతుడు, తన శక్తి గురించి ఏ విధంగా విశదీకరిస్తున్నాడో, తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes