'ప్రార్థన' – ప్రార్థించే మనస్సెలా ఉండాలి?
ఈ రోజుటి మన 'మంచిమాట'లో, భగవంతుడిపై ఉండవలసిన నమ్మకం, ప్రార్ధించవలసిన పద్ధతి గురించి, ఈ చిట్టి కథ ద్వారా తెలుసుకుందాము..
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/HYR6GJyUWUc ]
మనోవికాసాన్ని పెంపొందించే ఈ కథను పూర్తిగా విని, మీ అభిప్రాయాలను comment చేస్తారని ఆశిస్తున్నాను..
ప్రతి రోజూ ఉదయాన్నే, ఓ చిన్నారి ఆ దేవాలయానికి వచ్చి, భగవంతుడి ముందు నిలబడి, కళ్ళు మూసుకుని, చేతులు జోడించి, కొన్ని నిమిషాలు ఏదో గొణుక్కుంటోంది. తరవాత కళ్ళు తెరిచి నమస్కరించి, నవ్వి, పరిగెత్తుకుంటూ వెళ్లిపోయేది.. ఇది రోజువారీ వ్యవహారం. ప్రతి రోజూ ఇదే తంతు..
పూజారి ఆమెను గమనిస్తూ ఉన్నాడు. ఆ పిల్ల ఏం చేస్తోందా? అని ఆసక్తి మొదలైంది. ఆయన ఆలోచించసాగాడు.. మతం యొక్క లోతైన అర్థాలను తెలుసుకోవడానికి, ఆమె చాలా చిన్నది.. ఆమెకు ఎలాంటి ప్రార్థనలూ తెలియవు. అయితే, ఆలయంలో ఆమె ప్రతి ఉదయం ఏం చేస్తోంది..?
ఇలా పదిహేను రోజులు గడిచిపోయాయి. పూజారికి ఆమె ప్రవర్తన అర్థంకావడం లేదు. రోజు రోజుకూ ఆలోచనలు పెరిగిపోతున్నాయి..
ఇక లాభం లేదని నిశ్చయించుకుని ఒకరోజు ఉదయం, పూజారి ఆ పాప కంటే ముందే అక్కడకు చేరుకుని, ఆమె కర్మ పూర్తయ్యే వరకూ వేచి ఉండి.. ఆమె తలపై చేయి వేసి, ఆప్యాయంగా..
'చిట్టి తల్లీ.. గత కొన్ని రోజులుగా నువ్వు క్రమం తప్పకుండా ఇక్కడకు రావడాన్ని, నేను చూస్తున్నాను.. రోజూ నువ్వేం చేస్తున్నావమ్మా?' అని అడిగాడు..
'నేను ప్రార్థిస్తున్నాను', ఆమె తడుముకోకుండా చెప్పింది..
'అవునా! మరి నీకు ప్రార్థనలు ఏవైనా తెలుసా?' పూజారి ఆశ్చర్యంగా అడిగాడు..
'లేదు స్వామీ' అన్నది ఆ పాప..
'మరి నువ్వు ప్రతి రోజూ కళ్ళు మూసుకుని, ఏం చేస్తున్నావు?' అని నవ్వుతూ అడిగాడాయన..
అమాయకంగా ఆ పిల్ల ఇలా చెప్పింది..
'నాకు ప్రార్థనలేవీ తెలియవు.. కానీ, నాకు ‘అఆఇఈ’లు చివరి వరకూ వచ్చు. నేను వాటిని ఐదుసార్లు పఠించి, దేవుడికి చెబుతాను.. మీ ప్రార్థనలేవీ నాకు తెలియదు.. కానీ, అవి ఈ అక్షరాలలోనేగా ఉంటాయి? దయచేసి మీకు నచ్చిన విధంగా అక్షరాలను అమర్చుకోండి.. ఇదే నా ప్రార్థన..' ఇలా చెప్పి, ఆ పిల్ల తాను ప్రార్థించిన భగవంతుడిపై పూర్తి నమ్మకంతో, చెంగు చెంగున గెంతుతూ, తన దారిన తాను వెళ్లి పోయింది..
పూజారి అక్కడ మూగగా నిలబడి, దూరంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి అదృశ్యమైన ఆ పసి పిల్లను చూస్తూ, ఉండిపోయాడు..
మన ప్రార్థన, మనం ప్రార్ధించే దేవుడిపై నమ్మకం, ఇలా కల్లాకపటం ఎరుగని ఆ పసి పాప లాగా ఉండాలి! కర్మ సిద్ధాంతాన్నిబట్టి నడిచే మన జీవితాలలో, మనకు ఏది మంచో, మన అవసరాలేంటో, మనను సృష్టించిన ఆ భగవంతుడికి తెలియనివా..?
సర్వేజనాః సుఖినోభవంతు!
Post a Comment