‘సకామ కర్మ’ - మంచి చేసే వారు ఎప్పుడూ కష్టాలపాలు కారు! Bhagavadgita


‘సకామ కర్మ’ - మంచి చేసే వారు ఎప్పుడూ కష్టాలపాలు కారు!

'భగవద్గీత' షష్ఠోఽధ్యాయం - ఆత్మ సంయమ యోగం (39 – 43 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 1 నుండి 6 వరకూ ఉన్న అధ్యాయాలను కర్మషట్కము అంటారు. దీనిలో ఆరవ అధ్యాయం, ఆత్మ సంయమ యోగం. ఈ రోజుటి మన వీడియోలో, ఆత్మసంయమయోగంలోని 39 నుండి 43 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/vtaqdP8-EdY ]

యోగ మార్గం నుండి తప్పిపోయిన వ్యక్తి గురించి, అర్జునడడిగిన ప్రశ్నకు, శ్రీ కృష్ణుడిలా సమాధానమిస్తున్నాడు..

ఏతన్మే సంశయం కృష్ణ ఛేత్తుమర్హస్యశేషతః ।
త్వదన్యః సంశయస్యాస్య ఛేత్తా న హ్యుపపద్యతే ।। 39 ।।

ఓ కృష్ణా, నా ఈ సందేహమును పూర్తిగా నివృత్తి చేయుము.. మరి ఇక నీ కన్నా, ఇది చేయగలవారెవరున్నారు?

అజ్ఞానం నుండి సందేహాలు పుడతాయి. సందేహాలను నివృత్తి చేసుకునే శక్తి, జ్ఞానం నుండి వస్తుంది. వేద శాస్త్ర పండితులు, పుస్తక జ్ఞానం కలిగి ఉంటారు. ఇది సందేహాలను నివృత్తి చేయటానికి, సరిపోదు. ఎందుకంటే, శాస్త్రాలు ఎన్నో కనిపించే విరుద్ధమైన విషయాలను, కలిగి ఉంటాయి. వీటిని నిజమైన అంతర్గత విజ్ఞానం వల్లనే, సమన్వయం చేసుకోవచ్చు. భగవత్ ప్రాప్తి నొందిన మహాత్ములు, ఇటువంటి విజ్ఞానాన్ని కొంత మేర కలిగి ఉంటారు. వారు సర్వజ్ఞులు కారు. ఇటువంటి జ్ఞానోదయమయినవారు, సందేహ నివృత్తి చేయగలిగే శక్తిని కలిగి ఉంటారు. కానీ, వారు సర్వజ్ఞుడైన భగవంతునితో పోటీ పడలేరు. భగవంతుడు మాత్రమే, ఏకైక సర్వజ్ఞుడూ, మరియూ సర్వ-శక్తిమంతుడూ. అందుకే, ఎలాగైతే సూర్యుడే చీకటిని పారద్రోలేందుకు సమర్థుడో, అలాగే, ఆ భగవంతుడే సమస్త అజ్ఞానాన్నీ నిర్మూలించగలిగే, అత్యున్నత సమర్థుడు.

శ్రీ భగవానువాచ ।
పార్థ నైవేహ నాముత్ర వినాశస్తత్య విద్యతే ।
న హి కల్యాణకృత్కశ్చిత్ దుర్గతిం తాత గచ్ఛతి ।। 40 ।।

ఓ పార్థా, ఆధ్యాత్మిక పథంలో ఉన్న వాడు, ఈ లోకంలో కానీ, పర లోకంలో కానీ, చెడిపోడు. ప్రియ మిత్రమా, భగవత్ ప్రాప్తి కోసం ప్రయత్నం చేసే వాడు, ఎన్నటికీ దుర్గతి పాలుకాడు.

శ్రీ కృష్ణుడు అర్జునుడిపై ఉన్న వాత్సల్యాన్నీ, మరియూ కృపనూ చూపిస్తూ, ఆయన మార్గంలో ఉన్న వారి బాగోగులను తానే చూసుకుంటాడని చెప్పటానికి, శ్రీ కృష్ణుడు సంకల్పించాడు. వారు భగవంతునికి ప్రియమైన వారు. ఎందుకంటే, వారు అత్యంత పవిత్రమైన కార్యంలో నిమగ్నమై ఉన్నట్టు. "మంచి చేసే వారు ఎప్పుడూ కూడా కష్టాల పాలు కారు." ఈ లోకంలో, మరియూ పర లోకంలో, భక్తుడిని భగవంతుడే కాపాడుకుంటాడని, ఈ శ్లోకం వక్కాణిస్తున్నది. ఈ ప్రకటన, ఆధ్యాత్మికాభిలాషులకు ఒక గొప్ప భరోసా.

ప్రాప్య పుణ్యకృతాం లోకానుషిత్వా శాశ్వతీః సమాః ।
శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోఽభిజాయతే ।। 41 ।।

అథవా యోగినామేవ కులే భవతి ధీమతామ్ ।
ఏతద్ది దుర్లభతరం లోకే జన్మ యదీదృశమ్ ।। 42 ।।

యోగ భ్రష్టులైన వారు, పుణ్య లోకాలకు వెళతారు. అక్కడ చాలా కాలం నివసించిన పిదప, వారు తిరిగి భూలోకంలో, ధర్మపరాయణుల, సంపన్నుల కుటుంబంలో జన్మిస్తారు, లేదా, ఏంతో కాలం యోగాభ్యాసం వలన వైరాగ్యం వృద్ధి చెందిన వారయితే, దివ్య జ్ఞాన సంపన్నుల కుటుంబంలో జన్మిస్తారు. ఇటువంటి జన్మ చాలా దుర్లభం.

ప్రాపంచిక పుణ్య కార్యాలు చేసినవారికీ, వేదాలలో చెప్పబడిన సకామ కర్మ కాండలు చేసిన వారికీ, స్వర్గ లోక నివాసం ప్రసాదించబడుతుంది. మరైతే, యోగభ్రష్టుడు, ఈ స్వర్గ లోకాలకు ఎందుకు పోవాలి? దీనికి కారణం ఏమిటంటే, యోగమునకు వ్యతిరేకమైనది, భోగము. దీని మీద ఆసక్తితో, వ్యక్తి యోగము నుండి భ్రష్టుడై పోతాడు. కాబట్టి భగవంతుడు, దయాళువైన తండ్రి లాగా, ఓ పడిపోయిన యోగికి, భోగ విలాసాల కోసం ఒక అవకాశమిచ్చి, అవన్నీ వ్యర్థమైనవి, అవి ఆత్మ కోరుకునే శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వలేవు, అని తెలుసుకునేలాగా చేస్తాడు. కాబట్టి, భ్రష్టుడైన యోగి కొన్నిసార్లు, చాలా కాలం పాటు స్వర్గ లోకాలకు పంపబడి, తిరిగి ఈ భూలోకానికి పంపబడతాడు. ఇటువంటి జీవులకు, తమ ఆధ్యాత్మిక ప్రయాణం కొనసాగించటానికి అవకాశం కోసం, అనుకూలంగా ఉండే కుటుంబంలో జన్మ ఇవ్వబడుతుంది. యోగ భ్రష్టులైన వారు, పవిత్రమైన కుటుంబంలో, చిన్నప్పటి నుండే ఆధ్యాత్మికతను నేర్పించే వారికి జన్మిస్తారు, లేదా సంపన్నుల కుటుంబంలో, శారీరక అవసరాలన్నీ తీరి, బ్రతుకు తెరువు కోసం, రోజూ ప్రయాస పడే అవసరం లేని వారికి జన్మిస్తారు. ఇటువంటి కుటుంబ వాతావరణం, ఆధ్యాత్మిక పరిశ్రమలో నిమగ్నమవటానికి, అటువంటి ఆసక్తిగల జీవులకు అనుకూలంగా ఉంటుంది.

మనం పుట్టిన పరిస్థితులూ, సందర్భమూ, మరియూ కుటుంబమనేవి, మన జీవితంపై ఎంతో ప్రభావం కలిగి ఉంటాయి. మన శారీరక తల్లిదండ్రుల నుండి, మనం వంశ పారంపర్యమైన గుణాలను పొందుతాము. ఇది జన్యు సంబంధమైన వంశ పారంపర్య పద్ధతి. కానీ, సామాజిక వారసత్వ పద్ధతి కూడా ఉంటుంది. మనం చాలా ఆచారాలను, మనం పెరిగిన వాతావరం వలన, గుడ్డిగా పాటిస్తుంటాము. ఈ విధంగా, మనం పుట్టిన స్థలమూ, మరియూ కుటుంబమూ, మన జీవిత గమనమూ, మరియూ పురోగతిపై, చాలా ప్రభావం కలిగి ఉంటాయి. ఒకవేళ ప్రతి జన్మలో, పుట్టే స్థలమూ, మరియూ కుటుంబమూ, ఎదో కాకతాళీయంగా నిర్ణయించబడితే, ఈ ప్రపంచంలో న్యాయం లేనట్టే. కానీ, మన యొక్క అనంతమైన జన్మల తలపులు, పనుల చిట్టా, భగవంతుని దగ్గర ఉంది. కర్మ సిద్ధాంత శాసనముననుసరించి, యోగంలో సాఫల్యం పొందలేకపోయిన యోగి యొక్క ఆధ్యాత్మిక సంపద, ఫలములనిస్తుంది. ఆ ప్రకారంగానే, ఎంతో పురోగతి సాధించీ, మరియూ వైరాగ్యం పెంపొందించుకున్న యోగులు, పుణ్య లోకాలకు పంపబడరు. వారికి తమ ప్రయాణం ముందుకు తీసుకువెళ్ళటానికి అనుకూలంగా, ఆధ్యాత్మికతలో, ఉన్నతమైన దశలో ఉన్న కుటుంబంలో, ఇక్కడే జన్మను ఇవ్వబడుతుంది. అటువంటి జన్మ, అత్యంత భాగ్యవంతమయినది. ఎందుకంటే, ఆ తల్లిదండ్రులు, తమ పిల్లలకి చిన్నతనం నుండే ఆధ్యాత్మిక దివ్య జ్ఞానాన్ని బోధిస్తుంటారు.

తత్ర తం బుద్ధిసంయోగం లభతే పౌర్వదేహికమ్ ।
యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురునందన ।। 43 ।।

ఓ కురు వంశస్తుడా, ఇటువంటి జన్మ పొందిన తరువాత, వారు తమ పూర్వ జన్మల విజ్ఞానాన్ని తిరిగి మేలుకొలిపి, యోగములో పరిపూర్ణత కొరకు, మరింత పరిశ్రమ చేస్తారు.

ప్రతీ ఒక్క ప్రాణి హృదయంలో స్థితుడై ఉన్న భగవంతుడు, వారికి పరిపూర్ణమైన న్యాయం చేస్తాడు. మన పూర్వ జన్మలలో సంపాదించుకున్న ఆధ్యాత్మిక సంపదలైన, వైరాగ్యం, జ్ఞానం, భక్తీ, విశ్వాసం, సహనం, దృఢ సంకల్పం వంటివన్నీ ఆయనకు తెలుసు. కాబట్టి, సరియైన సమయంలో, మన పూర్వ జన్మల పరిశ్రమ ఫలితాన్ని, ఆయా సంపాదనకనుగుణంగా, తిరిగి ఇస్తాడు. మన ఆధ్యాత్మికతను, లోనుండి తిరిగి పెంపొందిస్తాడు. భౌతిక, ప్రాపంచిక ధృక్పథంలోనే ఉన్న కొందరు, అకస్మాత్తుగా, పూర్తి ఆధ్యాత్మికతలో నిమగ్నమవ్వడానికి, ఇదే కారణం. వారి యొక్క ఆధ్యాత్మిక సంస్కారములు మేల్కొన్నప్పుడు, వారికి పూర్వ జన్మల సాధనా ఫలితం, లభిస్తుంది. ఒక యాత్రికుడు విరామం కోసం, దారిలో ఉన్న ఒక విడిది గృహంలో రాత్రిపూట బస చేయవచ్చు. కానీ, తను లేచినప్పుడు, తను అప్పటివరకూ వచ్చిన దూరాన్ని, తిరిగి ప్రయాణం చేయనవసరం లేదు. కేవలం మిగిలిన దూరాన్ని మాత్రమే, ప్రయాణించవలసి ఉంటుంది. అదే విధంగా, భగవంతుని కృప వలన, పూర్వ జన్మలలో తన ప్రయాణాన్ని ఎక్కడ ఆపాడో, అక్కడి నుండి పురోగమించటానికి, తన పూర్వ జన్మలలో సాధించుకున్న ఆధ్యాత్మిక సంపత్తిని, ఒక మనిషి నిద్ర లేచి కొనసాగించినట్టుగా, యోగి తిరిగి పొందుతాడు. అందుకే, ఇటువంటి యోగి, ఎన్నటికీ దారితప్పడు.

ఇక మన తదుపరి వీడియోలో, ఎటువంటి యోగిని అత్యున్నతమైన వారిగా భగవంతుడు పరిగణిస్తాడో తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes