తంత్ర సాధకులకు కేంద్ర స్థానం.. కామాఖ్యాదేవి శక్తిపీఠం!


తంత్ర సాధకులకు కేంద్ర స్థానం.. కామాఖ్యాదేవి శక్తిపీఠం!

ఈ సృష్టి మొత్తం, శక్తి మూలంగానే నడుస్తోందని అంటారు. పురాణ గాధల ప్రకారం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి, 'శక్తి పీఠాలు'. సతీ దేవి శరీర భాగాలు పడిన ప్రాంతాలను, శక్తి పీఠాలుగా పిలుస్తారు. వాటి విషయంలో కొంత అస్పష్టత నెలకొని ఉంది. శక్తి పీఠాలు, కొంత మంది 18 అనీ, మరి కొంతమంది 51 అనీ, ఇంకొందరు 52 అనీ, కొందరు 108 అనీ, వివిధ వాదనలున్నాయి. అయితే, కొన్ని గ్రంధాల ప్రకారం, ముఖ్య ఆలయాలుగా, 18 ప్రధానమైన శక్తి పీఠాలను వర్ణించారు, మన పెద్దలు. ఆ పరమేశ్వరుని అర్ధాంగి సతీదేవి శరీర భాగాలు పడిన 101 ప్రదేశాలలో, 51 క్షేత్రాలు ముఖ్యమైనవి. వాటిలోనూ అతి ముఖ్యమైన శరీర భాగాలు పడినవి, 18 ప్రదేశాలు. వాటినే, అష్టాదశ శక్తి పీఠాలుగా గుర్తించి, నేడు మనం పూజిస్తున్నాం.

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/jZkFxi0FHHs ]

వాటిలో ఒకటి, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో శిధిలమై ఉండగా, మరొకటి శ్రీలంకలో నెలకొని ఉంది. అస్సాంలోని బ్రహ్మపుత్రా నది చివరన ఉన్న గౌహతి పట్టణం, ఎన్నో ప్రకృతి అందాలతో ప్రజల్ని ఆకర్షిస్తుంది. ఆ ప్రాంతం ఎన్నో సంస్కృతీ సంప్రదాయాలూ, మరెన్నో చారిత్రాత్మక కట్టడాలకు నిలయంగా, భాసిల్లుతోంది. మనకున్న అష్ఠాదశ శక్తి పీఠాలలో, అత్యంత ప్రసిద్ధి చెందిన క్షేత్రంగా చెప్పబడే కామాఖ్యాదేవి ఆలయం కూడా, ఇక్కడే నెలకొని ఉంది. ఈ క్షేత్రంలో వెలసిన దేవిని, కామాఖ్య అనీ, కామరూపిణి అనీ పిలుస్తారు. సామాన్యంగా, కామం అంటే, శారీరక చిత్త చాంచల్యంగా భావిస్తారు. కానీ, అసలు కామమన్నా, కామరూపిణి అన్నా, అనుకున్న రూపాన్ని, అనుకున్న క్షణంలో మార్చుకోగలగడం. అలా చెయ్యగలగిన శక్తిమంతురాలు కాబట్టే, ఆ తల్లి కామరూపిణి అయింది. కామాఖ్యా దేవి, అనేక రూపాలు ధరించి భక్తులకు చేరువై, వారి వారి కోరికలను తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధి చెందింది. కామాఖ్యా దేవిని, త్రిపుర శక్తిదాయినిగా కొలుచుకుంటారు. మరి అంతటి శక్తివంతమైన అమ్మవారు కొలువైన ఆ ప్రత్యేక ఆలయం గురించీ, అక్కడ దాగి ఉన్న మర్మ రహస్యాల గురించీ, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

దక్ష ప్రజాపతి యజ్జంలో అవమానింపబడిన సతీ దేవి, ప్రాణ త్యాగం చేసుకుంది. ఆ తల్లి వియోగాన్ని భరించలేని పరమేశ్వరుడు తన కర్తవ్యాన్ని మరచి, సతీ దేవి దేహాన్ని భుజాన వేసుకుని విరాగిగా సంచరిస్తూ ఉండగా, శ్రీ మహా విష్ణువు లోక కళ్యాణార్ధం, తన సుదర్శన చక్రంతో, సతీ దేవి దేహాన్ని ఖండించాడు. అలా ఆమె శరీరం ముక్కలుగా పడిన ప్రదేశాలను, శక్తిపీఠాలుగా మనం పూజిస్తున్నాము. పురాణ ఐతిహ్యం ప్రకారం, ఈ కామాఖ్యా దేవి ఆలయంలో, సతీ దేవి యోని భాగం పడింది. గౌహతీ నగరానికి పశ్చిమ భాగంలో, నీలాచల కొండపై ఉన్న కామాఖ్యా దేవి ఆలయం, తాంత్రిక దేవతలకు నిలయంగా పేర్కోన బడుతుంది. ఇక్కడ ప్రధాన దైవమైన కామాఖ్యా దేవితో పాటు, కాళీ మాత యొక్క 10 అవతారాలు కూడా ఉన్నాయి. అవి తార, ధూమావతీ, భగళ, భైరవీ, త్రిపుర సుందరీ, భువనేశ్వరీ, కాళీ, చిన్నమస్తా, కమల మరియు మాతంగి. ఈ ఆలయంలో కామాఖ్యా దేవి విగ్రహం కానీ, చిత్రపటం కానీ ఉండదు. కేవలం, ఆలయంలోని గుహ మూలలో, దేవత యొక్క యోనికి సంబంధించిన శిల్ప చిత్రం మాత్రమే ఉంటుంది. మూడు ప్రధాన రూపాల్లో, కామాఖ్యమ్మ భక్తులకు దర్శనమిస్తుంది. అరాచకవాదులను అంతం చేసేందుకు త్రిపుర భైరవి రూపంలో, ఆనంద పరవశురాలైన సింహవాహినిగా, పరమేశ్వరునిపై అనురాగంతో, త్రిపురసుందరిగా మనలను కరుణిస్తుంది. ఇక్కడ వెలసిన రాతి యోనిలోనే, కామాఖ్యాదేవి నివాసం ఉంటుందని, భక్తుల నమ్మకం.

ఈ శిలారూపంపై తెల్లని వస్త్రం కప్పబడి ఉంటుంది. ఈ ఆలయ విశేషమేమిటంటే, ప్రకృతి సహజ సిద్ధమైన స్త్రీల బహిష్టు మాదిరిగానే, కామాఖ్యా దేవికి కూడా బుుతు స్రావం జరుగుతుంది. ప్రతీ ఏడూ ఆషాఢ మాసంలో, మృగశిరా నక్షత్రం మూడవ పాదంలో ఉండగా మొదలై, ఆరుద్రా నక్షత్రంలో మొదటి పాదం వరకూ, అమ్మవారికి ఋతు స్రావం జరుగుతుంది. దేవీ భాగవతంలో, ఈ ప్రత్యేక రోజుల గురించిన ప్రస్తావన స్పష్టంగా ఉంది. ఆ రోజుల్లో, యోనిశిల నుండి ఎర్రని స్రావం వెలువడుతుంది. ఈ ఎర్రని స్రావం, శక్తిపీఠం ముందున్న సౌభాగ్య కుండంలోని నీరుగా చెబుతారు, అక్కడి పూజారులు. అయితే, అమ్మవారు రుతుస్రావం అయ్యే ప్రత్యేకమైన ఆ మూడు రోజులూ, ఆలయాన్ని మూసి ఉంచుతారు. తిరిగి నాలుగవ రోజున, పెద్ద ఎత్తున ఉత్సవం నిర్వహించి, గుడి తలుపులు తెరుస్తారు. అయితే, ఆలయం మూసివేయక ముందే, అక్కడి భక్తులు అమ్మవారి శిలపై కప్పడానికి, వస్త్రాలను సమర్పిస్తారు. తరువాత ఆలయం తెరిచాక, అర్చకులు వాటిని పార్వతీ కుండంలో ఉతికి ఆరబెట్టి, భక్తులకు వేలం పద్ధతిలో విక్రయిస్తారు. ఆ వస్త్రం దగ్గర ఉండడం వలన, ఆడవారికి ఋతుస్రావ దోషాలూ, రజస్వల అయిన సందర్భంలోని దోషాలేవీ అంటవని, భక్తుల విశ్వాసం.

ఈ శక్తి పీఠం ముందు ఒక పుష్కరిణి మనకు కనిపిస్తుంది. ఇది ఎంతో శక్తివంతమైనది. దీనిని ఇంద్రాది దేవతలు నిర్మించారని, ప్రతీతి. ఈ గుండానికి ప్రదక్షిణం చేస్తే, భూ ప్రదక్షిణ చేసినంత ఫలం లభిస్తుందని, భక్తుల భావన. ఇందులో నీరు ఎరుపు రంగులో ఉంటుంది. దీనిని సౌభాగ్య కుండం, పాతక వినాశ కుండం అనీ పిలుస్తారు. అమ్మ వారి యోని స్రావిత పవిత్ర జలాలతో పునీతమైన ఈ కుండంలో స్నానం చేస్తే, ఎంతటి మహా పాతకమైనా నశిస్తుందనీ, బ్రహ్మ హత్యా పాతకమైనా నివారణమవుతుందనీ, అక్కడి ప్రజల ప్రగాఢ విశ్వాసం.
అలాగే, ఈ దేవాలయానికి కొద్దిగా వెనుక భాగంలో, మరో కుండం ఉంది. ఇది పార్వతీ కుండం. సౌభాగ్య కుండంలో స్నానం చేసిన భక్తులు, ఆలయంలోని యోని శిలారూపాన్ని తాకి నమస్కరించుకుని, అక్కడి యోని స్రావిత జలాన్ని తీర్థంగా సేవించి, మరల ఆలయం వెనుకనున్న పార్వతీ కుండంలో మరో సారి తలస్నానం చేసి, పవిత్రులవుతారు. ఈ ఆలయం ఎంతో పురాతనమైనది. 12వ శతాబ్దం వరకూ ఈ ప్రాంతాన్ని పాలించిన రాజుల శాసనాల్లో, ఈ ఆలయ ప్రస్తావన ఎక్కడా కనిపించనప్పటికీ, తరువాతి రాజుల శాసనాల ప్రకారం, కామేశ్వరి మహా గౌరి అమ్మవారు ఇక్కడ ఉన్నట్లు తెలుస్తోంది.

13వ శతాబ్దం మొదట్లో, గుత్తాధిపత్యం కోసం, రాజుల మధ్య యుద్ధాలు ఎక్కువగా జరుగుతుండేవి. అప్పటి రాజైన కూచ్ బిహార్ రాజా విశ్వసింహ్, యుద్ధంలో అయిన వాళ్లనందరినీ కోల్పోయి, మనో వేదనతో, ఈ నీలాచల పర్వతం పైకి చేరుకున్నాడు. అక్కడ రాజుకు ఒక వృద్ధురాలు ఆశ్రయమిచ్చింది. ఆమె ప్రతి దినం, తన నివాసం ప్రక్కనున్న మట్టి దిబ్బను భక్తితో పూజించేది. దాని గురించి తెలుసుకోవాలనే ఉత్సుకతతో, అవ్వను ఆరాతీశాడు రాజు. ఇందులో దాగి ఉన్న దేవత చాలా శక్తిమంతురాలనీ, ఏ కోరికనైనా క్షణాలలో తీరుస్తుందనీ, రాజుకు తెలియజేసింది. వెంటనే రాజు, మరణించిన తన వారంతా తిరిగి రావాలని, అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకున్నాడు. ఆ శక్తి స్వరూపిణి దయ వలన, వెంటనే వారంతా తిరిగి రాజు వద్దకు సజీవంగా వచ్చారు. అలా రాజు మరింత భక్తితో, తన రాజ్యంలో కరవు శాంతిస్తే, ఇక్కడ బంగారు గుడి కట్టిస్తానని, మొక్కుకున్నాడు. అతని కోరిక మేరకు, ఆ రాజ్యం సస్యశ్యామలమై, సుఖవంతమయ్యింది. రాజు తన మాట ప్రకారం గుడి కట్టించేందుకు, ఆ మట్టి దిబ్బను తవ్వించగా, అక్కడ కామాఖ్యాదేవి రాతిశిల బయటపడింది. ఆ అమ్మవారికి మట్టి రాయిలో గురివింద ఎత్తులో బంగారాన్ని పెట్టించి, తేనెతుట్టు ఆకార గోపురాదులతో ఆలయాన్ని నిర్మింపజేశాడు.

ఈ ఆలయంలో ప్రతీ ఆషాఢమాసంలో, అయిదు రోజుల పాటు అంబుబాచి మేళా జరుగుతుంది. ఈ అంబుబాచి మేళానే, కామాఖ్యా కుంభమేళాగా పిలుస్తారు. ఈ మేళా, కనీవినీ ఎరుగని రీతిలో జరుగుతుంది. దీని వైభవాన్ని ప్రత్యక్షంగా చూడాలే తప్ప, వర్ణించేందుకు మాటలు చాలవంటే, అతిశయోక్తి కాదు. ఆ శుభ తరుణం రాగానే, వేలాదిమంది పండాలూ, సిద్ధుల వంటి వాళ్లే కాక, సామాన్య భక్తులు కూడా ఆలయానికి తరలివచ్చి ఈ మేళాలో పాల్గొని, అమ్మపై తమకున్న భక్తి శ్రద్ధలను చాటుకుంటారు. ఈ మేళా సందర్భంగా, తప్పెట్లూ, తాళాలూ వాయించుకుంటూ చేసే విన్యాసాలూ, అభినయించే నృత్యాలూ, ఇంతింత బారున జటలు కట్టిన జుట్టుతో ఉన్న సాధువులూ, సాధ్వులూ పెట్టే అభయ ముద్రలూ, ఆకర్షణీయంగా ఉంటాయి. సాధారణ రోజుల్లో కూడా, సాధువులూ, సంతులూ, అఘోరాలూ, తాంత్రికులూ ఇక్కడకు వచ్చి అమ్మను దర్శించుకుని, పూజలు నిర్వహిస్తారు. మంత్ర, తాంత్రిక, ఐంద్ర జాలాలకు, కామాఖ్యా దేవి శక్తి పీఠం, కేంద్ర స్థానంగా ప్రసిద్ధి.

ఓం శ్రీమాత్రే నమః!

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes