తిరుప్పావై గోదాదేవి 2వ పాశురం!


తిరుప్పావై గోదాదేవి 30 పాశురాలలో..

రెండవ రోజు అనగా 17.12.2020 గురువారము..

2వ రోజు - భగవంతుని రెండవ స్థానం వ్యూహం (పాల్కడలి)..

వైయత్తు వాళ్ వీర్గాళ్! నాముం నం పావైక్కు

శెయ్యుం కిరిశైగళ్ కేళీరో పాఱ్కడలుళ్

పైయత్తుయిన్ఱ పరమనడి పాడి

నెయ్యుణ్ణోం పాలుణ్ణోం నాట్కాలే నీరాడి

మైయిట్టెళుదోం మలరిట్టు నాం ముడియోమ్

శెయ్యాదన శెయ్యోం తీక్కుఱళై చ్చెన్ఱోదోమ్

ఐయముం పిచ్చైయుం ఆందనైయుం కైకాట్టి

ఉయ్యుమాఱెణ్ణి ఉగందేలోర్ ఎమ్బావాయ్

వ్రతనియమాలు

మనిషి బాగుపడడానికి ఎన్నో మార్గలు. శాస్త్రాలు అవి కర్మయోగమని, జ్ఞానయోగమని, భక్తియోగమని ఇలా ఎన్నో చెప్పబడి యున్నాయి. భగవంతుడే ఒక మార్గమని తీసుకుంటే వారు మార్గశిర్షంలో పయనిస్తారు అని అంటారు. మార్గంలో లక్ష్యం చేరటంలో ఇబ్బందులు ఉండవు. తల్లి అండలో ఉన్న శిశువు మాదిరిగా మనల్ని తరింపచేస్తాడు పరమాత్మ, కాని అలా జరగటానికి మన అంగీకారం కావాలి. మనలోని జ్ఞానం ద్వారా మనం నీవాడను నేను అని ఆయనకు చెప్పాలి. మరి అలాంటి మార్గంలో పయనించటానికి మనం ఎలా ఉండాలో మన ఆండాళ్ తల్లి తెలియజేసింది ఈ ధనుర్మాస వ్రతంలో. ఏమి చేయాలో ఏమి అవసరం లేదో చెబుతోంది ఈ పాటలో.

భగవంతుణ్ణి భగవన్మయుడని, పరమాత్మ అని, గోవింద అని ఇలా ఎన్నో పేర్లతో చెబుతారు. మనకు కనిపించే వివిద రూపాల్లో ఉంటాడు కాబట్టి భగవన్మయుడని అంటారు. "అణు" అతి చిన్నరూపం నుండి "బృహత్" అతి పెద్ద స్వరూపంగా ఉంటాడు కాబట్టి పరమాత్మనే అని అంటారు. "శబ్ద సహ" అతి సామన్యుడు పిలిస్తే అందుతాడు, "శబ్దాతిగ" చతుర్ముఖ బ్రహ్మకూడా కీర్తించ చేతకానివాడు, అందుకే ఆయనను గోవింద అని అంటారు. మరి జగత్తు మొత్తం పరమాత్మ శరీరం కదా! మరి ఇక్కడ తగినవి- తగనివి అంటూ ఉంటాయా!!

ప్రకృతి స్వభావాన్ని బట్టి, ఆయా గుణాలను బట్టి సత్వం, రజస్సు మరియూ తమస్సు అనే గుణాలు ఉంటాయని గమనించాలి. సత్వం జ్ఞానాన్ని, రజస్సు కోపాన్ని, తమస్సు అజ్ఞానాన్ని, బద్దకాన్ని ఇస్తాయి. మరి శరీరం ఈ పంచభూతాలతో తయారైనదే కదా, కాబట్టి ప్రకృతిలో ఉండే ఈ గుణాలు మనలో కూడా ఉంటాయి. కాని ఏదో ఒక గుణం పైన ఉండి నడిపిస్తుంది. సత్వం పెరిగితే మంచిది. ఇలా చెప్పటానికి మన చేతిలోని చూపుడు వేలును మనతో పోలుస్తారు, బ్రోటన వేలును పరమాత్మతో పోలుస్తారు. ఇక తమస్సు, రజస్సు, సత్వ గుణాలను మిగతామూడు వెల్లతోపోల్చుతారు. ఈ మూడు గుణాలతో కలిసి ఉన్న చూపుడు వేలుని బ్రోటనవేలితో కలిపే దాన్ని జ్ఞాన ముద్ర అంటారు. చిటికెన వేలు సత్వం కొద్దిగానే ఉంటుంది, రజస్సు-తమస్సు ఎక్కువగా ఉంటాయి. మరి బాగు పడటానికి సత్వం కావాలి, కొన్ని నియమాల్ని పాటించాలి. నియమాలు మరి ప్రకృతిలోని గుణాలకోసమే కాక, మనల్ని ఆదర్షంగా తీసుకొనేవారు బాగు పడటానికి కూడా మనం పాటించాల్సి వస్తుంది. ఈ కృత్యా- అకృత్య వియోచనాలను మన ఆండాళ్ తల్లి ఈ పాటలో తెలియజేస్తుంది.

"వైయత్తు వాళ్ వీర్గాళ్!" ఈ భూమి మీద ఉండి సుఖించాలని కోరిక ఉంటే చాలు రండి అని చెబుతుంది. ఈ భూమి తామస గుణమిచ్చేది, ఇక్కడ ఉండగా సాత్వికగుణం కలగటం కుంపెటలో తామరపువ్వు పూసినట్లు అంటారు. చివరికి పరమాత్మకు కూడా తామస గుణ ప్రభావం తప్పలేదు అని సీతాదేవి హనుమంతునితో చెప్పుతుంది రామాయణంలో. రావణ వధ అనంతరం సీతను తీసుకుపోవటానికి వచ్చిన హనుమ సీతాదేవితో, నువ్వు ఆజ్ఞ యివ్వు నిన్ను పీడించే ఈ రాక్షసమూకను ఒక్కసారి పని పడతాని అంటాడు, దానికి సీత ఇది వారి తప్పు కాదయా, వారు రావణుని అండలో ఉన్నారు, ఈ భూమిమీద ఉండగా తప్పు చేయడం సహజమేకదా, చివరికి చూసిరమ్మని చెబితే కాల్చివెల్లలేదా నీవు. దానికి హనుమ మరి నేనంటే ఏమో, కాని శ్రీరామచంద్రుడు కూడా తప్పు చేసినాడా అమ్మ అని అడిగాడు. సూర్పణక వచ్చినప్పుడు ఆమెతో రాముడు నేను ఏక పత్నివ్రతుడను అనిమాత్రం చెప్పక, తన తమ్ముడికేసి ఎందుకు చూపించాడు. ఇవ్వన్నీ కదా ఇన్ని అపచారాలకు దారి తీసింది అని హనుమంతుడితో చెప్పుతుంది.

"నాముం నం పావైక్కు" ఒకరిని కష్టపెట్టే వ్రతం కాదు, లోకులు వ్రతాలు వారి వారి సుఖాలకోసం చేస్తే ఈ వ్రతం లోకం అందరికోసం చేసేది. "శెయ్యుం కిరిశైగళ్ కేళీరో" మరి ఏం చేద్దాం ఈ వ్రతంలో వినండి, "పాఱ్కడలుళ్ పైయత్తుయిన్ఱ పరమనడి పాడి" పాలకడలిలోని సుకుమారంగా పవళించి ఉన్న వైకుంఠనాథుని పాదాలను పాడదాం. ఆయనను మించినవారు ఇంకెవరూలేరు కాబట్టి "పరమన్" అని అంటారు. ఎందుకంటే మనల్ని కాపాడటానికి తాను మొదటగా పాదం వేసినది పాలకడలిలోనే కదా! ఆయన పాదాలలో శంఖ, రథాంగ, కల్పక, ద్వజా, అరవింద, వజ్రా, అంకుష ఇత్యాదులు గుర్తులుగా చేసుకొని ఉన్న ఆపాదాన్ని పాడుదాం. ఎలాగైతే శిశువు తల్లి స్తన్యాన్ని గుర్తిస్తాడో, భక్తుడు భగవంతుని పాదాలను గుర్తించగలిగి ఉండాలి. సుకుమారమైన నిద్ర అంటే లోక రక్షణకోసం తానుచేసే సాత్విక-యోగనిద్ర. మనకోసం ఇంకా ఏమి చేస్తే బాగుపడతాం అని ఏర్పాటు చేసుకొన్న స్థానం పాలకడలి.

వ్యుహం-పాలకడలి

నిన్నటి నాడు నారాయణ అంటే ఏమిటో తెలుసుకున్నాం. ఇన్ని గుణాలు కల్గి ఉన్న నారాయణ తత్వాన్ని అర్థం చేసుకోవటం కష్టమే. మరి ఆ తత్వం మనల్ని ఎలా కాపాడుతుందో తెలుసుకోవటం అవసరం. మనం ఇప్పుడు ఒక శరీరం ధరించి ఉన్నాం, ఒక భూమి మీద నివసిస్తునాం. ఈ భూమి సౌరమండలంలో ఉంది. ఇదంతా ఎవరు ఏర్పాటు చేసారో మనం ఆలోచించటం లేదు. ఒక చిన్నవిత్తనం నుండి ఒకపెద్ద వటవృక్షం వచ్చినట్లుగా ఇది ఒకనాడు ఎర్పడింది ఒకడిలోంచే అని మనకు వేదం చెబుతుంది.

ఇవన్ని ఏవి లేనప్పుడు పరమాత్మ, ఈ జీవులందరూ ఉన్నారే అతి చిన్నరూపం కలవారు, అతి విలక్షణమైన జ్ఞానం కలవారు, కర్మభారాలు మోసేవారు, తామంతట తాము దేహాలు ధరించలేనివారు మరినేను వీళ్ళకు ఉపకారం చేయకుంటే ఎలా! కర్మ తొలగాలంటే దేహం కావాలి, దేహం ఉండే నేల కావాలి, దాన్ని భోగ స్థానం అంటారు. అందుకు అనుభవించే వస్తువులు కావాలి, వాటిని భోగ్యములు అని అంటారు. వీటిని అనుభవించే ఇంద్రియాలు కావలి వాటినే భోగ్య ఉపకరణములు అంటారు. ఇన్నింటిని తయారు చేనినవాడిని మనం నారాయణ అంటాం. మరి ఇవన్నీ తయారు చేయటానికి ఆయన ఏర్పాటు చేసుకొన్న స్థానాన్నే వ్యూహం అంటారు.

అక్కడ ఆయన వాసుదేవ, అనిరుద్ద, ప్రత్ర్యుమ్న, సంకర్షన అనే నాలుగు పేర్లతో ఉంటాడు. సృష్టి, స్థితి, లయము ఈ మూడు కార్యాలు చేస్తాడు, ఆ స్థానాన్నే పాల్కడలి అని కూడా అంటారు.

ఆయన కళ్యాణ గుణాలకు అది మూలస్థానం. అక్కడ వాసుదేవ అనేరూపంతో సర్వం తన ఆదీనంలో పెట్టుకుంటాడు. అందులోంచి ఒక రూపం తీస్తాడు దానికి సంకర్షణ అని పేరు, ఇది ప్రళయం చేయటానికి శివునిలో తానుండి చేస్తాడు. మరొక రూపం తీస్తాడు, దానికి అనిరుద్ద అని పేరు సృష్టి కోసం తాను బ్రహ్మలో ఉండి చేస్తాడు. మరొక రూపం తీస్తాడు, దానికి ప్రత్యుమ్న అని పేరు సృష్టించిన వాటిని రక్షించేందుకు ఇది ఇంద్రునిలో ఉండి చేస్తాడు. అక్కడికి ఆయన మొట్టమొదటిగా అడుగు పెడతాడు, ఆదిశేశువుపైన ఆయన ఉంటాడు. ఆర్తితో పిలిచేవారి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఎప్పుడెప్పుడు అవసరం ఏర్పడుతుందో అక్కడినుండి లోకరక్షణకై అవతారాలను పంపిస్తుంటాడు. అన్ని అవతారాలకు మూలస్థానం పాల్కడలియే. ఆయా అవతారల్లో ఆయన గుణ సంపదలను లోకానికి చాటుతాడు. అందుకే అవతారాలను విభవములు అంటారు.

ఆయన పాదలను పాడుదాం. కడుపు నిండి పోతుంది - ఇక "నెయ్యుణ్ణోం పాలుణ్ణోమ్" నెయ్యి వద్దు పాలు వద్దు. "నాట్కాలే నీరాడి" తెల తెల వారు జామున లేచి స్నానం చేద్దాం. "మైయిట్టెళుదోం మలరిట్టు నాం ముడియోమ్" కాటుక, పూలు ధరించం, ఏవి విలాసాలో అవి వదిలేస్తాం. "శెయ్యాదన శెయ్యోమ్" మాపూర్వులు చెయ్యనివి ఏమి చెయ్యం - ప్రాచీణ ఆచారాలు మానెయ్యం "తీక్కుఱళై చ్చెన్ఱోదోమ్" పుళ్ళవిరుపు మాటలు మాట్లాడం. "ఐయముం పిచ్చైయుం ఆందనైయుం కైకాట్టి" చేతనైనంత వరకు ధాన ధర్మం చేస్తాం. "ఉయ్యుమాఱెణ్ణి ఉగంద్" ఇవన్ని ఆనందంతో చేస్తాం.

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి ప్రవచనం..

Link: https://www.youtube.com/post/UgyjT_q5E5cclY3jv6N4AaABCQ

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes