'ముక్తి భవన్'.. ఎంతో మంది జీవితాలను ఇక్కడే ముగించాలని ఆశిస్తారు!
జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ ।
తస్మాదపరిహార్యేఽర్థే న త్వం శోచితుమర్హసి ।।
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి : https://youtu.be/kvoOfXyyktU ]
'పుట్టిన వానికి మరణము తప్పదు. మరణించినవానికి మరల జన్మము తప్పదు. అనివార్యమైన ఈ విషయమును గూర్చి శోకింప తగదు.' అని భాగవద్గీతలో, శ్రీ కృష్ణ పరమాత్ముడు తెలియజేశాడు. జీవితం అనేది తప్పించుకోవడానికి వీలు లేకుండా, ఖచ్చితంగా మరణంతో ముగిసేదే. కాబట్టి, తెలివైన వాడు, అనివార్యమైన దానిని గూర్చి శోకించడు. కానీ, అటువంటి మరణానికి సంబంధించి ఎంతో మంది, ఒక భవనంలో తమ తుది శ్వాస వీడాలని కోరుకోవడం మాత్రం, సాధారణ విషయం కాదు. అంతిమ యాత్ర కోసం, ఆ భవనంలో ఎదురు చూస్తుంటారు. ఈ భవనం ఇంతకీ ఎక్కడుంది? ఆ వివరాలేంటో, ఈ రోజు తెలుసుకుందాము..
ఆధ్యాత్మికతతో నిండిన పవిత్ర నగరం వారణాసి. సాక్ష్యాత్ పరమేశ్వర స్థాపితంగా చెప్పబడే ఈ నగరం, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులకు, పరమ పవిత్ర ప్రదేశం. ఈ నగరంలో మరణించడం, జనన మరణ చక్రాల నుండి బయట పడే మోక్షం పొందడానికి, ఖచ్చితమైన మార్గంగా, మన పురాణాలలో చెప్పబడింది. అందుకే, దేశ వ్యాప్తంగా హిందువులు, ఇక్కడికి తమ జీవిత కాలంలో చివరి రోజులను గడిపేందుకు వస్తుంటారు. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి, మోక్ష భవన్ ను ఆశ్రయిస్తుంటారు.
ఎరుపు రంగులో ఉన్న ఒక పాత భవనం పేరే 'మోక్ష భవన్'. మరణం కోసం ఎదురు చూస్తున్న అనేక మంది మనుషులతో, ఇది నిండి ఉంటుంది. ఈ భవనంలో, 12 కాంతి విహీన గదులుంటాయి. అతికొద్ది అలంకరణతో పాటు, అవసరమైన వస్తువులను మాత్రమే, ఈ గదుల్లో ఉంచుతారు. వీటిలో నివసించే మనుషులు, తాత్కాలికంగా మోక్షాన్ని పొందడానికి ప్రయత్నిస్తుంటారు. దీని కోసం వారికి కేవలం, 2 వారాల సమయం మాత్రమే ఉంటుంది. ఈ రెండు వారాల్లో, వారికి చావు రాకపోతే, వారిని మర్యాదగా, అక్కడి నుంచి వెళ్లిపొమ్మని కోరతారు. మరి ప్రతి ఒక్కరూ, వారణాసిలో చనిపోయే అదృష్టవంతులు కాలేరు కదా!
మోక్ష భవనంలో, మరణం ఎవరికీ విరోధి కాదు. నిజానికి ప్రతి ఒక్కరూ, తమ జీవితపు చివరి క్షణాల్లో తెలుసుకునే అంతిమ సత్యం ఇది. భూమిపై తాము జీవించే స్వల్ప కాలంలో, తుది విజయం సాధించాలనే ఆశతో, ప్రతి ఏటా, వేలాది మంది ఇక్కడికి వస్తుంటారు. వారణాసిలో, పవిత్ర గంగా నది ప్రవాహానికి సమీపంలో చనిపోవడం, ఒక అదృష్టంగా, భక్తులు భావిస్తుంటారు. దీనికి మోక్ష భవన్ కంటే మంచి ప్రదేశం, మరొకటి లేదని నమ్ముతారు.
1958లో, ప్రముఖ పారిశ్రామిక వేత్త విష్ణు హరి దాల్మియా, కాశీలో చనిపోవాలని కోరుకునే వారి కోసం, మోక్ష భవనాన్ని నిర్మించారు. ఈ భవనం యొక్క మేనేజర్ భైరవ్ నాథ్ శుక్లా, 48 సంవత్సరాలుగా, అంతిమ ప్రయాణానికై, ఇక్కడకు వచ్చే వారికి మోక్షం ప్రాప్తించాలని ప్రార్ధిస్తున్నారు. ఒక వ్యక్తి చనిపోయే అవకాశం ఉందో లేదో, ఆయన ముందే ఊహించగలరు. శుక్లా, అతని కుటుంబం, నిత్యం మృతదేహాలూ, వారి బంధువుల రోదనలకు అలవాటు పడ్డారు. ఓ వైపు శుక్లా, అక్కడున్న వారి మోక్షం కోసం ప్రార్ధిస్తుంటే, మరో వైపు ఆయన పిల్లలు, ఆ సముదాయంలోనే ఆడుతూ, పాడుతూ కనిపిస్తారు. ఇక్కడ మరణం అంటే, ఒక పవిత్రమైన ప్రక్రియ. ఇక్కడ నివసించే చాలా మంది మోక్షాన్ని పొందగా, కొందరు మరణం వరించక, నిరాశతో వెనుతిరుగుతుంటారు.
గంగా నది మెట్లపై, ఎప్పుడు చూసినా మరణించిన వారి దేహాలు, చితిపై కాలుతూ, బూడిద రంగు పొగ ఆకాశం మొత్తం అలముకుని కనిపిస్తుంది. వారణాసిలో, దేశ, విదేశీ పర్యాటకులూ, అన్వేషకులూ, యాత్రికులూ ఉన్నా, వీరందరూ ఒక అడుగు, వెనుకే ఉంటారు. జీవన్మరణాల తత్వాలు, ముందంజలో ఉంటాయి. దీనిని మరణం పొందే ప్రదేశంగా కాకుండా, విముక్తి కల్పించే స్థలంగా, పాపాలను కడిగే పవిత్ర ప్రదేశంగా, భక్తులు భావిస్తారు. స్వచ్ఛతకూ, జీవితానికీ కేంద్రంగా, భూమిపై ఎక్కడా కలగని విధంగా, మరణం ఇక్కడ లభిస్తుందని నమ్ముతారు.
అహనీ అహని భూతాని గచ్చంతిహ యమాలయం ।
శేషః స్థిరత్వం ఇచ్చంతి కిమాశ్చర్యమతః పరం ।।
"ప్రతి నిమిషం మనుష్యులు చని పోతూనే ఉన్నారు. బ్రతికి ఉన్నవారు ఈ విషయం చూస్తూనే ఉన్నారు. అయినా, ఏదో ఒక రోజు తామూ చని పోతామని అనుకోరు. దీనికన్నా మించిన ఆశ్చర్యం ఏముంటుంది?", అని శ్రీ కృష్ణుడు మహాభారతంలో, ఈ శ్లోకంలో వివరించాడు. ఈ సత్యాన్ని తెలుసుకుని, బ్రతికుండగా నలుగురికీ మంచి చేసే ప్రయత్నం చేద్దాము. మోక్షానికి ప్రయత్నిద్దాము. సర్వేజనాః సుఖినోభవంతు!
Link: https://www.youtube.com/post/UgyNn25wL3OpyW0d9e14AaABCQ
Post a Comment