భోగి పండుగ చరిత్ర! Bhogi Festival


భోగి పండుగ చరిత్ర!

అందరికీ భోగి పర్వదిన శుభాకాంక్షలు.. హిందువులు జరుపుకునే సంక్రాంతి పండుగ పర్వదినాలలో, మొదటి రోజున వచ్చేదే, భోగి పండుగ. పచ్చటి తోరణాలతో, రంగురంగుల ముగ్గుల మధ్య, అందంగా అలంకరించిన గొబ్బెమలతో, అత్యంత శోభాయమానంగా, తెలుగు లొగిళ్లు ముస్తాబయ్యే రోజు భోగి. మన సనాతన ధర్మంలో, ఈ రోజుకి ఎంతో ప్రాముఖ్యతతో పాటు, గొప్ప చరిత్ర కూడా ఉంది. అందుకే, భోగికి ఎంతో ప్రాముఖ్యత ఉందనే చెప్పాలి. ఈ పర్వదినానికి భోగి అనే పేరు ఎలా వచ్చింది? ఈ రోజు వెనుక దాగిన చారిత్రక ఘట్టాలు ఏమిటి? భోగి నాడు ఏం చేస్తే మంచిది? అనే విషయాలు, ఈ రోజు తెలుసుకుందాం..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/jkmkEU3i8yg ]

సరిగ్గా ఈ రోజే రైతులు పండించిన పంట ఇంటికి చేరి, భోగ భాగ్యాలు ఇంటిలో కొలువవ్వడం వల్ల, ఈ రోజుకి భోగి అనే పేరొచ్చినట్లు, కొన్ని గాధలు చెబుతుంటే, మరికొన్ని గాథల ప్రకారం, దక్షిణాయన కాలంలో సూర్యుడు భూమికి దూరంగా జరుగుతాడు. అందువల్ల, భూమిపై చలి పెరుగుతుంది. అలా సూర్యుడు ఉత్తరాయణ కాలం సమీపించే మొదటి రోజుల్లో చలి మరీ తీవ్రంగా ఉండడంతో, ఆ చలిని తట్టుకోవడానికి, పెద్ద పెద్ద మంటలు వేస్తారు. ఈ మంటలను సంస్కృతంలో, భూగ్ అంటారు. ఆ పదం నుంచే భోగి అనే పేరు వచ్చింది.

దక్షిణాయన కాలంలో ప్రజలు పడ్డ కష్టాలన్నీ, ఈ భోగి మంటలలో కాలిపోవాలని, అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తూ, ఆ మంటల్లో పాత చెక్క సామాన్లు వేస్తారు. అంతేకాకుండా, ఆవుపేడతో తయారు చేసిన పిడకలను వీటిలో వేసి, అగ్నిదేవునికి నమస్కరించుకుంటారు. ఈ భోగి పిడకల వెనుక సైన్స్ దాగి ఉందని, నేటి శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆవుపేడలో ఎన్నో ఔషధీయ గుణాలుండడం వలన, ఆ పిడకలను మండించి, దాని నుంచి వచ్చే పొగవల్ల, గాలిలో ఉండే ఎన్నో హానికారక క్రిములు నశిస్తాయి.

మన పురాణాల ప్రకారం, మూడు జగత్ కళ్యాణ కార్యాలు, ఈ భోగి రోజునే జరిగాయి. అందుకే ఈ రోజుకి చాలా విశిష్ఠత ఉన్నట్లు, మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ భోగి రోజునే, విష్ణుమూర్తి వామనవతారం ఎత్తి, బలి చక్రవర్తిని తన మూడో పాదంతో పాతాళానికి త్రొక్కాడని, భాగవతం, విష్ణు పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు, భోగి రోజునే, చిన్ని కృష్ణుడు గోవర్ధన గిరిని తన చిటికెన వ్రేలిపై ఎత్తి, గోకుల ప్రజలను కాపాడి, ఇంద్రుడికి గర్వభంగం చేశాడని, శ్రీ కృష్ణుడి చరిత్ర చెబుతోంది. ఇక ఆ విష్ణుమూర్తి అవతారమైన శ్రీరంగనాధుడి మహాభక్తురాలు గోదాదేవి, శ్రీరంగ స్వామిలో ఐక్యమైంది కూడా భోగి రోజునేనని, శ్రీరంగ స్థల పురాణం చెబుతోంది. ఆ మహాతల్లి, తమిళనాట "శ్రీవిల్లి పుత్తూరు" అనే గ్రామంలో, విష్ణుచిత్తుడనే సద్ బ్రాహ్మణుడికి పూలతోటలో దొరికింది. ఆమె చిన్నతనం నుంచే, శ్రీరంగంలో కొలువైన రంగనాధ స్వామిని, అమితంగా ఆరాధించేది. గోదాదేవి యవ్వనంలోకి రాగానే, తండ్రి పెళ్లి చెయ్యాలని తలచినప్పుడు, తాను ఆ రంగనాధుణ్ణి తప్ప, వేరొకరిని పెళ్లాడనని చెప్పింది. అప్పుడు తన కోరిక నెరవేర్చుకునేందుకు, ధనుర్మాస వ్రతం ఆచరించింది. ఈ వ్రతం చేసిన నెలరోజులలో, రోజూ తనకి కలిగిన అనుభవాలను వర్ణిస్తూ, రోజుకో పాశురం రాసేది. అలా ఆమె 30 రోజుల్లో, 30 పాశురాలు రచించి, స్వామికి కృతి సమర్పించింది. ఈ 30 పాశురాలను కలిపి చేసిన గ్రంధాన్నే, తిరుప్పావై అని అంటారు. ఈ వ్రతం పూర్తయిన 30వ రోజు, స్వామి ప్రత్యక్షమై, ఆమెను పెళ్లి చేసుకుంటాననీ, అందుకు శ్రీరంగం రమ్మనీ చెప్పాడట. స్వామి ఆదేశం మేరకు, గోదాదేవి శ్రీరంగం వెళ్లి, అశేష ప్రజానీకం సమక్షంలో, శ్రీరంగనాధుణ్ణి వివాహమాడి, పెళ్లితంతు పూర్తవ్వగానే, గర్భాలయంలోకి వెళ్లింది. అక్కడ స్వామివారి విగ్రహం దరికి చేరి, ఆయన పాదాలను తాకగానే, ఆమె స్వామిలో ఐక్యమైపోయింది. ఈ పరమపావన ఘట్టాన్ని, అక్కడున్న ప్రజలందరూ ప్రత్యక్షంగా వీక్షించారు. నాటి నుంచీ ఆ తల్లి రంగనాథుని ప్రియపత్నిగా, భక్తులచే కొలవబడుతోంది. గొదాదేవినే, ఆండాళ్ అమ్మవారిగా కూడా పిలుస్తారు.

ఇక భోగి పండుగ రోజు ముఖ్యంగా పాటించే మరో ఆచారం, భోగి పళ్లను పిల్లలకు పొయ్యడం. తెల్లవారు ఝామునే లేచి, అభ్యంగన స్నానం చేసిన తర్వాత, భోగి మంటలలో ఆవుపిడకలు వేసి, అగ్ని దేవునికి నమస్కరించుకోవాలి. ఆ తరువాత సాయంత్రం, పెద్ద వారినీ, ముత్తైదువులను పిలిచి, చిన్న పిల్లల తలపై నుంచి, రేగి పళ్లూ, రాగి నాణేలూ, పువ్వులూ కలిపి పోస్తారు. ఇలా చెయ్యడం వల్ల, పిల్లలకున్న పీడ వదిలి, మంచి జరుగుతుందని పెద్దల విశ్వాసం. ఈ భోగి పళ్ల వెనుక ఆరోగ్య సూత్రం కూడా ఉందని, ఆయుర్వేద పండితుల చెబుతారు. రేగిపళ్లు సూర్యుడికి ప్రతీకగా చెబుతారు. ఎందుకంటే, ఈ రేగి పళ్లు, సూర్యకిరణాలలోని ప్రాణశక్తిని అధికంగా గ్రహించి, నిల్వ ఉంచుకుంటాయి. కనుక వీటిని తలపై నుంచి పోయడం వలన, వీటిలోని విద్యుత్శక్తి, శరీరంపై, ఆరోగ్యంపై, ప్రభావాన్ని చూపుతాయి. అంతేకాదు, ప్రతి మనిషి తలపైనా, బ్రహ్మరంధ్రం ఉంటుందని, మన శాస్త్రాలు చెబుతున్నాయి. దానిపై, ఈ రేగి పళ్లూ, రాగి నాణేలూ పడడం వలన, ఆ రంధ్రం ప్రేరేపితమై, పిల్లలు జ్ఞానవంతులవుతారు. సైన్స్ కందని ఎన్నో రహస్యాలు దాగిన మన ఆచారాలను తప్పక పాటించాలి. మన పెద్దలు మనకందించిన సంప్రదాయాలను పాటిస్తూ, అత్యున్నతమైన మన సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం. ఈ భోగి పండుగ మీకు భోగభాగ్యాలను అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి మీ అందరికీ భోగి శుభాకాంక్షలు.

Link: https://www.youtube.com/post/Ugz85EEPcWX1S5MYyux4AaABCQ

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes