‘కృష్ణ’ శబ్దంతో ఏం పొందగలం!
సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువు మరో రూపమే, శ్రీకృష్ణ భగవానుడు.. ద్వాపర యుగంలో పుట్టి, దుష్ట శిక్షణ, శిష్టరక్షణ చేసిన కరుణామయుడు, కారుణ్యశీలుడు, ఆదర్శ పురుషుడు.. ప్రేమతత్వాన్ని అనేక దృక్పథాలలో విపులీకరించిన ఆదర్శమూర్తి.. భగవద్గీత ద్వారా, అనేక విధాలైన ఆధ్యాత్మిక మార్గాలను మనకు అందించిన దివ్య పురుషుడు.. యుగ ధర్మాలనూ, సాంఘిక న్యాయాలనూ, అనంతమైన విశ్వతత్త్వాన్నీ తెలియచెప్పిన మహనీయుడు.. అలాంటి శ్రీకృష్ణ మంత్రం, బాహ్యశత్రువులనూ, అంతః శత్రువులనూ హరించే శక్తిగలది..
సకల వేదాంతాలయందూ చెప్పబడిన పూజ్య మంత్రమిది.. సమస్త సంసార చింతనలను దూరంచేసి, సర్వైశ్వర్యాలను ఇచ్చే దివ్య మంత్రమిది. శ్రీకృష్ణునికి భక్తి పూర్వకంగా ఒక్కసారి నమస్కరిస్తే, పది అశ్వమేధ యాగాలు చేసి, అవభృధ స్నానం ఆచరించినంత పుణ్యం లభిస్తుందని, మన పురాణాలు చెబుతున్నాయి. 'శరీకృష్ణు'నికి త్రికరణశుద్ధిగా, భక్తి శ్రద్ధలతో నమస్కరించినంత మాత్రాన్నే, జన్మరాహిత్యం కలుగుతుంది. ‘కృష్’అనగా ‘సత్తు’, ‘ణ’ అనగా ఆనందమని అర్థం. అంటే, సదానందము.. లేక సచ్చిదానందమని అర్థం..
కలియుగాన ‘కృష్ణ కృష్ణ’ అనే మంత్రాన్ని ఎవరు అహోరాత్రులు స్మరిస్తారో, అలాంటి వారు, సాక్షాత్తూ శ్రీకృష్ణ రూపాన్ని పొందుతారని పురాణోక్తి. 'ఓం'కారం మొదలు, వేదాల వరకూ, ‘కృష్ణ’ అనే రెండక్షరాలు, సమస్త విఘ్నాలనూ హరించి, మనోభీష్టాలను నెరవేరుస్తున్నాయి.. అలాంటి శ్రీమహావిష్ణువు స్వరూపమయిన శ్రీకృష్ణ భగవానుడు, కారణజన్ముడు.. మధురలో పుట్టి, గోకులంలో పెరిగి, నంద యశోద ప్రేమకు పాత్రుడైన వాడు. గోపీ మానస చోరుడు, అర్జున రథసారథీ అయిన శ్రీకృష్ణ భగవానుడి ఆవిర్భావమే, దుష్టశిక్షణ కొరకు.. కంసుని దురాగతాలను అంతమొందించడానికీ, నిరాశ్రయులైన దీనులను ఉద్ధరించడానికీ అవతరించినవాడు..
గోకులంలో పెరిగాడు కాబట్టి, గోపాల కృష్ణుడయ్యాడు. యమునా నదీ తీరంలో, కాళీయ మర్థనం చేసిన మహనీయుడాయన. బాల్యంలోనే, తన నోటిలో అండ పిండ బ్రహ్మాండాలను చూపించిన దైవం.. సాక్షాత్తూ శ్రీహరి అంశ అయిన కృష్ణునికి, లెక్క లేనన్ని పేర్లు.. ఆ స్వామిని ఏ పేరు పెట్టి పిలిచినా పలుకుతాడు. ఏమిచ్చి అర్చించినా, ఆదుకుని అక్కున చేర్చుకుంటాడు..
రామ శబ్దానికీ, కృష్ణ శబ్దానికీ భేదం లేదు. ఈ రెండు అవతారాలూ సాక్షాత్తూ శ్రీహరి అవతారాలే కావడం వల్లనే, ఆ స్వాముల నామస్మరణ, సాక్షాత్తూ శ్రీహరి నామస్మరణంగా భావిస్తారు. అందుకే, ‘హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ’ అంటారు. ఇంతటి మహిమాన్వితమైన ఈ మంత్రాన్ని జపిస్తే, సమస్త దోషాలూ సమూలంగా మటుమాయమై, మానసిక ప్రశాంతత లభిస్తుంది. నిష్కల్మషమైన మనస్సుతో కృష్ణుని పూజిస్తే, ఆ స్వామి కరుణించి, కటాక్షిస్తాడు.. కుచేలుడూ, సుధాముడి లాంటి ఎందరో భక్తులను ఆదరించి, అక్కున చేర్చుకుని, ముక్తిని ప్రసాదించిన అపురూప దైవం, శ్రీకృష్ణ భగవానుడు.
కృష్ణ నామస్మరణమే పరమావధిగా ఎవరు స్మరిస్తారో, వారి మనస్సులలో శ్రీకృష్ణ భగవానుడు కొలువై ఉంటాడు. అనేక మంది యోగులూ, సిద్ధులూ యోగాభ్యాస సమయంలో 'శ్రీకృష్ణుని' సహస్రారమందు ధ్యానిస్తూ, ప్రాణాయామం నిలిపి, మోక్షాన్ని పొందారు. వాయువును కపాలమునందున్న సహస్రార చక్రం వరకూ తీసుకునిపోయే సహజ శక్తి ‘కృష్ణ’ శబ్దానికి ఉంది. కృష్ణ శబ్దము నోటితో ఉచ్చరించినపుడు, ఆయా అక్షరాలకు స్థానాలగు దవడ, కంఠం, వీనిలో పుట్టిన వాయువూ, శబ్దమూలమున, శిరస్సునగల సహస్రార చక్రం వరకూ, సహజ సిద్ధంగా చేరుకుంటుంది. అపుడు ‘వాయువు’ను అంటి, చలించే స్వభావంగల వనస్సును, యోగ ప్రక్రియచే, వాయువుతో లయమొనర్చి, సహస్రారమునకు తీసుకునిపోయి నిలుప వచ్చు. ఇలాంటి సిద్ధ ప్రక్రియ, మహాత్ములైన యోగులకు మాత్రమే సాధ్యపడుతుంది.. ఈ విషయం సూక్ష్మాతి సూక్ష్మంగా, మహాభారతంలో, శ్రీకృష్ణ నామతత్వార్థ ప్రభావంగా చెప్పడం జరిగింది..
కృష్ణనామ స్మరణం కలిదోష నాశకం!
కృష్ణనామాన్ని ఏ తీరుగా తలిచినప్పటికీ మన మనసులలోని మాలిన్యాన్ని కడిగేస్తుంది. ‘కృష్ణా‘ అనే నామ సంకీర్తనం వల్ల కోటి చంద్రగ్రహణ, సూర్యగ్రహణ స్నానాలను చేయడంవల్ల కలిగే ఫలితం పొందుతారు. కృష్ణ నామం ఎన్ని పాతకాలను దహించగలదంటే, అసలన్ని పాపాలను మానవులు ఎన్నటికీ చేయలేరు. పాప రూపాగ్నిలో దహనమై, చేసిన సత్కర్మలన్నీ శూన్యమైన వారికి, కృష్ణనామం పరమ ఔషధం వంటిది. మృత్యు సమయంలో కూడా కృష్ణనామాన్ని స్మరిస్తే, యమపురికి పోకుండా, పరంధామానికి చేరుకుంటారంటారు.
భగవానుని గుణకర్మ, నామైక దేశ సంకీర్తన మాత్రం చేతనే, పాపాలన్నీ సంపూర్ణంగా నశిస్తాయని చెప్పబడింది. ఒక జీవిత కాలంలో జరిగే పాపమంతటినీ కలిపినప్పటికీ, సామాగ్ని ముందు గడ్డిపోచతో సమమని పురాణ వచనం. పాపక్షయానికై నామస్మరణం ఏ ఇతర సాధనాలతోను సముచ్చయంగా ఉండవలసిన అవసరం లేదు. భగవన్నామ సంకీర్తన సాధనేతర నిరపేక్షంగానే, పాపక్షయానికి సాధనమని పండితార్ధం కదా! కలియుగంలో నామ సంకీర్తనమే ముక్తికి సాధనంగా చెప్పబడింది.
కలి వల్ల కలిగే దుష్ఫలితాలను పోగొట్టుకోవడం ఎలా? అని ఒకసారి నారదుడు బ్రహ్మదేవుని అడుగగా, ‘సత్య యుగంలో ధ్యానంవల్ల, త్రేతాయుగంలో యజ్ఞాలవల్ల, ద్వాపర యుగంలో పూజలు, వ్రతాలవల్ల పొందే ఫలితాలన్నీ, కలియుగంలో కేవలం నామస్మరణ వలన పొందుతారని, ‘హరే రామ హరే రామ రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే’ అనే నామ మంత్రాన్ని ఉపదేశించాడు. ఈ మంత్రంలోని రామ శబ్దం, హరి శబ్దం, పరబ్రహ్మ వాచకమైన శ్రీకృష్ణుణ్ణే సూచిస్తాయి.
‘కృష్ణః’ అంటే, పాపాలు పోగొట్టేవాడు. ‘కృష్ణః’ అన్న పదంలోని ‘క’కారం బ్రహ్మవాచకం, ‘ఋ‘కారం అనంత వాచకం, ‘ష’ కారం శివ సూచకం, ‘ణ’ కారం ధర్మబోధకం. చివర ఉన్న 'ఆ' కారం శ్వేత ద్వీప వాసియైన విష్ణు వాచకం. విసర్గం, నర నారాయణార్ధకం. కనుక, కృష్ణుడు సమస్త దేవతల తేజోరాశి. ‘కృష్ణస్తు భగవాన్ స్వయమ్’ అని, కృష్ణ భగవానుని నామాన్ని నిత్యం స్మరించినంత మాత్రాన్నే, పదివేల యజ్ఞాలూ, కోటి తీర్థ స్నాన పుణ్యం లభిస్తుందనీ, వ్రతాల వలన కూడా నశించని పాపాలు, 'కృష్ణ' అనే నామోచ్చరణ చేయడంతో తొలగిపోతాయనీ, ‘కృష్ణ’ అంటూ కీర్తించే వారి శరీరం, ఎన్నటికీ అపవిత్రం కాజాలదనీ, జన్మ జన్మల పాపాలన్నీ తొలగి, కృష్ణునిపై మనసు లగ్నమవుతుందని, శ్రీకృష్ణ నామ మహిమ గురించి, సాక్షాత్తు శ్రీమహా విష్ణువే బ్రహ్మకు చెప్పే సందర్భం, స్కందపురాణంలో ఉంది. ‘నా కృష్ణ నామోచ్ఛారణ చేయడం వల్ల, నాకెంతో ప్రీతికలుగుతుంది. ఇతర నామాలు కోటిసార్లు జపించినా, నాకు అంత సంతోషం కలగదు’ అన్నాడు.
నామ స్మరణకే ప్రభావమున్నదని గ్రహించి, శ్రీకృష్ణ నామమునే సదా స్మరించి, నారదాదులు ఆయన కృపకు పాత్రులయ్యారు. కనుక, కలియుగంలో జీవిస్తున్న మానవులందరికీ, నామ మహిమనూ, లోక ధర్మాలనీ చెప్పిన కారణంగా, 'శ్రీకృష్ణావతారం' కలియుగ ప్రజలందరికీ గొప్పది. ఆచరణానికి అనువైనది. 'భక్త దుఃఖ కర్షిం కృష్ణః’ అంటే, 'భక్తుల దుఃఖాన్ని పోగొట్టేవాడు శ్రీకృష్ణుడు' అని అర్ధం. మానవ జీవితంలోని పాపాల్ని పోగొట్టుకోవడానికి, శాస్త్రాలలో అనేక ప్రాయశ్చితాలు చెప్పారు. చాంద్రాయణాది వ్రతాలు ఎన్నో చేయాల్సి ఉంటుంది. ఇలా ఎన్ని చేసినా, ఆ పాపం పోదు. కానీ, శ్రీకృష్ణ నామం జపిస్తే, ‘క్షోభం’ వల్ల కలిగిన పాపం కూడా, నశిస్తుంది. అందుకు కారణం, శ్రీకృష్ణ నామంలో 'క్లేశఘ్ని-పాపఘ్ని' అనే బలవత్తరమైన శక్తులుండడమేనని.. ఈ జగత్తులో పరమాత్ముడు ఎన్ని రూపాలతో విరాజిల్లుతున్నాడో అన్ని నామాలతో ఆయన పేర్కొనబడుతుంటాడు. కృష్ణ నామం పాపాన్ని నాశనం చేసి, పుణ్యాన్ని ఉత్పాదించి, భక్తినీ, తత్త్వజ్ఞానాన్నీ, భగవద్ తృప్తినీ కలిగిస్తుంది.
కృష్ణ నామ జపం చేసేవారికి, విపత్తియే సంపత్తిగా పరిణమిస్తుంది. పురుషోత్తముడూ, స్థితప్రజ్ఞుడూ అయిన శ్రీకృష్ణుడు, విష్ణుమూర్తి యొక్క మహోన్నతావతారం. పదారు కళల్లో మూర్త్భీవించిన పూర్ణావతారం. జీవులు తరించుటకు, ఉపనిషత్సారమైన గీతామృతాన్ని పంచిపెట్టిన ప్రేమ మూర్తి. ద్వాపర యుగంలో, రోహిణీ నక్షత్ర యుక్త శ్రావణ బహుళ అష్టమి నాడు, శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణునిగా అవతరించాడు. అష్టమియొక్క అర్ధరాత్రి సమయంలో, ఆకాశమందు అర్ధ చంద్రుడు ప్రకాశించగా, పృధ్వియందు పూర్ణ చంద్రుడుదయించినట్టు, శరణాగత వత్సలుడు దేవకీదేవికి జన్మించడం.. శ్రీకృష్ణావతారం సంపూర్ణావతారమనీ, శ్రీకృష్ణుడు సాక్షాత్తూ భగవంతుడేననీ, భాగవతం మనకు వెల్లడిస్తోంది. ఆ శ్రీకృష్ణ పరబ్రహ్మకు, భక్తి ప్రపుల్లాత్ములమై ప్రణమిల్లి, మన జీవితాలను ధన్యం చేసుకుందాం..
జై శ్రీ కృష్ణ!
కృష్ణుడికి సంబంధించిన ఈ వీడియోలు చూడండి:
[ ఉడిపీకి శ్రీ కృష్ణుడు ఎలా వచ్చాడు? = ఈ వీడియో చూడండి: https://youtu.be/451l4ymbZFs ]
[ శ్రీ కృష్ణుడు జన్మించిన రాత్రి సంభవించిన సంఘటనలు!: https://youtu.be/-X6UbycGTdI ]
[ శ్రీ కృష్ణుడి అయిదుగురు తల్లులు! = ఈ వీడియో చూడండి: https://youtu.be/AbSSImIw2-4 ]
[ విధి లిఖితం విష్ణువు నైనా విడిచిపెట్టదు! = ఈ వీడియో చూడండి: https://youtu.be/q7OQVyx4sU4 ]
[ భగవద్గీతలో మరణించిన వారి ఆత్మకు గమ్యాన్ని తెలిపే లక్షణాలు!: https://youtu.be/nq9T9mD0Cng ]
Link: https://www.youtube.com/post/Ugw1keF9G32zE4EjOVN4AaABCQ
Post a Comment