సత్య దర్శనం అంటే ఏంటి?!
నమ్మకం ఒక అయస్కాంత శక్తి. ‘దేవుడు వున్నాడు’ అన్న విశ్వాసమే, ఆధ్యాత్మిక కార్యక్షేత్రంలో ఎంతటి ఘనతనైనా సాధించేలా చేస్తుంది. ఏ కార్య నిర్వహణలోనైనా సమిష్టితత్త్వం, పరస్పరాధారిత విధానం, ఉత్తమ ఫలితాన్నిస్తాయి. ముఖ్యంగా ‘విపత్కర పరిస్థితులు’ ఏర్పడినప్పుడు, జాతి మొత్తంగా ఒక్కతాటిపై నిలిచి, వాటిని అధిగమించాలి. మనిషికి ఆరోగ్యవంతమైన జీవితమే ఉన్నతం. క్రమశిక్షణాయుతమైన జీవితం, వ్యక్తిగత, సమష్టి అలవాట్లూ, ఆలోచనలూ, కార్యాచరణలలో నిబద్ధతనూ పాటించడం వంటి వాటివల్ల మాత్రమే, అది సాధ్యపడుతుంది. కట్టుబాట్లతో కూడిన అలవాట్లను సమాజంలో ప్రతిష్ఠించేందుకు, సనాతన సంప్రదాయం, వేదమంత్రాలనూ సూక్తాలనూ వాడుకున్నది. వీటిలో శాంతిమంత్రాలు ప్రముఖమైనవి. వాటిలో ‘ఐతరేయ ఉపనిషత్తు’లోని ‘శాంతిమంత్రం’ ఒకటి. ‘మంత్రం’ అంటే మననం చేసేవారిని రక్షించేది.
[ నిరాశను ఎలా జయించాలి! = ఈ వీడియో చూడండి: https://youtu.be/XGKkJQEPLHU ]
ఓం వాజ్ఞ్మే మనసి ప్రతిష్ఠితా / మనోమే వాచి ప్రతిష్ఠితా / మావిరావీర్మ ఏధి / వేదస్య మ ఆణీస్థః / శ్రుతం మే మా / ప్రహాసీరనేనా ధీతేనాహో రాత్రాన్ / సందధామృతం వదిష్యామి / సత్యం వదిష్యామి! తన్మావవతు / తద్వక్తారమవత్వవతు / మామవతు వక్తారమవతు వక్తారమ్ / ఓం శాంతిః శాంతిః శాంతిః’. ‘నా వాక్కు మనసులో ప్రతిష్ఠితమగుగాక. మనస్సు వాక్కులో ప్రతిష్ఠితమగుగాక’. ఇక్కడ వాక్కును వ్యష్టిగా తీసుకుంటే, మనస్సు సమాజాన్ని ప్రతిబింబిస్తుంది. వాక్కూ, మనస్సూ ఏకమవడం వల్ల, కార్యం ప్రకాశితమవుతుంది.
‘ప్రకాశమవడం’ అంటే, ‘సాక్షాత్కారమవడమే’. ఏదైతే ప్రకాశిస్తుందో, అదే జ్ఞానం.. అదే పరమాత్మ సాక్షాత్కారం.. అలా సాక్షాత్కరించిన పరమాత్మను, ‘ఓ పరమాత్మా! నాలో ప్రకాశించెదవుగాక’ అని సాధకుడు వేడుకుంటున్నాడు.. అలా ప్రార్థించడం అంటే, ‘సత్యం బోధపర్చుకోవటమే’.. వేదం అంటే తెలుసుకోవడం..
ఏది తెలుసుకోవడానికి యోగ్యమైందో, దేనివల్ల మన సమాజానికి శ్రేయస్సు కలుగుతుందో, దానిని తెలుసుకోవడమే వేదజ్ఞానం. ‘ఆ శ్రేయస్కరమైన ఆలోచనలు, నిరంతరం మనస్సులో నిలిచి పోవాలని, సాధకుడు ప్రార్థిస్తున్నాడు. దేనికి స్పందిస్తామో, దేనిని ఆలోచిస్తామో, దేనిని పలుకుతామో, దేనిని ఆచరిస్తామో, అది శ్రేయస్కరమైనదై, నన్ను వీడకుండుగాక. దేనిని ‘మనసా వాచా కర్మణా’ నమ్ముతామో, దానిని స్మరిస్తాం. దేని స్మరణ మన ప్రగతికీ, సుగతికీ ఉపకరిస్తుందో, దానిని మాత్రమే వినాలనీ, స్మరించాలనీ, సాధకుడు భావిస్తున్నాడు.
నేర్చుకున్న దానిని, నేను రేయింబవళ్ళూ యోచించెదనుగాక.. బుద్ధికి గోచరమైన వ్యావహారిక సత్యాన్ని పలుకుదునుగాక.. పారమార్థిక సత్యాన్ని పలుకుదును గాక.. ప్రపంచావిష్కరణలో ముందుగా, ఋతం, సత్యం ఉత్పన్నమైనవని, శాస్త్రాలు చెబుతున్నాయి.. ఋతం అంటే, ప్రాకృతిక నియమాలు. ఇది వ్యావహారిక సత్యం.. దేశ కాలమాన పరిస్థితులకు అతీతంగా, సర్వకాలీనం, సర్వజనీనం, సహజం, అవ్యక్తమైన ప్రకృతే సత్యంగా పిలువబడుతుంది. అదే భగవంతుడు. ఇది పారమార్థిక సత్యం. సూర్యుడు ప్రతి నిత్యం తూర్పున ఉదయిస్తాడు, పశ్చిమాన అస్తమిస్తాడు.. ఇది వ్యావహారిక సత్యం.. కానీ, నిజానికి సూర్యుడు ఉదయించడు, అస్తమించడు. ఇది పారమార్థిక సత్యం.. ప్రాకృతిక స్పందనల ద్వారా పొందిన విజ్ఞానం ధర్మాచరణకు దోహదపడితే, ‘సత్య దర్శనం’ అవుతుంది.
సుప్త చేతనాత్మకమైన మనస్సుకు ఇచ్చుకునే సూచనలు ఎంత బలంగా ఉంటే, మన ఆశయం అంత బలంగా సిద్ధిస్తుంది.. చేతనాత్మక, సుప్త చేతనాత్మక మనస్సుల మధ్య, పరస్పర సంబంధాలు ఎంత బలపడితే, అంత ప్రభావవంతంగా, కార్యావిష్కరణ జరుగుతుంది.. నిజానికి ప్రతి ఆలోచనా ఒక కారణం కాగా, ప్రతి స్థితీ ఒక కార్యం.. ఆకృతి ఉంటేనే దానికి ప్రయోజనం ఉంటుంది.. మానసిక ప్రపంచంలో రూపం ఏర్పడితేనే, అది దాని కర్తవ్యాన్ని నిర్వహిస్తుంది.. నిజానికి మానసిక ప్రపంచంలో ఒక రూపం ఏర్పడాలంటే, అది నిజంగా ఉన్నట్లుగా మనం భావించాలి.. ఎంత బలంగా భావించి దర్శించగలిగితే, ఆశయసాధనకు అంత దగ్గరగా వెళతాం.. ‘నాకిది కావాలని’ కోరుకుంటాం.. నిజంగా అది సాకారం కావాలంటే, మన ప్రయత్నం పరిపూర్ణంగా ఉండాలి.. కల్పన, నమ్మకం, రెండు రెక్కలున్న పక్షి అనుకొంటే, ఆ ఊహనే మనం, ‘ఆశయం‘ అనుకోవచ్చు.. ఇది బలంగా ఉన్నచోటనే, లక్ష్యం నిలుస్తుంది. మంత్రార్థాన్ని భౌతికంగా కాకుండా, దాని అంతరంగాన్ని గ్రహించి, నియమిత అంతరాలలో, ఆయా సూచనలతో, అంతర్మనస్సును బలోపేతం చేయడం వల్ల, ఎంతటి లక్ష్యాన్నయినా, ఏ వ్యాధినైనా జయించగలం.
నమ్మకమే అత్యున్నత శక్తి!
‘మననం చేయడం’ అంటే, నిరంతర స్మరణ. దానివల్ల అంతర్మనస్సు, అవసరమైన జ్ఞానాన్ని పొందుతుంది. బలమైన సంకల్పంతో కూడిన జ్ఞానం, సత్కార్యాన్ని ఆవిష్కరిస్తుంది.. వీటినే, ‘ఇఛ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులు’గా చెబుతారు. ఇవే, వాక్కుకూ, మనస్సుకూ, శరీరానికీ (మనస్సు ఆలోచనకూ, వాక్కు జ్ఞానానికీ, శరీరం ఆచరణకూ) ప్రతీకలుగా నిలుస్తాయి. శ్రద్ధతో ప్రార్థించడం అంటే, ఇనుముకు అయస్కాంత శక్తిని సమకూర్చడం వంటిది.. ఈ అయస్కాంత శక్తినే నమ్మకం (విశ్వాసం) అంటున్నాం. ‘నమ్మకం’ ఉంటేనే, ఏదైనా సాధించగలం.. దీనిని కోల్పోతే, అనామకులుగా మిగిలిపోతాం.. భావన, అనుభూతి, శక్తి, సామర్థ్యం, ప్రేమ, సౌందర్యం.. వీటి అంతరంగ శక్తిని ఊహించి, వినియోగించుకోగలిగితే, అత్యున్నత ఫలితాలు ఆవిష్కారమవుతాయి.. ఇది ఫాంటసీ కాదు.. ఉదాహరణకు, మనం ఆక్సీజన్, హైడ్రోజన్‌లను, 1-2 నిష్పత్తిలో కలిపితే, నీరు వస్తుంది.. ఇదేదో యాదృచ్ఛికం కాదు.. ఎన్నిసార్లు కలిపినా, ఆ మిశ్రమం అలా నీటినే ఇస్తుంది..
సర్వేజనాః సుఖినోభవంత్!
Link: https://www.youtube.com/post/UgxtiNvB3SnJVrSZR6l4AaABCQ
Post a Comment