అ-సంతృప్తి!


అ-సంతృప్తి!

'జీవితంలో' సంసారంలో నెగ్గాలన్నా, సమాజంలో నెగ్గాలన్నా, సామ్రాజ్యంలో నెగ్గాలన్నా, మాటల చాతుర్యం చాలా అవసరం. అలాగే, జీవితంలో సుఖంగా ఉండాలంటే, సంతృప్తి అనేది చాలా ముఖ్యం. ఆ సంతృప్తినీ, దాన్ని వ్యక్తంజేసే సంభాషణా చాతుర్యాన్నీ కూడా, తిరుపతి వేంకటకవులు, ఒక చక్కటి పద్యంలో అందించారు. వారు ఒక శతావధానం చేస్తుంటే, వెంకటశాస్త్రి గారూ, దివాకర్ల తిరుపతిశాస్త్రి గారూ, గమ్మత్తైన విషయం ఇచ్చి వర్ణించమని అడిగారు. అదేంటంటే లక్ష్మీదేవీ, పార్వతీదేవీ ఒకచోట కలుసుకున్నప్పుడు, వారిద్దరూ ఒకరినొకరు దెప్పుకుంటే ఎలా ఉంటుందో వర్ణించమన్నారు.

[ గౌరింటాకు గోరింటాకా? = ఈ వీడియో చూడండి: https://youtu.be/Nfii-HqJiFw ]

ఆ పద్యం.. గంగాధరుడు నీ మగండని నవ్వంగ, వేషధరుండు నీ పెన్మిటనియే..

  ఎద్దునెక్కును నీదు నెమ్మికాడెననె నవ్వ, గ్రద్దనెక్కును నీ మగండటనియే..

  పాములాభరణాలు పతిదేవునకనంగ, పాములే ప్రక్క నీ భర్తకనియే..

  వల్లకాడిల్లు నీ వల్లభునకనంగ, నడిసంద్రమిల్లు నీ నాథునకనె..

  ముష్టికెక్కడికేగె నీ ఇష్టుడనిన, బలిమకంబునకేగెనో లలనయనియే..

 ఇట్టులన్యోన్యమర్మంబులెంచుకొనెడు పర్వతాంభోదికన్యల ప్రస్తుతింతు.. అంటూ సాగుతుంది..

సరస్వతీ దేవి ఒక వ్రతం చేస్తోంది. ఆ వ్రతానికి లక్ష్మీదేవినీ, పార్వతీదేవినీ పిలిచింది. లక్ష్మీదేవి ఐరావతంపై వచ్చింది. పార్వతీ దేవి వాహనం సింహం. అయితే, ఆ రోజున సింహంపై కాకుండా, శివుని వాహనమైన ఎద్దుపై వెళ్లింది. ఐరావతంపై వచ్చిన వారికి, ఎద్దుపై వచ్చిన వారు లోకువే కదా! వెంటనే లక్ష్మీదేవి, ‘మీ ఆయన గంగాధరుడట కదా! నువ్వు కాబట్టి చేస్తున్నావు కాపురం’ అంది.

దానికి సమాధానంగా పార్వతీదేవి, ‘మా ఆయన ఒక్క వేషం వేశాడు కానీ, మీ ఆయన వేష ధారుడట కదా? ఎప్పుడు ఏ వేషంలో ఉంటాడో తెలియదట కదా!’ అంది.

మళ్లీ లక్ష్మీదేవి అందుకుంటూ ‘ఏంటో ఎద్దు మీద వచ్చావు, ఈ కష్టాలు నీకు ఎన్నాళ్లో!’ అంది. దానికి పార్వతీ దేవి, ‘మీ ఆయన వాహనం గద్ద కదా.. గద్ద కన్నా ఎద్దే నయం’ అంది. మళ్లీ లక్ష్మీదేవి, ‘ఏంటో పార్వతీ! ఒంటి మీద ఒక్క ఆభరణం లేదు, నిన్ను చూస్తుంటే జాలేస్తోంది’ అంది. దానికి పార్వతీదేవి, ‘మీరు పాముపై పడుకుంటారట కదా! పాపం దంపతులు కాపురం ఎలా చేస్తున్నారో ఏమో!’ అని సమాధానం ఇచ్చింది. 

లక్ష్మీదేవి, ‘పార్వతీ! మీకు ఒక్క ఇల్లు కూడా లేదు. వల్లకాట్లో ఎలా ఉంటున్నారో ఏమో’ అంది. దానికి పార్వతీ దేవి, ‘మా ఇల్లు శ్మశానంలో ఉన్నా, నలుగురూ కనిపిస్తారు, మాట్లాడతారు. కానీ, మీ ఇల్లు పాల సముద్రంలో కదా. ఏం లాభం?’ అంది. మళ్లీ లక్ష్మీదేవి, ‘మీ ఆయన రోజూ భిక్షం ఎత్తుకుంటాడట కదా? ఈ రోజు ఎక్కడికి వెళ్లాడు?’ అంది. దానికి పార్వతీదేవి, ‘బలి చక్రవర్తి యజ్ఞం చేస్తున్నాడట. అక్కడికి వెళ్లాడు’ అంది. నిజానికి అక్కడకు వెళ్లింది మహావిష్ణువు.

ఇలా ఒకరినొకరు దెప్పుకుంటున్న లక్ష్మీదేవీ, పార్వతీదేవీ, అందరినీ ఆశీర్వదించుదురు గాక! అనేది ఆ పద్యం భావం. ఎంత గొప్ప సందేశం ఈ పద్యంలో ఉంది! 

ఉన్నదాంతో సంతృప్తి చెందాలి. జీవితం భగవంతుడిచ్చిన ప్రసాదం లాంటిది. వంక పెట్టకుండా ప్రసాదాన్ని కళ్లకు అద్దుకుని నోట్లో ఎలా వేసుకుంటారో, అలా జీవితాన్ని కూడా ఆస్వాదించాలి. జీవితంలో సంపద ముఖ్యమా? సౌభాగ్యం ముఖ్యమా? అంటే, సంపద ఏముంది? ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది.. మాకు సౌభాగ్యమే ముఖ్యం అంటారు.. కానీ, లోపల మాత్రం సంపదే కావాలని ఉంటుంది.

సంపద ఈ రోజు ఉంటుంది, రేపు పోతుందంటారు కానీ, అది నిజం కాదు. సంపద ఎక్కడికీ పోదు, మనం పోతాం. మనం పోతాం అని తెలిసినా, సంపద కావాలనే కోరుకుంటాం. పేదరికాన్నీ, ఐశ్వర్యాన్నీ సమానంగా అర్థం చేసుకోవడం కోసం, మంచి కవిత్వం రూపంలో, ఇద్దరు స్త్రీల మధ్య వాదులాట రూపంలో చెప్పారే తప్ప, నిజానికి లక్ష్మీదేవీ, పార్వతీదేవీ అలా వీధుల్లోకి వచ్చి వాదులాడుకోరు. కవిత్వంలో సరదాగా చెప్పారు. మన జీవితంలో ఉండే అసంతృప్తుల్ని పారద్రోలుకోమని చెప్పడమే దీని భావం..

Link: https://www.youtube.com/post/UgyL9_C4GyFusHBp4414AaABCQ

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes