భగవద్గీత ప్రకారం మనస్సును నియంత్రించడం ఎలా? భగవన్నామ స్మరణ..


భగవద్గీత ప్రకారం మనస్సును నియంత్రించడం ఎలా?

సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితమీశ్వరమ్ ।

న హినస్త్యాత్మనాత్మానం తతో యాతి పరాం గతిమ్ ।। 29 ।।

[ భగవద్గీతలో మరణించిన వారి ఆత్మకు గమ్యాన్ని తెలిపే లక్షణాలు! = https://youtu.be/nq9T9mD0Cng ]

మనస్సు అనేది స్వతహాగా ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటుంది. భౌతిక ప్రాపంచిక శక్తి చే తయారు చేయబడినది కావున, సహజంగానే భౌతిక సుఖాల వైపు మొగ్గు చూపుతుంది. మన మనస్సు యొక్క ఆలోచనలను అనుసరిస్తే, మనం ఇంకా ఇంకా భౌతిక ప్రాపంచికత లోతుకు దిగబడతాము. అలా మరింత క్రింది క్రిందికి దిగజారిపోవటాన్ని నిరోధించాలంటే, మనస్సుని బుద్ధి యొక్క సహాయంతో నియంత్రించాలి. దీని కోసం బుద్ధిని, యదార్ధమైన జ్ఞానంచే శక్తివంతం చేయాలి.

ఎవరైతే, భగవంతుడిని పరమాత్మ స్వరూపంలో, సర్వ భూతములలో దర్శిస్తారో, వారు ఈ జ్ఞానమునకు అనుగుణంగా బ్రతుకుతారు. ఇతరులతో తమకున్న సంబంధం నుండి, వ్యక్తిగత లాభమూ మరియు స్వార్థ సుఖానుభవములనూ పొందటానికి ఆశింపరు. వారు చేసిన మంచి చేత వారిపట్ల మమకారం పెంచుకోరు, లేదా వారు చేసిన కీడు వల్ల వారిని ద్వేషింపరు. అంతేకాక, ప్రతివ్యక్తినీ భగవంతుని అంశగా చూస్తూ, అందరి పట్లా చక్కటి ఆదరాన్నీ, సేవా భావమునూ చూపుతారు. సహజంగానే వారు, అందరిలో ఉన్న భగవంతుడిని చూసినప్పుడు, ఇతరులను దుర్భాషలాడటం, మోసం చేయటం, లేదా అవమానించటం వంటి పనులను చేయరు. మానవ జనితములైన వివక్షలు 'జాతీయత, మతము, కులము, లింగ బేధము, హోదా, వర్ణము' వంటివన్నీ అసందర్భమైనవిగా అయిపోతాయి. ఈ విధంగా వారు అందరిలో భగవంతుడిని దర్శించటం ద్వారా, తమ మనస్సులను ఉన్నత స్థాయికి తీసుకు వెళతారు. చిట్టచివరికి, సర్వోత్కృష్ట లక్ష్యమును చేరుకుంటారు.

భగవన్నామ స్మరణ..

ఆపన్నః సంసృతిమ్ ఘోరాం యన్నామ వివసో గృనన్ |

తతసత్యో విముచ్యేత యద్భిబేతిస్వయంభవః ||

భగవంతుని నామం ఎంత గొప్పదంటే "యన్నామ వివసో గృనన్", తెలిసినా తెలియకనున్నా ఒక సారి నోరార కీర్థిస్తే చాలు. ఎక్కడ.. పరమపదంలో కాదు ఇతరత్ర లోకాల్లో కాదు. "ఆపన్నః సంసృతిమ్ ఘోరాం" సంసృతిమ్ అంటే పుట్టుట గిట్టుట ఇది ఒక పెద్ద చక్రం. ప్రతి వస్తువు ఒక రూపాన్ని సంతరించుకుంటుంది, పెరుగుతుంది, క్షీణిస్తుంది, ఇలా నశించి రూపం మారిపోతూ ఉంటుంది. వస్తువులన్నీ కనిపించని దష నుంది కనిపించే దష వరకు వచ్చి రకరకాల మార్పులు చెందుతూ కనిపించని దషలోకే చేరిపోతూ ఉంటాయి. ఇది ఒక చక్రం.

ఈ నాడు ఒక చెట్టును చూస్తున్నాం అంటే అది మొదట గింజ, ఏయే వస్తువులనైతే తనలో చేర్చుకొని ఇంత పెద్ద వృక్షంలా మారిందో తిరిగి అన్నింటిని వాటిల్లో చేర్చి మరో రూపం తీసుకుంటుంది. ఇది ప్రతి వస్తువులో సతతం సాగుతూనే ఉంటుంది. దీనికి సంసృతి చక్రం అని పేరు. ఇందులో పడి తిరుగుతున్న వాళ్ళం మనం. ఇది మొదటి జన్మ కాదు, ఇది వరకు ఎన్ని జన్మలో తెలియదు, కొన్ని కోట్ల యుగాలుగా సాగుతూనే ఉంది. ఎంతకాలం తిరుగుతున్నామో కానీ ఈ నాడు అది గుర్తించే మానవ జన్మలోకి వచ్చాం.

తెలుసుకుంటే మళ్ళీ ఈ చక్రంలో పడాల్సిన అవసరం లేదు. ఇంతవరకు ఎట్లా వచ్చామో మన చేతుల్లో లేదు కానీ ఇక నుండి ఎట్లా ఉండాలో అది మన చేతుల్లో ఉంది. ఇదీ రహస్యం. మరి జరగాల్సింది కూడా నిర్ణయించబడి ఉంటుంది అంటారు, ఇక మనం చేసేదేముంటుంది అంటుంటారు. జరగాల్సిందేదో నిర్ణయించబడే ఉన్నా దాన్ని నీవు మార్చుకోవచ్చు. నది ప్రవాహం ప్రారంభించి ఎక్కడ చేరుతుంది.. "నదీనామ్ సాగరో గతిః" సముద్రాన్ని చేరుతుంది. అయితే మధ్యలో ఉన్న గతిని మనం అనుకూల పరచుకోవడం లేదా. మధ్యలో మనం ఆనకట్ట కట్టి వ్యర్థంగా పోయే నీటి గతిని మార్చి వాడుకుంటుంన్నాం. తిరిగి ఆ నీరు ఎలాగో ఒకలా తిరిగి సముద్రంలోనే చేరుతుంది. మధ్యలో ఎంత లాభం జరుగుతుంది. ఇది నీ చేతుల్లో పనే. అట్లానే మనిషి జీవనం ఎక్కడికి చేరాలో అది తప్పదు, కానీ ఆ చేరే మధ్యలో మనం మార్చుకోవచ్చు. పరమాత్మ దివ్య సన్నిధికి వెళ్ళే అవకాశం ఉంది. ఈ సంసృతి చక్రం నుండి బయట పడేసే శక్తి భగవంతుని నామానికి ఉంది.

ఎట్లా.. భగవంతుని నామం వల్ల "తతసత్యో విముచ్యేత" గతంలో చేసుకున్న పాపాల గుట్టలైతే ఏవి ఉన్నాయో "విముచ్యేత" వదిలేస్తాయి. భగవంతుని నామ స్మరణ అనేది చీకటి గదిలో దీపం పెట్టడం లాంటిది. చీకటి ఎలాగైతే తొలగిపోతుందో, భగవన్నామ స్మరణ అనేది ఎలాంటి కర్మ వాసనలైనా తుడుచుకొని పోతాయి. స్వామి 9వ అధ్యాయంలో చెప్పినట్లుగా "అపిచేత సుదురాచార భజతేవా అనన్యబాత్ సాదురేవ" వాడు చేయకూడనివి ఎన్ని చేసినా ఇక నుండి నన్ను తలిస్తే వాడిని సాదువు అనేట్టు నేను చేసుకుంటా, లోకం వాణ్ణి ఆదరించేట్టు చేస్తా అని స్వామి చేసిన వాగ్దానం..

కృష్ణం వందే జగద్గురుం!

Link: https://www.youtube.com/post/UgzJMxGh8OsihLIjC5B4AaABCQ

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes