'భగవద్గీత' ప్రథమోధ్యాయం - అర్జున విషాదయోగం (3 - 6 శ్లోకాలు)!


'భగవద్గీత' ప్రథమోధ్యాయం - అర్జున విషాదయోగం (3 - 6 శ్లోకాలు)!

భగవద్గీతలో ఉన్న 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 1 నుండి 6 వరకూ ఉన్న అధ్యాయాలను, కర్మషట్కము అంటారు. దీనిలో మొదటి అధ్యాయం, అర్జున విషాద యోగం. ఈ రోజుటి మన వీడియోలో అర్జున విషాద యోగం లోని 3 నుండి 6 శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగం వీడియోగా చూడడానికి = https://youtu.be/QPZD-HR4exs ]

దుర్యోధనుడు, ద్రోణాచార్యుల వారితో ఈ విధంగా సంభాషిస్తున్నాడు..

పశ్యైతాం పాండుపుత్రాణామ్ ఆచార్య మహతీం చమూమ్ ।

వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా ।। 3 ।।

ఆచార్యా, బుద్ధిశాలీ, నీ ప్రియ శిష్యుడైన ద్రుపద పుత్రుడు, వ్యూహంతో పన్నిన పాండవుల మహా సైన్యాన్ని చూడండి..

దుర్యోధనుడు తెలివిగా, తన గురువైన ద్రోణాచార్యుడు గతంలో చేసిన తప్పుని ఎత్తి చూపాడు.

ద్రోణాచార్యుడికి గతంలో, ద్రుపద మహారాజుతో రాజకీయ వైరం ఉండేది. ఆగ్రహంతో ఉన్న ద్రుపదుడు, ఒక యజ్ఞం చేసి, ద్రోణాచార్యుడిని సంహరించగలిగేటటువంటి శక్తి గల పుత్రుడు కలిగేలా వరం పొందాడు. ఆ వర ప్రభావంగా, ద్రుపదునికి పుట్టిన కుమారుడే దృష్టద్యుమ్నుడు. తనను చంపడానికే దృష్టద్యుమ్నుడు జన్మించాడని, ద్రోణాచార్యుడికి తెలిసినా, తన వద్దకు యుద్ధ విద్యనభ్యసించడానికి రాగా, పెద్ద మనస్సుతో, ఒక అత్యున్నత గురువుగా, తనకు తెలిసిన విద్యనంతా బోధించాడు. అయితే, దృష్టద్యుమ్నుడు, పాండవ పక్షాన చేరి, సర్వ సైన్యాధిపతిగా నిలబడి, బలమైన సైనిక వ్యూహాన్ని ఏర్పాటు చేశాడు. గతంలో గురువు గారి కనికరమే, ప్రస్తుత ఇబ్బందికి దారి తీసిందని భావిస్తూ, ఇకనైనా ద్రోణాచార్యుడు పాండవులపై కనికరం చూపించకుండా యుద్ధం చేయాలన్న ఉద్దేశ్యంతో, దుర్యోధనుడు ఈ విధంగా చెప్పాడు.

అత్ర శూరా మహేష్వాసా భీమార్జునసమా యుధి ।

యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః ।। 4 ।।

ధృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ ।

పురుజిత్ కున్తిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః ।। 5 ।।

యుధామన్యుశ్చ విక్రాన్త ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ ।

సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః ।। 6 ।।

వారి పక్షాన సైన్యంలో ఉన్న ఎంతోమంది శక్తివంతమైన యోధులను చూడండి. యుయుధానుడూ, విరాటుడూ మరియు ద్రుపదుడు వంటి వారు, గొప్ప ధనుస్సులను ధరించి ఉన్నారు. వీరు భీమార్జునులతో సమానమైన వారు. అక్కడున్న పరాక్రమవంతులైన ధృష్టకేతుడూ, చేకితానుడూ, వీరుడైన కాశీరాజూ, పురుజిత్తూ, కుంతిభోజుడూ, మరియు శైబ్యుడూ, వీరందరూ ఉత్తమ పురుషులే. వారి సైన్యంలో ఉన్నటువంటి ధైర్యశాలి యుధామన్యుడూ, వీరుడైన ఉత్తమౌజుడూ, సుభద్ర కుమారుడైన అభిమన్యుడూ, ద్రౌపదీ పుత్రులూ, వీరందరూ కూడా మహా వీరులే.

పాండవుల పక్షాన నిలబడిన పెక్కు సైన్యాన్ని చూసి, దుర్యోధనుడు తన ఆందోళనని వ్యక్తం చేశాడు. దాయాది సైన్యంలో ఉన్న, పదివేల సాధారణ యోధుల బలంతో సమానమైన మహారథుల గురించి, ద్రోణాచార్యుడికి వివరించాడు. పాండవుల తరుపున భీమార్జునులతో సమానమైన యోధులూ, యుద్ధంలో గట్టి పోటీ ఇచ్చే వీరులూ ఉన్నారంటూ, రాబోయె పెను విపత్తును అంచనా వేసి చెప్పాడు దుర్యోధనుడు.

మన తదుపరి వీడియోలో, కురు సైన్యంలో ఉన్న వీరుల గురించి, ద్రోణాచార్యునితో దుర్యోధనుడి సంభాషణలో, మరికొన్ని శ్లోకాల గురించి తెలుసుకుందాము.

కృష్ణం వందే జగద్గురం!

Link: https://www.youtube.com/post/UgzGZIwNvaAwJ-2FF2x4AaABCQ

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes