దాంపత్యం - దంపతులు!


దాంపత్యం - దంపతులు!

ఈ లోకంలో కోట్లాది కోట్ల దంపతులున్నా, వాళ్ళంతా ఐదు విధాలు గానే ఉంటారు. వారిని పంచ దంపతులు అని అంటారు.

[ కృష్ణ పరమాత్ముడు చెప్పిన కర్మఫలం ఎలా పనిచేస్తుంది! = https://youtu.be/a0nnypJZfMM ]

మొదటిది లక్ష్మీనారాయణులు..

విష్ణుమూర్తికి లక్ష్మీదేవి వక్ష స్థలం మీద ఉంటుంది. వక్ష స్థలంలోని హృదయం, ఆలోచనలకు కూడలి. అక్కడే లక్ష్మి ఉంటుంది. అంటే, ఏ భార్య భర్తల హృదయం ఒక్కటై, ఆలోచన కూడా ఆ ఇద్దరిదీ ఒకటై ఉంటుందో, ఆ జంట లక్ష్మీనారాయణుల జంట అని అర్ధం.

రెండవది గౌరీశంకరులు..

అర్థనారీశ్వర రూపం.. తల నుంచి కాలి బొటన వ్రేలి వరకు, నిట్టనిలువునా చెరి సగంగా ఉంటారు. రెండూ కలిసిన ఒకే రూపంతో ఉండటం వీరి ప్రత్యేకత. ఆలోచనలకు తల, కార్యనిర్వాహణానికి కాలూ సంకేతం. కాబట్టి, భార్యను గొప్పగా చూసుకునే భర్త, భోళాబాలీగా ఉన్న భర్త ఆపదలో ఉంటే రక్షించే భార్య.. ఇలా ఉన్నవారు గౌరీశంకరుల జంట.

మూడవది బ్రహ్మ సరస్వతుల జంట..

బ్రహ్మ నాలుక మీద సరస్వతి ఉంటుందంటారు. నాలుక అనేది మాటలకు సంకేతం. దాని అర్థం, ఇద్దరి మాటా ఒకటే అవుతుందని. ఇలా ఏ మాట మాట్లాడినా, ఆ భార్య మాటే మాట్లాడే భర్త, ఆ భర్త మాటే మాట్లాడే భార్య.. ఏ జంట ఇలా ఉంటారో, వారు బ్రహ్మసరస్వతుల జంట.

నాల్గవది ఛాయా సూర్యులు..

సూర్యుడు చండ ప్రచండంగా వెలుగు తుంటాడు. అతడి భార్య ఛాయాదేవి, అతని తీక్షణతకు తట్టుకుంటూ సాగుతుంటుంది. తన భర్త లోకోపకారం కోసం పాటుపడేవాడు, విపరీతమైన తీక్షణత కలవాడు. అయినా, తాను నీడలా, పరిస్థితికి అనుగుణంగా సర్ధుకు పోతూ ఉంటుంది ఛాయాదేవి. ఏ ఇంట భర్త కఠినంగా, కోపంగా, పట్టుదలతో ఉంటాడో.. ఏ ఇంటలో అతని భార్య మాత్రం నెమ్మదిగానూ, శాంతంగానూ, అణకువగానూ ఉండి, సంసారాన్ని తీర్చి దిద్దుకునే తత్వంతో ఉంటుందో, అలాంటి జంట ఛాయా సూర్యుల జంట.

ఐదవది రోహిణీ చంద్రులు..

రోహిణీ కార్తిలో రోళ్ళు కూడా పగులు తాయనే సామెత ఉంది. చంద్రుడు పరమ ఆహ్లాదాన్నీ, ఆకర్షణనూ కలుగజేసేవాడు. ఏ జంటలో భర్త మెత్తగా ఉండి, లోకానికంతటికీ ఆకర్షణీయుడై ఉంటాడో, భార్య మాత్రం కఠినాతి కఠినంగానూ,  కోపంతోనూ,  పట్టుదలతోనూ ఉంటుందో, ఆ జంట రోహిణీ చంద్రులు అని అంటారు..

సర్వేజనాః సుఖినోభవంతు!

Link: https://www.youtube.com/post/UgyyIVLins9iGPTwPkV4AaABCQ

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes