అగ్ని! Agni

 

అగ్ని!

'అగ్ని' పంచభూతాలలో ఒకటి. ఉష్ణమోచక రసాయనిక చర్య ద్వారా, ఒక పదార్థం దహనం చెందుతూ, వేడినీ, వెలుతురునీ, అనేక ఉత్పన్నాలనూ ఇచ్చే ఒక ఆక్సీకరణ చర్యని, 'అగ్ని' అంటారు. మంట అనేది 'అగ్ని'లో, కంటికి కనబడే భాగం. అంటే, వెలుగులీనే గాలులే 'మంట'లాగా కంటికి కనిపిస్తాయి. పదార్థ ధర్మాలను బట్టీ, మాలిన్యాల సాంద్రత, తదితర విషయాలను బట్టి, మంటకి రంగు, అగ్నికి తీవ్రత, అని చెప్పవచ్చు.

[ చనిపోయిన వారిని బ్రతికించే దేవాలయం! = https://youtu.be/_23nNvAKCMc ]

మానవ జీవితంలో అగ్ని యొక్క స్థానం, చాలా విశిష్టమైనది. మానవ చరిత్రలో, నిప్పుని కనుగొనడం ఒక మలుపు. ఈ మలుపు, మానవుణ్ణి జంతు సామ్రాజ్యపు రారాజునూజేసింది. ప్రకృతిపై అధిపత్యానికి ప్రయత్నించేలా చేసింది. భారతదేశం, ప్రాచీన గ్రీసు వంటి బహు దేవతారాధక సమాజాలు, 'అగ్ని'ని దైవం అన్నాయి. అతి ప్రాచీనమని చెప్పబడుతున్న ఋగ్వేదం కూడా, 'అగ్ని మీళే పురోహితం' అంటూ ప్రారంభమవుతుంది.

అగ్నిదేవుడు – విష్ణు పురాణ వివరణ..

అగ్నిదేవుని గురించి ఋగ్వేదంలోనూ, అథర్వణ వేదంలోనూ, విరివిగా మంత్రాలు కనబడతాయి. ఈ మంత్రాలను చూసే కాబోలు, పాశ్చాత్యులు ముందు మనను అగ్ని ఆరాధకులు అని అంటారు. అన్ని పురాణాలలోనూ, అగ్నిదేవుని గురించీ, ఆయన ప్రశస్తి గురించీ, తరచూ ప్రస్తావిస్తూ ఉంటారు.

విష్ణుపురాణం అగ్ని దేవుని పుట్టుక గురించీ, ఆయన సంతానం గురించీ వివరంగా చెబుతుంది. భాగవతం కూడా వివరణ ఇస్తుంది. ఇక అగ్ని పురాణం, బ్రహ్మ పురాణం, బ్రహ్మాండ పురాణం, స్కాందం లోనూ, విరివిగా ఆయన ప్రాభవం గురించి వివరణ వుంటుంది. అగ్నిదేవుడు, బ్రహ్మ మానస పుత్రుడు. విరాట్పురుషుని నోటి నుండి ప్రభవించాడు. ఆయనను 'అభిమాని' అని అంటారు. ఈయన సహోదరి మేధాదేవి. ఈయన భార్య స్వాహా దేవి, లక్ష్మీ అంశతో పుట్టింది, దక్ష పుత్రిక. వీరికి ముగ్గురు కొడుకులు – పావకుడు (విద్యుత్ అగ్ని),  పవమానుడు (రాపిడి అగ్ని) , శుచి (సౌర అగ్ని). వీరిలో పావకునికి స్వధా దేవి వలన, కవ్య వాహనుడనే మరొక అగ్ని పుట్టాడు. ఈయన పితృదేవతాగ్ని. స్వధా దేవికి మేనాదేవి, ధరణీ దేవి అని ఇద్దరు కుమార్తెలు. శుచి అనే అగ్ని వలన, హవ్యవాహనుడు జన్మించాడు. ఈయన దేవతాగ్ని.

పవమానునికి సహరక్షకుడు పుత్రుడు. ఈయన రాక్షసాగ్ని. వీరు కాక, మరొక 42 మంది అగ్నులు కలిగారు వీరి ముగ్గురికీ. శుచి మరియు పవమానుని భార్యల గురించి ప్రస్తావన లేదు. వీరు దక్షుని పౌత్రికలను వివాహమాడినట్టు తప్ప, వారి పేర్లు, విశేషాలు వివరించి ఉండలేదు.

ఈ 45 గురు మనవలూ, ముగ్గురు కొడుకులతో, అగ్ని దేవుని కలుపుకుని, మనకు పురాణం, 49 అగ్నులు అని చెబుతుంది. అష్టదిక్పాలకులలో ఆగ్నేయానికి అధిపతి ఈయన.

ఈయన లక్షణాలు..

• రంగు – ఎరుపు

• కళ్ళు- పసుపు పచ్చన

• 7 నాలుకలు – అందుకే ఈయనను సప్త జిహ్వుడు అంటారు

• చతుర్భుజుడు

• వస్త్రం – నలుపు

• వాహనం – హిరణి, 7 యెర్ర గుర్రాలు

పురాణం పది రకాల అగ్నుల గురించి ప్రస్తావిస్తుంది:

1. అగ్ని – నిత్య జీవితంలో మనం చూసేది, తైలాల్లో దాగి ఉన్న అగ్ని..

2. దావాగ్ని – మెరుపులలో దాగి ఉన్న అగ్ని, అరణ్యాలను దహింపగలిగేది..

3. దివ్యాగ్ని – సూర్యునిలో దాగి ఉన్న అగ్ని, దివ్యమైనది, లోకాలను ప్రకాశింపచేసేది..

4. వైశ్వానర – సమస్త ప్రాణులలో దాగి ఉండి, వారు తిన్న అన్నాన్ని అరిగింప చేసేది, ఇదే ప్రాణం నిలబెడుతుంది..

5. బడబాగ్ని – అతి ఘోర రూపం. సముద్రాల క్రింద దాగుకుని ఉన్నది, ప్రపంచాన్ని దహింప చేసేటటువంటిది..

6. బ్రహ్మాగ్ని – అపారమైన అగ్ని, మధనం ద్వారా పుట్టేది..

7. ప్రాజాపత్యాగ్ని – పుత్రపౌత్రులను అనుగ్రహించే అగ్ని. బ్రహ్మచారి తన ఉపనయనం తరువాత ఉంచుకోవలసింది, చివరకు అడవులకు వానప్రస్థానికి వెళ్ళే వరకు ఉండేది..

8. గార్హపత్యాగ్ని – గృహస్థాశ్రమనియమాలలో ఇది ఒకటి. మొదటి అన్న నైవేద్యాన్ని సమర్పించవలసిన అగ్ని..

9. దక్షిణాగ్ని – పితృ దేవతలకు నివేదన చేసే అగ్ని. అభిచార హోమాలకు కూడా వాడతారు..

10. క్రవ్యాదాగ్ని – స్మశానంలో శరీరాన్ని దహించే అగ్ని. ఒక వ్యక్తి తన శరీరాన్ని ఆఖరకు సమర్పించుకునే అగ్ని..

అగ్నిదేవుడు తపస్సుకు వెళ్ళినప్పుడు, సప్తర్షులలో ఒకరైన అంగీరస మహాముని, అగ్ని చేసే విధి ఆయన చేశాడు. ఈయనకు ముగ్గురు భార్యలు – శ్రద్ధ, స్మృతి, శుభ అనేవారు. ఈయనకు ఎందరో పుత్రులు. వారిలో ముఖ్యులు దేవగురువైన బృహస్పతి, ఉతధ్యుడు, సంవర్తనుడు. వీరి కుమార్తెలు కుహు, సినివాలి, రాకా, అనుమతి. అథర్వణవేదంలో, శ్ల్కాలను అంగీరసాలు అని అంటారు. 

కొన్ని శ్లోకాలు అంగీరసుని పేరున ఉంటాయి. పురాణం పూర్తిగా చదవని వారికి, ఈ విషయం పూర్తిగా అర్ధం కాక, అగ్నికి ఇన్ని పేర్లేమిటి , ఇంత మంది పిల్లలేమిటి, ఒక పురాణంలో చెప్పినటు వంటి పిల్లల పేర్లు, మరొక చోటు లేవని సందేహం కలగవచ్చు..

ఈయనకున్న పేర్లు

• జాతవేదసుడు (అన్నీ తెలిసిన, ధరించిన వాడు)

• పావకుడు (పావనం చేసేవాడు)

• జ్వలనుడు (ప్రజ్వలించే తత్వం కల వాడు)

• విభావసు (అమితమైన తేజోవంతుడు)

• చిత్రభాను (చిత్రమైన రంగులు కలవాడు)

• భూరితెజసుడు (మహత్తరమైన తేజం కలిగిన వాడు)

• శిఖిన్ (అగ్ని శిఖలు కలవాడు)

• పింగేషుడు (పసుపు రంగు కలవాడు)

• హిరణ్యకృత్ (పసిడి కారకుడు)

• ప్లవంగ (మిణుకు మిణుకు మంటూ మెరిసే వాడు)

• మాతరిశ్వంతుడు (తల్లి (పుల్లల) లోలోన అభివృద్ధి చెందేవాడు)

• వైశ్వానరుడు (అంతటా ఉండేవాడు)

• ధూమకేతు (పొగతో పాటు ఉండేవాడు)

• తోమరాయుధ (తోమరాన్ని ఆయుధంగా ధరించే వాడు)

• అబ్జహస్తుడు (చేతిలో పద్మం ధరించిన వాడు)

• శుక్ర (తేజోవంతుడు)

• శుచి (శుభ్రంగా ఉన్నవాడు)

• రోహితస్వుడు (యెర్ర గుర్రాల మీద స్వారీ చేసేవాడు)

• చాగర్త (జింక మీద అధిరోహించిన వాడు)

• సప్తజిహ్వ (ఏడు నాలుకలు కలవాడు)

ఇంకా, కొన్ని సందర్భాలలో ప్రస్తావింపబడే అగ్నులు..

ఆత్మలో రగిలే జ్ఞానాగ్ని..

పాదాలలో కాలాగ్ని..

కడుపులో క్షుధాగ్ని..

హృదయంలో శీతాగ్ని..

నేత్రాలలో క్రోధాగ్ని..

Link: https://www.youtube.com/post/Ugyl6f_U4H5zDUxxfOp4AaABCQ

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes