మనం పడుతున్న బాధల నుండి విముక్తి ఎలా పొందాలో చెప్పిన శ్రీ కృష్ణుడు!

 

మనం పడుతున్న బాధల నుండి విముక్తి ఎలా పొందాలో చెప్పిన శ్రీ కృష్ణుడు!

'భగవద్గీత' ద్వితీయోధ్యాయం - సాంఖ్య యోగం (54 - 58 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 1 నుండి 6 వరకూ ఉన్న అధ్యాయాలను, కర్మషట్కము అంటారు. దీనిలో రెండవ అధ్యాయం, సాంఖ్య యోగం. ఈ రోజుటి మన వీడియోలో, సాంఖ్య యోగంలోని 54 నుండి 58 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/lj12JZdP2p4 ]

సమాధి స్థితి పొందిన వాడి గురించి, అర్జునుడు ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు..

అర్జున ఉవాచ ।

స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్థస్య కేశవ ।

స్థితధీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిమ్ ।। 54 ।।

అర్జునుడు ఇలా అంటున్నాడు: ఓ కేశవా, భగవత్ ధ్యాస నందే స్థిరముగా ఉన్న స్థితప్రజ్ఞుని ప్రవృత్తి ఎలా ఉంటుంది? జ్ఞానోదయం అయిన వ్యక్తి ఎలా మాట్లాడతాడు? అతను ఎలా కూర్చుంటాడు? అతను ఎలా నడుచుకుంటాడు?

శ్రీ కృష్ణుడి నుండి నిజమైన యోగ స్థితి గురించి విన్న తరువాత, తనలో కలిగిన సహజ సంశయాన్ని అడుగుతున్నాడు అర్జునుడు. సమాధి స్థితిలో ఉన్న వ్యక్తి యొక్క మానసిక స్వభావం గురించి, తెలుసుకోవాలనుకుంటున్నాడు. అటువంటి వ్యక్తి యొక్క ప్రవర్తనలో, ఈ దివ్యమైన మానసిక స్థితి ఎలా వ్యక్తమవుతుంది? అని శ్రీ కృష్ణుడిని అడుగుతున్నాడు.

శ్రీ భగవానువాచ ।

ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ।

ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే ।। 55 ।।

భగవానుడు ఈ విధంగా చెబుతున్నాడు: ఓ పార్థ, మనస్సుని వేధించే అన్నీ స్వార్ధ ప్రయోజనాలనూ, ఇంద్రియవాంఛలనూ త్యజించి, ఆత్మ జ్ఞానంలో సంతుష్టుడయినప్పుడు, ఆ వ్యక్తిని స్థిత ప్రజ్ఞుడు అంటారు.

ఒక రాయి, భూమ్యాకర్షణ శక్తి చేత క్రిందకు లాగబడినట్లు, ప్రతి 'అంశ' సహజంగానే, తన పూర్ణ భాగం వైపు ఆకర్షింపబడుతుంది. జీవాత్మ అనేది, అపరిమితమైన ఆనంద స్వరూపమైన పరమాత్మ యొక్క అంశ. అంటే, జీవాత్మ అపరిమితమైన ఆనందం యొక్క అంశ కాబట్టి, అది సహజంగానే, ఆనందం కోసం అభిలాషిస్తుంది. అది భగవంతుని నుండి, ఆత్మ యొక్క ఆనందం ఆస్వాదించటానికి కృషి చేసినప్పుడు, దానిని "దివ్య ప్రేమ" అంటారు. కానీ, తన ఆధ్యాత్మిక స్వభావాన్ని మరచి, తనను తాను శరీరమే అనుకుని, జగత్తు నుండి శారీరక ఆనందాన్నిఆస్వాదించటానికి ప్రయత్నించినప్పుడు, దానిని ''కామము'' అంటారు. ఈ ప్రపంచం, 'మృగ తృష్ణ' అని ఆగమ గ్రంధాలలో చెప్పబడింది. అంటే, 'జింకలకు అగుపించే ఎండ మావి' అని అర్థం. ఎడారిలో వేడి ఇసుక మీద సూర్య కిరణాల పరావర్తనం చేత, అక్కడ నీరు ఉన్నదనే భ్రాంతి, మృగమునకు కలుగుతుంది. అది అక్కడ నీరు ఉన్నదనుకుని, దాహం తీర్చుకోవడానికి పరుగుపెడుతుంది. కానీ, అది దగ్గరికి వెళ్ళిన కొద్దీ, ఆ ఎండమావి మాయమైపోతుంటుంది. దాని అల్ప బుద్ధి, తను ఒక భ్రాంతి కోసం పరుగెడుతున్నట్లు, తెలుసోకోలేదు. ఆ దీనమైన జింక, లేని నీటి కోసం వెంటపడుతూ, చివరికి నీరసంతో, ఆ ఎడారి ఇసుకపై మరణిస్తుంది. ఈ విధంగానే, భౌతిక శక్తి అయిన 'మాయ' కూడా, ఆనందం అనే భ్రాంతిని కలుగచేస్తుంది. మనం ఆ మాయా ఆనందం వైపుకు, మన ఇంద్రియ దాహాన్ని తీర్చుకోవటానికి పరుగులు పెడుతున్నాము. కానీ, మనం ఎంత ప్రయత్నించినా, ఆనందం మననుండి దూరమైపోతుంది. మనస్సుని భౌతిక ప్రలోభముల నుండి దూరంగా తిప్పివేయటం తెలుసుకుని, ఇంద్రియ వాంఛలను త్యజించిన వ్యక్తి, తన ఆత్మ యొక్క అంతర్గత ఆనందాన్ని అనుభవిస్తూ, స్థిత ప్రజ్ఞుడవుతాడు. హృదయం నుండి అన్ని స్వార్ధ కోరికలూ తొలగించిన పిదప, భౌతిక సంకెళ్ళు వేయబడ్డ జీవాత్మ, జనన మరణ చక్రం నుండి విముక్తి పొందుతుంది. సద్గుణములలో, దేవుని వలె అవుతుంది. ‘స్థిత-ప్రజ్ఞుడు అంటే, అన్ని స్వార్ధ కోరికలనూ, ఇంద్రియ లౌల్యములనూ త్యజించి, ఆత్మ యందే సంతుష్టి నొందినవాడు’ అని శ్రీ కృష్ణుడు, పై శ్లోకంలో వ్యక్తీకరించాడు.

దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః ।

వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే ।। 56 ।।

దుఃఖముల నడుమ కూడా కలతచెందని వాడూ, సుఖముల కోసం ప్రాకులాడని వాడూ, మమకారమూ, భయమూ, క్రోధమూ విడిచిన వాడిని, స్థిత-ప్రజ్ఞుడైన ముని అని అంటారు.

జ్ఞానోదయమైన వ్యక్తి, తన మనస్సులోనికి ప్రాపంచిక బలహీనతలైన, కామం, క్రోధం, లోభం, ఈర్ష వంటి వాటిని రానివ్వడు. అప్పుడే, మనస్సు భగవంతుని ధ్యాసలో స్థిరంగా ఉండగలదు. మనస్సుని దుఃఖాల గురించి చింతించటానికి అనుమతిస్తే, భగవత్ ధ్యాస ఆగిపోయి, ఆధ్యాత్మిక స్థాయి నుండి క్రిందికి లాగి వేయబడుతుంది. ప్రస్తుత బాధ కన్నా, పాత హింసల బాధ జ్ఞాపకాలూ, ఇకముందు పెట్టే బాధల భయం ఎక్కువగా ఉంటుంది. కానీ, మనస్సు ఎప్పుడైతే ఈ రెంటినీ వదిలి వేసి, ప్రస్తుత వేదనని తట్టుకోవటానికి ప్రయత్నిస్తుందో, బాధ తగ్గిపోయి, మనం సహించగలిగే స్థాయిలోనే ఉంటుంది. చరిత్రలో, బౌద్ధ సన్యాసులు, ఇటువంటి పద్ధతుల ద్వారానే, దండయాత్రకొచ్చిన శత్రువుల చిత్రహింసలను తట్టుకునేవారు. ఈ విధంగానే, బాహ్య విలాసాల కోసం మనస్సు పరితపించినప్పుడు, అది ఆయా భోగ వస్తువుల కోసం పరుగులు పెడుతుంది. దాంతో, మనస్సు భగవత్ ధ్యాస నుండి మరలి పోతుంది. కాబట్టి, సుఖాల కోసం వెంపర్లాడకుండా, దుఃఖాల వల్ల చింతించకుండా, మనస్సుని కట్టడి చేసినవాడు, స్థిత ప్రజ్ఞుడైన ముని. ఇంకా, అటువంటి యోగి, భయము, కోపము వంటి వాటికి, తన మనస్సు వశం అయిపోకుండా చూసుకుంటాడు.

యః సర్వత్రానభిస్నేహః తత్తత్ ప్రాప్య శుభాశుభమ్ ।

నాభినందంతి న ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా ।। 57 ।।

ఎవరైతే అన్ని పరిస్థితులలో మమకారం, ఆసక్తి లేకుండా ఉంటాడో, సౌభాగ్యానికి హర్షమునొందకుండా, మరియు కష్టాలకు క్రుంగిపోకుండా ఉంటాడో, అతను పరిపూర్ణ జ్ఞానంతో ఉన్న ముని.

ప్రాపంచిక విషయాసక్తుల పట్ల ఆసక్తి లేనివాడు, శుభం కానీ, అశుభం కానీ ప్రాప్తించినప్పుడు ఆనందించడు, క్రుంగిపోడు.  సముద్రం ఆటుపోట్లతో కూడిన కెరటాలతో భయంకరంగా కనిపిస్తున్నా, దాని అడుగుభాగాన నీటి కదలికలు  లేకుండా, ప్రశాంతంగా ఉంటుంది. ఆ విధంగానే, ఆధ్యాత్మిక చింతనతో ఉన్న వ్యక్తీ, స్థిత-ప్రజ్ఞుడైన వ్యక్తీ, తన జీవితంలో ఎన్ని కష్టాలూ, సుఖాలూ కలిగినా, వాటిని సమాంతరంగా తీసుకుంటూ, పరిపూర్ణ జ్ఞానంతో, వాటిని స్వాగతిస్తాడు.

యదా సంహరతే చాయం కూర్మోంఽగానీవ సర్వశః ।

ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా ।। 58 ।।

తాబేలు తన పై చిప్ప లోనికి, దాని అంగములను లాగుకున్నట్టుగా, ఇంద్రియములను వాటి విషయార్ధముల నుండి వెనుకకు మరల్చగలిగిన వాడు, దివ్యమైన ఆధ్యాత్మిక జ్ఞానంలో, స్థిరచిత్తుడగును.

ఇంద్రియములు కోరుకునే భోగ వస్తు, విషయములనిచ్చి, ఇంద్రియముల ఆర్తిని తీర్చటానికి ప్రయత్నించటం అనేది, నేతిని పోసి మంటను ఆర్పటానికి ప్రయత్నించటమే. క్షణకాలం, నిప్పు కొద్దిగా తగ్గినట్లనిపించినా, రెండింతల ఉధృతితో, అది మళ్ళీ పైకి లేస్తుంది. కాబట్టి, కోరికలనేవి తీర్చబడినప్పుడు, సమసిపోవు. మరింత ప్రబలంగా తిరిగొస్తాయి. మనస్సూ మరియూ ఇంద్రియములూ, ఆనందం కోసం, అనేకానేక వాంఛలను కోరుకుంటాయి. మనం వాటిని నెరవేర్చుతూ ఉన్నంతవరకూ, నిజమైన ఆనందం, ఎండమావిలా, ఒక భ్రమలా ఉండిపోతుంది. కానీ, మనం ఆ కోరికలన్నింటినీ త్యజించటం నేర్చుకుని, భగవంతుని యందే ఆనందాన్ని వెతుక్కుంటే, మనస్సూ, ఇంద్రియములూ, మనలో ప్రశాంతంగా ఉంటాయి. కాబట్టి, జ్ఞాని అయినవాడు, వివేకముతో, మనస్సునూ, ఇంద్రియములనూ జయిస్తాడు. ఈ శ్లోకంలో తాబేలును ఉదాహరణగా చెప్పాడు, శ్రీ కృష్ణుడు. ప్రమాదం ఎదురైనప్పుడల్లా, తాబేలు తన అంగములనూ, తలనూ లోపలికి తీసుకుని, తనను తాను సంరక్షించుకుంటుంది. ఆ ప్రమాదం తొలగిపోయిన తరువాత, తన అంగములనూ, తలనూ బయటకు తీసి, ముందుకు సాగిపోతుంది. జ్ఞానోదయమైనవాడు, మనస్సూ, ఇంద్రియములపై ఇదే విధమైన నియంత్రణ కలిగి, పరిస్థితులకు తగినట్టుగా వాటిని వాడటం, లేదా ఉపసంహరించటం చేస్తాడు.

ఇక మన తదుపరి వీడియోలో, ఇంద్రియాలను ఏ విధంగా వశపరుచుకోవాలో, శ్రీ కృష్ణుడు చెప్పిన వివరణను తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

Link: https://www.youtube.com/post/UgxbQiOmMSIWcnBmGjV4AaABCQ

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes