మహాభారతంలో ద్రౌపది కొడుకుల హత్య వెనుక విశ్వామిత్రుడి శాప రహస్యం! Death Mystery of Upapandavas

 

ఉప పాండవుల జనన మరణాలు - మహాభారతంలో ద్రౌపది కొడుకుల హత్య వెనుక విశ్వామిత్రుడి శాప రహస్యం!

వ్యాసమహర్షి శిష్యుడైన జైమినీ మహర్షి, భారతంలో దాగిన సంఘటనల అంతరార్ధాల కోసం, వింధ్య పర్వత గుహల్లో నివసించే పక్షల దగ్గరకు వెళ్లి, వాటిని కొన్ని ప్రశ్నలడిగాడు. వాటిల్లోని ఒక ప్రశ్న, "ద్రౌపది అయిదుగురికి భార్య అయిన కారణం" అనేదానికి సమాధానం, మన గత వీడియోలో తెలుసుకున్నాము. ఇక జైమినీ మహర్షి మరో ప్రశ్న, "ఉప పాండవుల జనన మరణాలు".

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/Yzs7_uZcMrg ​]

ఉపపాండవులైన ద్రౌపది కుమారులు అవివాహితులుగా, అనాథలుగా ఎందుకు చంపబడ్డారు? ఇచ్చిన మాట కోసం, రాజ్యాన్నీ, సకలాన్నీ కోల్పోయిన సత్య హరిశ్చంద్రుడి కథకీ, కోపిష్టిగా పేరోందిన విశ్వామిత్రుడి శాపానికీ, భారతంలోని ద్రౌపది కుమారుల మరణానికీ ఉన్న సంబంధమేంటో, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

పూర్వం త్రేతాయుగంలో, హరిశ్చంద్రుడనే రాజుండేవాడు. ఆయన ఎంతో ధర్మబద్ధంగా పరిపాలిస్తూ, ఉత్తమరాజుగా కీర్తి గడించాడు. ఆయన పాలనాకాలంలో, ప్రజలకి దుర్భిక్షం, వ్యాధులూ, అకాలమరణాలూ వంటి ఎటువంటి అనర్ధాలూ కలుగలేదు. ఒకనాడు ఆ మహారాజు వేట కోసం అడవికి వెళ్ళాడు. అక్కడాయనకి "రక్షించండి - రక్షించండి" అన్న స్త్రీల ఆర్తనాదాలు వినిపించాయి. ఆ శబ్దాలు విన్న హరిశ్చంద్రుడు, ‘భయపడకండి. నేను వస్తున్నాను’ అని అంటూ, స్త్రీల ఆర్తనాదాలు వినిపించిన వైపుగా వెళ్లాడు. అయితే, ఆ ప్రాంతంలో మునిశ్రేష్ఠుడైన విశ్వామిత్ర మహర్షి, కఠోరదీక్షతో తపస్సు చేస్తున్నాడు. భవాది దివ్యవిద్యల గురించి, ఆయన సాధన చేస్తుండగా, ఆ విద్యాదేవతలైన స్త్రీలు భయంతో ఏడుస్తున్నారు. ఎందుకంటే, విశ్వామిత్ర మహర్షి ఎంతో తేజస్సు కలవాడు. వారు బలహీనమైన వారు కనుక, ఆయన ఆధీనంలోకి వెళితే, ఆయన శక్తికి సరితూగలేమని భావించి, చింతుస్తున్నారు.

వారి ఆర్తనాదాలే, హరిశ్చంద్రుడికి వినబడడంతో, అటుగా బయలుదేరాడు. ఇదంతా గమనిస్తున్న విఘ్నేశ్వరుడు, వారి బాధలు తీర్చడం కోసం, అటుగా వచ్చిన హరిశ్చంద్రుడి శరీరంలోనికి ప్రవేశించి, ఏం జరగబోతుందో అని చూస్తున్నాడు. గణేశుడి ప్రవేశంతో, అమోఘమైన రాజసం హరిశ్చంద్రుడి వశమైంది. స్త్రీలను రక్షించడానికి వచ్చిన రాజు, "ఎవడు ఇక్కడి స్త్రీలకు వేదన కలిగిస్తున్నాడు. నా అమ్ములపొదిలో నుండి వచ్చిన బాణాల ధాటికి, అన్నిభాగాలు ఛేదించబడి, శాశ్వత నిద్రపోగలడు" అని రౌద్రంతో అరిచాడు. ఆ మాటలకు తపోభంగమైన విశ్వామిత్రుడికి, తీవ్రమైన ఆగ్రహం కలిగింది. దాంతో, ఆయన సంపాదించుకున్న విద్యలన్నీ నశించిపోయాయి. హరిశ్చంద్రుడిని చూసి, ఆగ్రహవేశాలతో, " ఓరీ దురాత్మా! ఆగు!" అని గట్టిగా గద్దించాడు.

అప్పుడు హరిశ్చంద్రుడు వినయంగా, "స్వామీ! తమరు నాపై ఆగ్రహించకండి. నా తప్పేమీ లేదు. ధర్మజ్ఞులైన రాజుల ధర్మశాస్త్రంలో చెప్పినట్టగా, ఒక రాజు దానం, రక్షణ, ధనస్సు ధరించి యుద్ధం చేయడం వంటి కార్యాలను నిర్వర్తించాలి. నేను ఆర్తుల అరుపులు విని ఇక్కడకు వచ్చాను" అన్నాడు. అతని మాటలు విన్న విశ్వామిత్రుడు, "రాజా! నీకు నిజంగా అధర్మం అంటే భయం వుంటే, దానం ఎవరికి చేయాలి? రక్షణ ఎవరికి ఇవ్వాలి? యుద్ధం ఎవరితో చేయాలి? ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పు" అని అడిగాడు. దానికి సమాధానంగా హరిశ్చంద్రుడు, "ఓ మహర్షీ, బ్రాహ్మణుల్లో గొప్పవారికీ, జీవనాధారం లేనివారికీ దానం చేయాలి. భయంతో శరణు కోరినవారిని రక్షించాలి. శత్రువులతో యుద్ధం చేయాలి" అని బదులిచ్చాడు.

అదివిన్న విశ్వామిత్రుడు, "ఓ రాజా! నీవు నిజంగా ధర్మాచరణ చేసేవాడివే అయితే, నేను బ్రాహ్మణుడిని, నేను కోరినంత ధనాన్ని దక్షిణగా నాకివ్వు" అని అడిగాడు. "మహానుభావా! తమరు నన్ను దక్షిణ అడిగారు. చాలా సంతోషం. మీకు ఏదికావాలో అడగండి. ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను" అని హరిశ్చంద్రుడు చెప్పాడు. అప్పుడు విశ్వామిత్రుడు, "ప్రస్తుతం నేను రాజసూయ యాగం చేస్తున్నాను. దానికి తగిన దక్షిణ ఇవ్వు" అని అడిగాడు. దానికి ఎంత దక్షిణ కావాలో, హరిశ్చంద్రుడు కోరుకోమనగా, "రాజా, ఈ సమస్త నగర, పట్టణ, గ్రామాలతో, సాగరంతో కూడిన భూమండలాన్నీ, సకల సైన్యసమేతంగా ఉన్న రాజ్యాన్నీ, దానితో పాటు, నీ కోశాగారిన్నీ, సమస్త సంపదలనీ.. కేవలం, నీవు, నీ భార్యా, సుతులూ తప్ప, తక్కినవన్నీ దక్షిణగా ఇవ్వు" అని కోరాడు.

అంతా విన్న హరిశ్చంద్రుడు శాంతంగా, "మహర్షీ, మీరు కోరినవన్నీ ఇస్తున్నాను. స్వీకరించండి" అని అన్నాడు. విశ్వామిత్రుడు వాటినన్నింటినీ గ్రహించి, "రాజా! నీ సర్వస్వం నాకు సమర్పించావు. ఇక నీ రాజ్యం, నారాజ్యం కాబట్టి, నీవు నీ భార్య, పిల్లలతో నగరాన్ని విడిచివెళ్ళు" అని అజ్ఞాపించాడు. అందుకు సరేనని హరిశ్చంద్రుడు, తన భార్యనూ, కొడుకూనూ తీసుకుని బయలుదేర బోతుండగా, విశ్వామిత్రుడు ఆయనను ఆపి, "రాజసూయ యాగ దక్షిణకి, నీవిచ్చినవి సరిపోవు. పూర్తిగా ఇవ్వకుండా ఎక్కడికి పోతావు?" అని ప్రశ్నించాడు. అందుకు హరిశ్చంద్రుడు, "మహర్షీ, ఇప్పుడు నా దగ్గర, నేను, నా భార్య, నా కుమారుడు, ఈ మూడు ప్రాణాలే ఉన్నాయి. ఉన్నదంతా మీకే ఇచ్చాను. నా దగ్గర ఏమీ లేదు" అనగా, "ఆడినమాట తప్పకు. నీవు ఎలాగైనా నా దక్షిణ నాకు చెల్లించి, నీ ధర్మనిరతిని నిరూపించుకో, లేదా, అసత్య వాడివని ఒప్పుకో" అని మహర్షి హెచ్చరించాడు.

"స్వామీ, నాపై దయ ఉంచి, ఒక్క నెలరోజులు నాకు గడువివ్వండి. మీ దక్షిణ పూర్తిగా చెల్లిస్తాను" అని హరిశ్చంద్రుడు మాటయిచ్చాడు. దాంతో సరే అని, నగరం వదిలి వెళ్ళడానికి అనుమతినిచ్చాడు. హరిశ్చంద్రుడు తన భార్యనీ, కుమారుణ్ణి వెంటబెట్టుకుని, నగరం విడిచి బయలుదేరాడు. దారిలో నగర ప్రజలంతా, ఆయన దు:స్థితిని చూసి ఎంతగానో విలపించారు. ఆయన ధర్మనిరతికీ, సత్యవాక్పరిపాలనకీ జేజేలు పలికారు. అందరూ ఆయనతో వస్తామన్నారు. ప్రజలకి తనపై ఉన్న అభిమానం చూసి, హరిశ్చంద్రుడికి ఎంతో దు:ఖం కలిగింది. అంతలో విశ్వామిత్రుడు అక్కడకు వచ్చి, "ధూర్తుడా ఇంకా ఇక్కడే ఉన్నావే, వెళ్ళు వెళ్ళు" అని గద్దించగా, "ఆగ్రహించకండి స్వామీ వెళుతున్నాను" అని బదులిచ్చి బయలుదేరాడు. అలసిపోయి, నడవలేని స్థితిలో ఉన్న భార్య శైబ్యాదేవిని తీసుకుని, వేగంగా నడవసాగాడు హరిశ్చంద్రుడు. శైబ్యాదేవి ఆయనతో సమానంగా నడవలేకపోయింది.

అలా వాళ్లు వేగంగా వెళ్తునప్పటికీ, విశ్వామిత్రుడు వారిని తొందర చేస్తూ, తన చేతిలోని కర్రతో, శైబ్యాదేవి తలమీద కొట్టాడు. విశ్వామిత్రుడు అంత ఘోరమైన పని చేసినప్పటికీ, హరిశ్చంద్రుడు ఏ మాత్రం ఆవేశపడకుండా, "వెళ్తున్నాను స్వామీ, ఆగ్రహించకండి" అని తప్ప, మరేదీ మాట్లడలేదు. హరిశ్చంద్రుడికి కలిగిన ఈ దు:స్థితిని చూసి, విశ్వాది దేవతలయిదుగురూ, ఎంతో బాధపడ్డారు. వారు విశ్వామిత్రుడి గురించి, "ఈ కౌశికుడు ఎంత నిర్దయుడు. మహాఘోరమైన పాపం చేస్తున్నాడు. ఇతడెలాంటి నరకానికి పోతాడో కదా! మా అందరికీ నిత్యం యజ్ఞయాగాదులు చేసి హవిస్సులు సమర్పిస్తున్న ఈ హరిశ్చంద్ర మహారాజుని, రాజ్యభ్రష్టుణ్ణి చేసిన ఈ విశ్వామిత్రుడు, తప్పకుండా నరకానికి వెళతాడు" అని అనుకున్నారు. ఆ విశ్వేదేవతల మాటలు విన్న విశ్వామిత్రుడికి, వారిమీద తీవ్రమైన కోపం వచ్చింది. వెంటనే "విశ్వేదేవతలారా, నన్ను నిందించిన మీరు మానవజన్మల్ని పొందుదురు గాక!" అని శపించాడు.

వెంటనే విశ్వేదేవతలు ఆయన కాళ్ల మీదపడి, "స్వామీ మా తప్పు మన్నించండి" అని వేడుకోగా, విశ్వామిత్రుడు కరుణించి, "మీరు మానవజన్మ పొందినప్పటికీ, బ్రహ్మచారులుగా ఉంటారు. కామక్రోధాలు విడిచి, తిరిగి దేవతలుగా మారతారు." అని శాపవిమోచనం అనుగ్రహించాడు. అలా విశ్వామిత్రుడి చేత శపించబడ్డ విశ్వే దేవతలయిదుగురూ, ద్రౌపది గర్భాన ఉపపాండవులుగా జన్మించారు. పూర్వం మహర్షి ఇచ్చిన శాపకారణంగానే, వారు అవివాహితులుగా మిగిలిపోయారు. మహాభారత యుద్ధంలో, అందరూ ఒకేసారి చంపబడి, తిరిగి దేవతలుగా మారిపోయారు.

మరి ధర్మ నిరతుడైన హరిశ్చంద్రుడిని, విశ్వామిత్రుడు ఎందుకు హింసించాడు? భోగభాగ్యాలపై మోహం వదిలి మహర్షిగా మారిన విశ్వామిత్రుడు, హరిశ్చంద్రుడిని ఎందుకు రాజ్యభ్రష్టుణ్ణి చేశాడు? హరిశ్చంద్రుడు రాజ్యం వదిలి వెళ్లిన తరువాత ఏం జరిగింది? విశ్వామిత్రుడిని, వశిష్ఠ మహర్షి ఎందుకు శపించాడు? వీరి మధ్య ఎందుకు యుద్ధం జరిగింది - అనేటటువంటి ఆసక్తికర పురాణ విషయాలను, మన తదుపరి వీడియోలో తెలుసుకుందాము..

ధర్మో రక్షతి రక్షితః

Link: https://www.youtube.com/post/UgymPpT35zayqOND60J4AaABCQ

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes