జననమరణ చక్రంలో బంధించే కర్మ ఫలములపై మమకారాసక్తులను త్యజించాలి! Bhagavad Gita


జననమరణ చక్రంలో బంధించే కర్మ ఫలములపై మమకారాసక్తులను త్యజించాలి!

234 – 'భగవద్గీత' ద్వితీయోధ్యాయం - సాంఖ్య యోగం (49 - 53 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 1 నుండి 6 వరకూ ఉన్న అధ్యాయాలను, కర్మషట్కము అంటారు. దీనిలో రెండవ అధ్యాయం, సాంఖ్య యోగం. ఈ రోజుటి మన వీడియోలో, సాంఖ్య యోగంలోని 49 నుండి 53 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/gvT9wQ8xW3o ]

సమత్వ యోగం గురించి, శ్రీ కృష్ణుడు ఈ విధంగా ఉపదేశిస్తున్నాడు..

దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాద్ధనంజయ ।

బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణాః ఫలహేతవః ।। 49 ।।

సమత్వ బుద్ధితో చేసిన కర్మ కంటే, ఫలాపేక్షతో చేసిన కర్మ నికృష్టమైనది. ఫలాపేక్షగలవారు హీనులు.. కనుక సమత్వబుద్ధిని ఆశ్రయించు.

మనం చేసే పనిలో, రెండు దృష్టికోణాలుంటాయి.. 1) మనం బాహ్యంగా చేసే క్రియ 2) దాని పట్ల, మనలో అంతర్గతంగా ఉన్న దృక్పథం. ఇక్కడ అర్జునుడికి, ఉత్తమమైన ఆంతరంగిక దృక్పథం పెంచుకోమని, శ్రీ కృష్ణుడు ఉపదేశిస్తున్నాడు. స్వీయ భోగం కోసం పనులు చేసేవారు, పిసినారులు. ఫలములపై ఆశ త్యజించి, తమ పనులన్నీ భగవదర్పితం చేసినవారు, ఉత్తములూ, నిజమైన జ్ఞానం కలిగినవారు. ఒక వ్యక్తి విజ్ఞానం, పై స్థాయికి వెళ్ళే కొద్దీ, సహజంగానే, కర్మ ఫలాలని అనుభవించాలనే కోరిక విడిచిపెట్టి, సేవా దృక్పథం వైపు వెళతాడు. మనం చేసే పనులు, భగవంతుని ప్రీతి కోసం, వాటి ఫలాలను భగవదర్పితం చేయటం నేర్చుకున్నట్లయితే, ఆ సేవా దృక్పథం, లోప రహితమవుతుంది.

బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృతదుష్కృతే ।

తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలమ్ ।। 50 ।।

సమత్వబుద్ధి కలిగినవాడు, పుణ్యపాపకర్మలను రెండింటినీ వదులుతాడు. కనుక, యోగం కొరకు యత్నించు. యోగమంటే, నేర్పుగా కర్మలు చేయడం.

సమత్వ బుద్ధి కలిగినవాడు, సత్త్వ శుద్ధి వలన కలిగే జ్ఞానం చేత, పుణ్యపాపకర్మలను రెంటినీ వదలివేసి, ఈ లోకంలోనే, కర్మబంధం నుండి ముక్తుడవుతాడు. కనుక, యోగప్రాప్తికై యత్నించాలి. యోగమంటే, కర్మలు చేయడంలో నేర్పు. స్వధర్మరూపమైన కర్మలు చేసేవానికి, ఆ కర్మలు ఈశ్వరార్పితంగా చేస్తున్నందువల్ల, జయాపజయాలందు, సమత్వబుద్ధి కలుగుతుంది. అదే, నేర్పు.. బంధం, కర్మలకు స్వభావం. అయినప్పటికీ, సమత్వబుద్ధితో చేసినప్పుడు, కర్మలు వాటి స్వభావం వదలుకుంటాయి. ఆ విధంగా, కర్మలు బంధించకుండా ఉండేటట్లు, వాటిని ఆచరించగలగడమే, కర్మలయందు నేర్పు.

కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్వక్త్వా మనీషిణః ।

జన్మబంధవినిర్ముక్తాః పదం గచ్ఛంత్యనామయమ్ ।। 51 ।।

జ్ఞానులు, సమత్వ బుద్ధిని కలిగి ఉండి, జననమరణ చక్రంలో బంధించే కర్మ ఫలములపై మమకారాసక్తులను త్యజించి ఉంటారు. ఇలాంటి భావనతో పని చేయటం వలన, దుఃఖరహితమైన స్థితిని పొందుతారు.

ఫలాసక్తి లేకుండా, కర్మలను ఆచరించమనీ, అది వ్యక్తిని, బాధా రహిత స్థితికి చేరుస్తుందనీ, శ్రీ కృష్ణుడు మరింత విశదపరుస్తున్నాడు. జీవితంలో వైరుద్ధ్యము ఎలా ఉంటుందంటే, మనము సంతోషం కోసం ప్రయత్నిస్తాము కానీ, దుఃఖమే అందుతుంది.. ప్రేమ కోసం తపిస్తాము కానీ, నిరాశే ఎదురవుతుంది.. జీవించాలని కోరుకుంటాము కానీ, మరణం వైపుగా ప్రతిక్షణం అడుగులేస్తుంటాము. ప్రతి వ్యక్తీ, ఆనందం కోసం కామ్య కర్మలను చేస్తూనే ఉంటాడు కానీ, తృప్తి లభించదు. అవి మరింత దుఃఖములు కలుగజేస్తాయి. ఈ కారణంగా, ప్రతి ఒక్కరూ, ఈ లోకంలో దుఃఖితులై ఉన్నారు. కొంతమంది తమ శారీరిక, మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. మరికొందరు, తమ స్వజనులూ, బంధువులచే బాధింపబడుతున్నారు. ఇంకొందరు, నిత్యావసరాల కోసం, దరిద్రంతో బాధ పడుతున్నారు. ప్రాపంచిక మనస్తత్వం ఉన్నవారికి, తాము సంతోషంగా లేము అని తెలుసు.. కానీ, తమ కన్నా ఎక్కువ ఉన్నవారు సంతోషంగా ఉన్నారనుకుని, భౌతిక ప్రగతి కోసం, ఇంకా పరుగులు తీస్తున్నారు. సమత్వబుద్ధి గలవారు ఫలాన్ని వదలివేసి, జ్ఞానులై, జీవించి ఉండగానే, జన్మబంధం నుండి విముక్తులై, దు:ఖరహితమైన మోక్షాన్ని చేరుకుంటారు.

యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి ।

తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ ।। 52 ।।

మోహమనే ఊబి నుండి నీ బుద్ధి బయటపడినప్పుడే, నీవు ఇప్పటి వరకూ విన్న దాని గురించీ, ఇక వినదగిన దాని గురించీ, వైరాగ్యం కలుగుతుంది.

ఎవరి బుద్ధి అయితే ఆధ్యాత్మిక జ్ఞానంతో ప్రకాశిస్తుందో, వారు, భౌతిక, ఇంద్రియ సుఖాలు దుఃఖ హేతువులే అని తెలుసుకుని, వాటిని వాంఛించరు. అలాంటి వారికి, వైదిక కర్మ కాండల పట్ల ఆసక్తి పోతుంది. కామ్య కర్మల ద్వారా పొందిన ఇహ పర లోక భోగములు అనిత్యమైనవీ, మరియు దుఃఖముతో కూడుకున్నవి, అని అర్థం చేసుకుని, జ్ఞాన-సంపన్నులైన మునులు, వైదిక కర్మలకు అతీతంగా ఉంటారు.

శృతివిప్రతి పన్నా తే యదా స్థాస్యతి నిశ్చలా ।

సమాధావచలా బుద్ధిస్తదా యోగామవాప్స్యసి ।। 53 ।।

కామ్య కర్మ కాండలను చెప్పే వేద విభాగాల వైపు ఆకర్షితం కాకుండా, నీ బుద్ధి ఎప్పుడైతే భగవంతుని యందే నిశ్చలంగా ఉంటుందో, అప్పుడు సంపూర్ణమైన యోగ స్థితిని పొందుతావు.

సాధకులు, ఆధ్యాత్మిక పథంలో పురోగమించేటప్పుడు, భగవంతునితో సంబంధం బలపడుతూ ఉంటుంది. ఆ సమయంలో, తాము పూర్వం చేసే వైదిక కర్మలు ప్రతిబంధకంగా, సమయం తీసుకునేవిగా అనిపిస్తాయి. తమ భక్తితో పాటుగా, ఇంకా పూజలూ మొదలగునవి చేయాలా? అని అనుకుంటారు. అలాగే, పూజాది కార్యాలను వదిలి, పూర్తిగా సాధనలో నిమగ్నమైతే, ఏదైనా తప్పు చేసినట్టవుతుందా? అని సంశయ పడతారు. కోరికలను తీర్చే వేద విభాగాల వైపు ఆకర్షితం కాకుండా, సాధన లోనే నిమగ్నమవడం తప్పు కాదనీ, పైగా, అది ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితి అనీ, శ్రీ కృష్ణుడు అంటున్నాడు. ఈ శ్లోకంలో, 'సమాధౌ-అచలా' అన్న పదాన్ని, భగవంతుని ధ్యాస లో ఉండే ‘ధృఢ సంకల్పాన్ని’ సూచించటానికి, శ్రీ కృష్ణుడు ఉపయోగించాడు. 'సమాధి' అన్న పదం, 'సమ్' అంటే సమత్వము, మరియు 'ధి' అంటే బుద్ధి అన్న మూలధాతువుల నుండి ఏర్పడింది. అంటే, 'పరిపూర్ణ సమత్వ బుద్ధి స్థితి'. ఉన్నతమైన చైతన్యంలో స్థిర బుద్ధి కలిగి, ప్రాపంచిక, భౌతిక ప్రలోభాల పట్ల మోహితుడు కానివాడు, ఆ యొక్క 'సమాధి', అంటే, సంపూర్ణ యోగ స్థితిని పొందుతాడు.

మన తదుపరి వీడియోలో, సమాధి స్థితిని పొందినవాడి గురించి, అర్జునుడు శ్రీ కృష్ణుడిని ఏమని ప్రశ్నించాడో,  తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

Link: https://www.youtube.com/post/UgzUPCWdnbzWWzVKTj54AaABCQ

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes