స్మృతిభ్రమ కలిగినప్పుడు బుద్ధి నశించి మనిషి పతనమౌతాడు! – శ్రీ కృష్ణుడు Bhagavad Gita

 

స్మృతిభ్రమ కలిగినప్పుడు బుద్ధి నశించి మనిషి పతనమౌతాడు! – శ్రీ కృష్ణుడు

'భగవద్గీత' ద్వితీయోధ్యాయం - సాంఖ్య యోగం (59 - 63 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 1 నుండి 6 వరకూ ఉన్న అధ్యాయాలను, కర్మషట్కము అంటారు. దీనిలో రెండవ అధ్యాయం, సాంఖ్య యోగం. ఈ రోజుటి మన వీడియోలో, సాంఖ్య యోగంలోని 54 నుండి 63 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/oTdecbwzN4U ]

ఇంద్రియాలను ఏ విధంగా వశపరుచుకోవాలో, శ్రీ కృష్ణుడు ఇలా వివరిస్తున్నాడు..

విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః ।
రసవర్జం రసోఽప్యస్య పరం దృష్ట్వా నివర్తతే ।। 59 ।।

సాధకులు ఇంద్రియములను భోగ విషయముల నుండి నియంత్రించినా, ఇంద్రియ విషయముల మీద రుచి ఉండిపోతుంది. కానీ, భగవత్ తత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడు, ఆ రుచి కూడా అంతమవుతుంది.

ఉపవాస సమయంలో, ఆహారం తీసుకోవటం ఆపినప్పుడు, ఇంద్రియ వాంఛలు బలహీనమవుతాయి. అదే విధంగా, అనారోగ్యంతో ఉన్నప్పుడు, భోగ విషయాలపై ఆసక్తి పోతుంది. ఈ వైరాగ్యం తాత్కాలికమైనది. ఎందుకంటే, కోరికల మూల బీజం, మనస్సులోనే ఉంటుంది. ఉపవాసం ముగిసినప్పుడు కానీ, లేదా ఆరోగ్యంగా ఉన్నప్పుడు కానీ, కోరికలు తిరిగి వస్తాయి. జీవాత్మ, ఆ పరమాత్మ యొక్క అణు-అంశ. అందుకే, భగవంతుని దివ్య ఆనందం కోసం పరితపించటం, ఆత్మ యొక్క అంతర్లీన స్వభావం. ఆ దివ్య ఆనందం లభించేవరకూ, జీవాత్మ తృప్తి చెందదు, మరియు ఆనందం కోసం అన్వేషణ కొనసాగుతూనే ఉంటుంది. సాధకులు బలవంతంగా తమ సంకల్పశక్తితో, ఇంద్రియములను నియంత్రించవచ్చు. కానీ, ఆ నియంత్రణ తాత్కాలికమే. ఎందుకంటే, అది అంతర్లీనంగా ఉన్న కోరికల జ్వాలలను ఆర్పలేదు. కానీ, జీవాత్మ ఆ భగవంతుని భక్తిలో నిమగ్నమై, దివ్య ఆనందాన్ని పొందినప్పుడు, తను అనంతమైన జన్మల నుండి, పరితపించిన ఆ ఉన్నతమైన దివ్య ఆనందాన్ని అనుభవిస్తుంది. భగవంతుడు సర్వానందమయుడు. జీవాత్మ, ఆ భగవత్ ప్రాప్తి నొందినప్పుడు, ఆ ఆనందంలో తనివి తీరుతుంది. ఆ తర్వాత సహజంగానే, నిమ్న స్థాయి ఇంద్రియ భోగములపై వైరాగ్యం పెరుగుతుంది. భగవత్ భక్తి ద్వారా వచ్చే వైరాగ్యం, దృఢమైనది, మరియు అచంచలమైనది.

యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ।
ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః ।। 60 ।।

ఇంద్రియములు ఎంత బలవత్తరమైనవీ, అల్లకల్లోలమైనవీ అంటే, ఓ కుంతీ పుత్రుడా, వివేకము కలిగి, స్వీయ నియంత్రణ పాటించే సాధకుని మనస్సుని కూడా, బలవంతంగా లాక్కునిపోగలవు.

ఇంద్రియములనేవి, అప్పుడే పగ్గాలు వేయబడిన అడవి గుర్రాల వంటివి. అవి దుడుకైనవీ, తెంపరితనం మెండుగా ఉన్నవి. కాబట్టి, వాటిని క్రమశిక్షణలో పెట్టడం అనేది, సాధకులు, తమలో తామే పోరాటం చేయాల్సిన సందర్భం లాంటింది. అందుకే, ఆధ్యాత్మిక పురోగతి కోసం ప్రయత్నించేవారు, కామ క్రోధాదులతో కూడిన విలాసాలను కోరే తమ ఇంద్రియములను మచ్చికచేసుకోవటానికి, ప్రయత్నించాలి. అలా కాకపోతే, అవి గొప్ప సహృదయులైన యోగుల ఆధ్యాత్మిక పురోగతిని కూడా చెడగొట్టి, పట్టాలు తప్పేలా చేస్తాయి.

తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః ।
వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితాః ।। 61 ।।

ఎవరైతే తమ ఇంద్రియములను వశపరచుకుని, మనస్సుని, "నా" యందే ఎల్లప్పుడూ లగ్నం చేయుదురో, వారు సంపూర్ణ జ్ఞానంలో స్థితులై ఉన్నట్లు.

చంచలమైన మనస్సునూ, ఇంద్రియములనూ మచ్చిక చేసుకోవలసిన అవసరం ఉందని చెప్పిన శ్రీ కృష్ణుడు, ఇప్పుడు వాటిని సరియైన పద్దతిలో ఎలా ఉపయోగించాలో, తెలియచేస్తున్నాడు. శ్రీమద్ భాగవతంలో, అంబరీష మహారాజు యొక్క ఉదాహరణ, ఈ ప్రక్రియని అద్భుతంగా విశదీకరిస్తుంది. అంబరీషుడు తన మనస్సుని, శ్రీ కృష్ణుడి పాదారవిందములను స్మరించటానికే ఉపయోగించాడు. తన నాలుకను భగవంతుని నామ, రూప, గుణ, లీలలను కీర్తించడానికే వాడాడు. తన శ్రవణేంద్రియములను, భగవంతుని కథలను వినటానికే ఉపయోగించాడు. తన కళ్ళను, అందమైన కోవెలలో, భగవంతుని మూర్తిని చూడటానికీ, తన స్పర్శని భగవంతుని భక్తుల పాదాలను ఒత్తటానికీ, తన ముక్కు పుటాలను, భగవంతుని పూజలో అర్పించిన సుగంధ ద్రవ్యములను వాసన చూడటానికీ, తన పాదాలను, గుడి చుట్టూ ప్రదక్షిణ చేయటానికీ, శిరస్సును, భగవంతునికీ భక్తులకూ నమస్కరించటానికీ వినియోగించాడు. ఈ విధంగా, తన ఇంద్రియములన్నింటినీ, భగవత్ సేవలోనే వాడి, వాటిని జయించాడు. మనం కూడా, చేసే కర్మలలో, భగవద్ నామస్మరణను విడిచిపెట్టకూడదు. అలా దేవుని చరణారవిందాలను గట్టిగా పట్టుకున్న వాడే, సంపూర్ణ జ్ఞానవంతుడు.

ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే ।
సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోఽభిజాయతే ।। 62 ।।

ఇంద్రియ విషయముల మీద చింతన చేయడం వలన, వాటి మీద మమకారాసక్తి పెరుగుతుంది. ఈ ఆసక్తి, కోరికలను కలుగ చేస్తుంది. ఆ కోరికల నుండే, క్రోధం ఉత్పన్నమవుతుంది.

క్రోధం, లోభం, కామం మొదలగునవి, వైదిక వాజ్ఞ్మయంలో, మానసిక రోగాలుగా పరిగణించబడ్డాయి. మనందరికీ, శారీరిక వ్యాధులంటే ఏమిటో తెలుసు. అనారోగ్యం, మనిషిని కృంగదీస్తుంది. అయితే, మనం శారీరిక వ్యాధుల కన్నా అధికంగా, మానసిక రోగాలతో సతమతమవుతూ ఉంటాం. మనం, కామ, క్రోధ, లోభాదులను, మానసిక వ్యాధులుగా పరిగణించక పోవటం వలన, మనం వాటిని నయం చేసుకోవటానికి ప్రయత్నించం. ఒకసారి కోరిక జనిస్తే, అది రెండు సమస్యలను సృష్టిస్తుంది. లోభం, మరియు క్రోధం. కోరికలను తీర్చుకుంటే, అది అత్యాశకు దారి తీస్తుంది. కాబట్టి, వాంఛలను తృప్తి పరచటం ద్వారా, వాటిని పోగొట్టుకోలేము. ప్రపంచంలోని సమస్త సంపదలూ కలిగి ఉన్నా, ఎదో ఒక వెలితి ఉంటుంది. కాబట్టి, దుఃఖానికి మూల కారణం కోరికలే, అని తెలుసుకుని, వాటిని త్యజించాలి. మరోప్రక్క, కోరికలు తీర్చుకోవటానికి ఆటంకం కలిగినప్పుడు, కోపం కలుగుతుంది. కోపం అనేది, దానికదే ఉత్పన్నమవ్వదు. అది కోరికలకు ఆటంకం కలగటం నుండి వస్తుంది. ‘కోరిక’ మమకారబంధం నుండి వస్తుంది. మమకారాసక్తి అనేది, ఇంద్రియ విషయముల యందు పదేపదే ఆలోచించటం వలన కలుగుతుంది. ఈ విధంగా, ఇంద్రియ భోగ వస్తు, విషయముల మీద పదేపదే చింతించటం అనే సాధారణ క్రియ, లోభం, క్రోధం అనే జంట రోగాల దిశగా, మన పతనానికి దారి తీస్తుంది.

క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః ।
స్మృతిభ్రంశాద్బుద్ధి నాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి ।। 63 ।।

కోపం అనేది, విచక్షణా రాహిత్యానికి దారి తీస్తుంది. అది స్మృతి భ్రమని కలుగచేస్తుంది. స్మృతిభ్రమ కలిగినప్పుడు, బుద్ధి నశిస్తుంది. బుద్ధి నశించినప్పుడు, మనుష్యుడు పతనమౌతాడు.

ఉదయం పూట పొగమంచు సూర్య కాంతిని తగ్గించినట్టు, కోపము వివేకాన్ని క్షీణింపచేస్తుంది. మనుష్యులు కోపంలో తప్పిదాలు చేసి, తరువాత చింతిస్తారు. ఎందుకంటే, కోపంలో ఉన్నప్పుడు, బుద్ధి భావోద్వేగాలచే కప్పి వేయబడుతుంది. ఏది మంచి, ఏది చెడు? అనే విచక్షణను కోల్పోయి, భావోద్వేగాల ప్రవాహంలో కొట్టుకోపోతాం. అక్కడి నుండి, ఇక అతః పతనం సాగుతుంది. స్మృతి భ్రంశ బుద్ది వినాశనాన్ని కలుగచేస్తుంది. బుద్ధి అనేది, అంతర్గత మార్గదర్శకం ఇచ్చేది. అదే నశించినప్పుడు, వ్యక్తి సర్వ నాశనమైపోతాడు.
ఇక మన తదుపరి వీడియోలో, దు:ఖాలను తొలగించుకుని, శాంతిని ఏ విధంగా పొందాలో, స్వయంగా శ్రీ కృష్ణుడి మాటల్లో తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes