మాయా బంధాలనుండి విముక్తి ఎలా పొందాలో చెప్పిన శ్రీ కృష్ణుడు!
'భగవద్గీత' తృతీయోధ్యాయం - కర్మ యోగం (06 - 09 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 1 నుండి 6 వరకూ ఉన్న అధ్యాయాలను, కర్మషట్కము అంటారు. దీనిలో మూడవ అధ్యాయం, కర్మ యోగం. ఈ రోజుటి మన వీడియోలో, కర్మ యోగంలోని 06 నుండి 09 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..
[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/9B6RqN-bNVk ]
జ్ఞానేంద్రియములను మనస్సుతో ఎలా అదుపు చేయాలో, శ్రీ కృష్ణుడు ఈ విధంగా చెబుతున్నాడు..
కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ।
ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారః స ఉచ్యతే ।। 6 ।।
బాహ్యమైన కర్మేంద్రియములను అదుపులో ఉంచినా, మనస్సులో మాత్రం, ఇంద్రియ విషయములపైనే చింతన చేస్తూ ఉండే వారు, తమను తాము మోసం చేసుకునే వారు. అలాంటి వారు కపటులనబడతారు.
సన్యాసి జీవన శైలికి ఆకర్షింపబడి, ప్రజలు తమ వృత్తిని విడిచిపెట్టినా, ఇంద్రియ విషయముల మీద మానసిక వైరాగ్యం ఏర్పడదు. బాహ్యంగా ఆధ్యాత్మిక శైలిని ప్రదర్శించినా, అంతర్గతంగా, తుచ్ఛమైన మనోభావాలతో జీవించే స్థితిలో ఉంటారు. కాబట్టి, ఒక కపట సన్యాసిగా జీవించటం కన్నా, బాహ్య ప్రపంచంలోని పోరాటాలని ఎదుర్కుంటూ, కర్మ యోగిగా జీవించటమే మేలు. బాహ్యంగా, ఇంద్రియ విషయములను త్యజించినా, మనస్సులో మాత్రం, వాటి గురించే ఆలోచిస్తూ ఉండే వారు కపటులనీ, తమని తామే మోసం చేసుకునే వారనీ, శ్రీ కృష్ణుడు ఈ శ్లోకంలో వివరిస్తున్నాడు.
యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతేఽర్జున ।
కర్మేంద్రియైః కర్మయోగమసక్తః స విశిష్యతే ।। 7 ।।
కానీ, అర్జునా, తమ జ్ఞానేంద్రియములను మనస్సుతో అదుపు చేసి, కర్మేంద్రియములతో మమకార, ఆసక్తులు లేకుండా పనిచేసే కర్మ యోగులు, నిజంగా ఏంతో శ్రేష్ఠులు.
'కర్మ యోగం' అన్న పదంలో, రెండు ప్రధానమైన విషయములున్నాయి. 'కర్మ' వృత్తి ధర్మాలు, మరియు 'యోగం', భగవంతునితో సంయోగం. కర్మ యోగి అంటే, తన ప్రాపంచిక ధర్మాలను నిర్వర్తిస్తూ, మనస్సును భగవంతుని యందే నిలిపేవాడు. అలాంటి కర్మ యోగికి, అన్ని రకాల పనులూ చేస్తూనే ఉన్నా, కర్మ బంధాలు అంటవు. ఎందుకంటే, వ్యక్తిని కర్మ సిద్ధాంత బంధానికి కట్టిపడేసేది, కర్మ ఫలాలపై ఆసక్తియే కానీ, చేసే కర్మలు కావు. కర్మ యోగికి కర్మ ఫలాలపై మమకారం ఉండదు. అదేవిధంగా, ఒక కపట సన్యాసి, క్రియలను త్యజించినా, మమకారం విడిచిపెట్టడు కాబట్టి, కర్మ సిద్ధాంత బంధానికి కట్టుబడిపోతాడు.
గృహస్థు జీవనంలో ఉండీ, కర్మ యోగము ఆచరణ చేసే వాడు, మనస్సులో ఇంద్రియ విషయములపైనే చింతన చేసే కపట సన్యాసి కన్నా, ఏంతో ఉత్తముడని, శ్రీ కృష్ణుడి వివరణ. ‘శరీరం జగత్తులో, మనస్సు భగవంతునిలో ఉంచి, ప్రపంచంలో వ్యవహారాలు చేయటమే, కర్మ-యోగం. శరీరంతో ఆధ్యాత్మికంగా ఉంటూ, మనస్సు నిండా ప్రాపంచిక అనుబంధాలతో ఉండటమే, కపటత్వం’.
నియతం కురు కర్మ త్వం కర్మ జ్యాయో హ్యకర్మణః ।
శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధ్యేదకర్మణః ।। 8 ।।
కాబట్టి, నీవు వేదముల అనుగుణంగా విధింపబడ్డ కర్తవ్యమును నిర్వర్తించాలి. ఎందుకంటే, పనులు చేయటం అనేది, క్రియారాహిత్యము కన్నా ఉత్తమమైనది. క్రియాకలాపములను విడిచి పెట్టడం వలన, శరీర నిర్వహణ కూడా సాధ్యం కాదు.
మనస్సు, బుద్ధి, భగవత్ ధ్యాసలో పూర్తిగా నిమగ్నమైపోయేంతవరకూ, కర్తవ్య ధోరణితో, బాహ్యమైన భౌతిక పనులను చేయటం, వ్యక్తి అంతఃకరణ శుద్ధికి చాలా మంచిది. కాబట్టి, వేదములు మానవులకు ధర్మబద్ధ విధులను నిర్దేశించాయి. నిజానికి, సోమరితనం అనేది, ఆధ్యాత్మిక మార్గంలో, అతిపెద్ద అవరోధాలలో ఒకటిగా చెప్పబడింది. సోమరితనం అనేది, మనుష్యులకు ప్రధాన శత్రువు. అది మన శరీరంలోనే ఉంటుంది కాబట్టి, మరింత హానికరమైనది. పని అనేది, మనకు అత్యంత నమ్మకమైన స్నేహితుడి లాంటిది. అది పతనం నుండి కాపాడుతుంది. సాధారణ క్రియలైన తినటం, స్నానం చేయటం, మరియు ఆరోగ్యం కాపాడుకోవటం వంటి వాటికి కూడా, పని చేయాలి. ఈ యొక్క విద్యుక్తమైన క్రియలను, 'నిత్య కర్మలు' అంటారు. ఈ విధమైన ప్రాథమిక శరీరనిర్వహణ కార్యకలాపాలు విస్మరించడం, పురోగతికి సంకేతం కాదు. అది శరీరమూ, మనస్సులను కృశింపచేసి, బలహీనపరిచే సోమరితనానికి నిదర్శనం. మరో పక్క, చక్కటి పోషణతో ఆరోగ్యవంతంగా ఉంచుకున్న శరీరము, ఆధ్యాత్మిక పథంలో ఎంతో సహకారంగా ఉంటుంది. కాబట్టి, అలసత్వం అనేది, భౌతిక పురోగతికి కానీ, ఆధ్యాత్మిక పురోగతికి కానీ, మంచిది కాదు.
యజ్ఞార్ధాత్ కర్మణోఽన్యత్ర లోకోఽయం కర్మబంధనః ।
తదర్థం కర్మ కౌంతేయ ముక్తసంగః సమాచర ।। 9 ।।
పనులను ఒక యజ్ఞం లాగా, భగవత్ అర్పితంగా చేయాలి. లేదంటే, ఆ పనులు మనలను ఈ జగత్తులో, కర్మబంధములలో కట్టివేస్తాయి. కాబట్టి, ఓ కుంతీ పుత్రుడా, నీకు నిర్దేశింపబడిన విధులను, వాటి ఫలితములపై ఆసక్తి లేకుండా, ఈశ్వర తృప్తి కోసం నిర్వర్తించుము.
కత్తి, బందిపోటు చేతిలో ఉంటే, అది మనుష్యులను భయభీతులను చేయటానికీ, లేదా చంపటానికీ ఆయుధమవుతుంది. అదే, ఒక శస్త్ర చికిత్స వైద్యుడి దగ్గర ఉంటే, ప్రజల జీవితాలను కాపాడే పనిముట్టుగా ఉంటుంది. కత్తి దానికదే ప్రమాదకరమైనది కాదు. అలాగే, శుభకరమైనదీ కాదు. దానిని వాడే విధానం బట్టి, దాని ప్రభావం ఉంటుంది. పని అనేది మంచిదా, చెడ్డదా అని చెప్పలేము. మానసిక దృక్పథం బట్టి, అది ఉన్నతికి కారకం కావచ్చు, లేదా, బంధన కారకం కూడా అవ్వవచ్చు. తన ఇంద్రియ సుఖాల కోసం, అహంకార తృప్తి కోసం చేసే పని, ఈ భౌతిక జగత్తులో బంధన కారకమవుతుంది. కానీ, ఒక యజ్ఞంలాగా, ఆ పరమాత్మ ప్రీతి కోసం చేసిన పని, మాయా బంధాలనుండి విముక్తి కలిగించి, దైవానుగ్రహాన్ని ఆకర్షిస్తుంది. పనులు చేయటం అనేది, మన యొక్క సహజ స్వభావం కాబట్టి, ఈ రెంటిలో ఏదో ఒక దృక్పథంతో, పని చేయాలి. మన మనస్సు నిశ్చలంగా ఉండలేదు కాబట్టి, మనం ఏదో ఒక పని చేయకుండా, ఒక్క క్షణం కూడా ఉండలేము. మనం కర్మలను భగవత్ అర్పితముగా చేయకపోతే, మన ఇంద్రియ, మనస్సుల సంతృప్తి కోసం పని చేయవలసి వస్తుంది. అలా కాకుండా, పనులను యజ్ఞం లాగా చేస్తే, మనం సమస్త ప్రపంచాన్నీ, దానిలో ఉండే ప్రతిదానినీ భగవత్ సంబంధంగా చూసి, అవి పరమాత్మ సేవలోనే ఉపయోగపడాలని భావిస్తాం.
ఇక మన తదుపరి వీడియోలో, బ్రహ్మ దేవుడి సృష్టి గురించి, శ్రీ కృష్ణుడి వివరణ తెలుసుకుందాము..
కృష్ణం వందే జగద్గురుం!
Post a Comment