‘అర్హత’ – అంపశయ్యపై ఉన్న భీష్ముడు ధర్మరాజుకు చెప్పిన మరో కథ!
భారతంలో భీష్మునిది ఒక ప్రత్యేకమైన పాత్ర. శీలంలోనేమి, శౌర్యంలోనేమి, నీతిలోనేమి, నిష్ఠలోనేమి, భీష్మునికి సాటి భీష్ముడే. చిన్నతనం నుంచీ, ఆయన త్యాగపురుషుడే. తండ్రి కొరకు స్వసుఖాన్నీ, రాజ్యాన్నీ, అన్నింటినీ వదులుకున్నవాడు, భీష్ముడు తప్ప మరొకడు లేడు.
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/7GJOkcKzvio ]
శ్రీకృష్ణుడు కేవలం నరుడు మాత్రమే కాడనీ, ఆయన సాక్షాత్తూ పురుషోత్తముడైన శ్రీమన్నారాయణుడనీ.. శ్రీకృష్ణుని సమకాలికులలో, ఎరుక గల్గిన అతికొద్దిమందిలో, భీష్ముడు ముఖ్యుడు. శ్రీ కృష్ణునిపై తన భక్తిని ఎక్కువగా ప్రదర్శించకపోయినా, ఆయన మహాభక్తుడు. అందుకే, ‘ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాస, అంబరీశ, శుక, శౌనక, భీష్మ దాల్భ్యాన్’ అంటారు విజ్ఞులు.. కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన తర్వాత, అంపశయ్యపై ఉన్న భీష్ముడు, దేహపరిత్యాగం కోసం ఉత్తరాయణం దాకా ఎదురుచూశాడు. ఇదే సమయంలో, పాండవులకు రాజ ధర్మాలూ, పరిపాలన గురించీ, గొప్ప విషయాలను వివరించాడు. రాజనీతికి సంబంధించిన అనేక ఉపమానాలను, ధర్మనందనుడికి తెలియజేశాడు భీష్ముడు. ఉన్నత పదవులలో ఎలాంటివారిని నియమించాలి? అని యుధిష్ఠిరుడు అడుగగా, తన సందేహ నివృత్తి కోసం, ‘ముని-కుక్క’ కథ తెలియజేశాడు. భీష్ముడు చెప్పిన ఆ కథేంటి? ధర్మనందనుడికి తెలియజేసిన నీతేంటి - అనేటటువంటి ఆసక్తికర విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..
పూర్వం ఓ అడవిలో ఒక ముని తపస్సు చేసుకుంటుండగా, ఓ కుక్క ఎప్పుడూ ఆయన వెంటే తిరుగుతూ ఉండేది. తన పట్ల విశ్వాసంగా ఉన్న ఆ కుక్కను, ముని తన వద్దే ఉంచుకున్నాడు. వీరి అనుబంధం ఇలా కొనసాగుతుండగా, ఓ రోజు ఆ కుక్కపై పులి దాడిచేసి, చంపేయబోయింది. వెంటనే ఆ కుక్క పరుగుపరుగున మునీశ్వరుని వద్దకు చేరుకుని, ఆయన వెనుక నక్కింది. తనను నమ్ముకున్న కుక్క, ఆ పులికంటే బలహీనంగా ఉండటం వల్లే కదా, దానికి ఆపద కలిగిందని ముని భావించాడు. వెంటనే, ఆ కుక్కను పులిగా మార్చేశాడు. కుక్కను తరుముతూ వచ్చిన పులి, ఈ హఠాత్పరిణామానికి భయపడి, వెనక్కి తిరిగి పారిపోయింది. దాంతో, కుక్క పులి రూపంలో యధేచ్ఛగా తిరగసాగింది. ఈ సారి తనపై ఎనుగు దాడి చేసింది. దాంతో భయపడి, ముని వద్దకు చేరింది.
వెంటనే ముని పులిగా ఉన్న ఆ కుక్కను, ఏనుగుగా మార్చేశాడు. అలా భారీ ఆకారంతో, అడవిలో సంతోషంగా తిరుగుతుండగా ఒకనాడు, బెబ్బులి ఎదురుపడి గాండ్రించింది. ఆ శబ్దానికి వణికిపోయి, తిరిగి ముని వెనుకకు చేరింది. జరిగింది తెలుసుకున్న ముని, ఎనుగుగా ఉన్న కుక్కను, బెబ్బులిగా మార్చాడు. ఇక తనకన్నా బలవంతులూ, శక్తివంతులూ ఎవరూ లేకపోవడంతో, అడవిలో నిర్భయంగా సంచరించడం మొదలుపెట్టింది. కానీ, అలా తిరుగుతుండగా, దాని మనస్సులో ఓ దుష్ట ఆలోచన మొదలైంది. ‘మునివర్యులు తన మీద జాలిచూపారు కాబట్టి, తనను అన్నింటికంటే శక్తివంతమైన జంతువుగా మార్చారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ, రేపు మరో జంతువు ఏదైనా, మునీంద్రుని దగ్గరకు వెళ్లి శరణువేడితే తన పరిస్థితి ఏంటి? అప్పుడు తనకంటే బలమైన జంతువు ముందు, తాను తలవంచాల్సిందే కదా! అలా జరగకూడదు. తానే అడవికి రాజుగా ఉండాలి.
అలా జరగాలంటే, ఆ మునీశ్వరుణ్ణి నమ్మించి, హతమార్చాలి’ అని పన్నాగం పన్నింది. అనుకున్నదే తడవుగా, అమాయకంగా, తన మనస్సులో ఎలాంటి దుర్మార్గపు ఆలోచనలూ లేన్నట్టు, ఏమీ ఎరుగనట్లు, ముని ముందుకు వచ్చి కూర్చుని, అవకాశం కోసం ఎదురుచూడసాగింది. అయితే, తన దగ్గర ఉన్న కుక్కను శక్తివంతమైన జంతువుగా మార్చిన మునికి, దాని మనస్సులో ఏముందో గ్రహించడం, కష్టతరం కాదు. దాని మనస్సులోని దురాలోచనను పసిగట్టిన ముని, వెంటనే దానిని తిరిగి కుక్కగా మార్చేశాడు. అది పూర్వంలాగే, కుక్క బ్రతుకుని గడపసాగింది.
కాబట్టి ధర్మజా! దుష్టులకు ఉన్నత పదవులు ఇస్తే, వారి బుద్ధి చివరికి ఇలాగే పరిణమిస్తుంది. వారి వారి యోగ్యతను బట్టి, ఉన్నత, మధ్య, హీన పదవులనిచ్చి, గౌరవించాలి. శౌర్యమూ, పరాక్రమమూ, సత్యమూ, భక్తి, సత్కార్యములు చేయు బుద్ధీ, గాంభీర్యమూ గలవాడే, ఉన్నత పదవులకు అర్హుడు. కేవలం వారికున్న యోగ్యతలను బట్టే, పదవులను కట్టబెట్టాలి. అలాంటి యోగ్యులు తన అనుచరులుగా ఉన్న రాజు, ఏ కార్యాన్నైనా సాధించగలడని ముగించాడు, భీష్ముడు. ఈ కథాసారం, కేవలం రాజులకు మాత్రమే కాదు.. నేటి సమాజంలోని వారికి కూడా, ఉపయుక్తమవుతుంది. మన బంధువులూ, పలుకుబడి ఉన్నవారూ, స్నేహితులూ అంటూ, అర్హతలేని వారిని తమ పనుల్లో భాగం చేస్తే, తప్పక నష్టపరిహారం చెల్లించుకోవాల్సి ఉంటుంది.
[ అంపశయ్యపై భీష్ముడు ధర్మరాజుకు చెప్పిన కథ - ‘పగ’! = https://youtu.be/t43ByMxiNNs ]
ధర్మో రక్షతి రక్షితః!
Post a Comment