పంచేంద్రియాలలో ఏది ప్రమాదకరమైనది?
కనిపించని ఏదో ఒక దివ్యశక్తి, ఈ ప్రపంచాన్ని శాసిస్తోంది. ఆ శక్తినే, దైవశక్తి అంటాం. అలాగే, కనిపించని ఏదో శక్తి, ఈ మనిషి జీవితాన్ని నడిపిస్తోంది. దాన్నే, మనేేస్సు అంటాం. మనస్సు ఎక్కడుందో, ఎలా ఉంటుందో, ఎవరికీ తెలియదు. మన శరీరంలో రక్తం ప్రవహించినంత కాలం, ఆ మనస్సు ఆజ్ఞలు జారీ చేస్తూనే ఉంటుంది. మనం ఊపిరి తీస్తున్నంత కాలం, ఆ మనస్సు మనల్ని ఆడిస్తూనే ఉంటుంది.
[ మనిషి జయించవలసిన '6 దోషాలు'! = https://youtu.be/vu76U3f7LJ4 ]
మనస్సు సముద్రం లాంటిది. సముద్రం అనంతమైనది, అపారమైనది, లోతైనది. సముద్రంలో జలచరాలుంటాయి. జలసంపదలుంటాయి. అమృతం, హాలాహలం అక్కణ్నుంచే పుట్టాయంటాయి, మన పురాణాలు. సముద్రంలోంచి ఉప్పెనలొస్తాయి. సముద్రం అందమైనది. కల్లోలమైనది. చెలియలికట్ట దాటనంతవరకూ, సముద్రంతో ఏ ప్రమాదం ఉండదు.
మనస్సూ అంతే.. మనస్సు ప్రపంచాన్ని ఉద్ధరించగలదు. ప్రపంచాన్ని భస్మం చెయ్యగలదు. మనిషిలో సత్వగుణం, అమృతం. సత్వగుణం పెంచుకుంటే, మనిషి వల్ల సమాజానికెంతో మేలు జరుగుతుంది. తమోగుణం పెరిగితే, జరిగేవన్నీ చెడ్డ పనులే..
నదులన్నీ సముద్రంలో కలుస్తాయి. ప్రపంచంలోని విషయాలన్నీ మనస్సును చేరతాయి.
మనిషికి కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం అనే పంచేంద్రియాలున్నాయి. ప్రపంచంలోని ప్రతి దృశ్యాన్నీ, కన్ను ఆకర్షిస్తుంది. అందమైన వస్తువులన్నీ సొంతం కావాలనుకుంటుంది. చెవి మంచి, చెడు శబ్దాలను వింటుంది. మంచిని మాత్రమే గ్రహించి, చెడును విడిచిపెట్టగలిగితే, మనిషి ఉన్నతుడవుతాడు. ముక్కు సువాసనలే పీలుస్తుంది. దుర్వాసనలను ఎలాగూ పీల్చదు. జిహ్వ రుచులను కోరుతుంది. దీనీలో, తినరానివి తినకూడదని విడనాడితే, మనస్సు నిర్మలమవుతుంది. చర్మం సుఖాన్ని కోరుతుంది. ఇలా పంచేంద్రియాలూ మనిషి మనస్సును, మంచి చెడులవైపుకు ప్రేరేపిస్తాయి.
పంచేంద్రియాలలో ప్రమాదకరమైనది, నోరు. ఇది రెండు పనులు చేస్తుంది.. తింటుంది, మాట్లాడుతుంది. రెండూ మితమైనప్పుడే, మనస్సు సత్వ సంపన్నమవుతుంది. అప్పుడే, సమాజ సేవ, ఆధ్యాత్మిక చింతన, అరిషడ్వర్గాల అదుపు పెరిగి, మానవ జీవితానికి సార్థకత చేకూరుతుంది.
ధర్మరాజు జూదమాడాడు. ఆస్తిపాస్తులనూ, భార్యనూ పణంగా పెట్టాడు. పరాజితుడయ్యాడు. అతడిలో తప్పున్నా, లోకం అతణ్ని పన్నెత్తు మాట అనలేదు. కారణం, ఆయన మనస్సు వెన్న లాంటిది. దాన ధర్మాలు చేస్తాడు. దైవభక్తిగలవాడు. దుర్యోధనుడు అసూయాపరుడు కావడం, ధర్మవ్యతిరిక్తమైన పనులు చేయడంతో, అతడు లోక నిందితుడయ్యాడు. కారణం, అతడి మనస్సు. సకల శాస్త్ర పారంగతుడూ, పరాక్రమశాలీ, సకల సంపన్నుడూ రావణుడు. మనస్సు చెడ్డతనం వల్ల, లోకనిందకు గురయ్యాడు. రాక్షస కులంలో పుట్టినా, విభీషణుడు మనస్సును ధార్మిక చింతన వైపుకు మళ్ళించడంతో, లోకం అతణ్ని మెచ్చుకుంది. అందుకే, మనస్సును అదుపులో ఉంచుకోకపోతే, జీవితం కష్టాల కడలి తరంగాల సంక్షుభితం అవుతుంది. మనస్సును అదుపులో ఉంచుకుంటే, ఆనందాల నందనవన సంశోభితమే అవుతుంది..
ధర్మో రక్షతి రక్షితః!
Post a Comment