మనమంతా ఎవరము? Who are we?

 

మనమంతా ఎవరము?

శివుడిని ఇష్టదైవంగా కలిగినంత మాత్రాన శైవులము, నారాయణుని అర్చన చేస్తాం కనుక వైష్ణవులము, అమ్మవారి రూపాలంటే ఇష్టం కనుక శాక్తేయులం, గణపతి భక్తులం కనుక గాణాపత్యులమైపోము. 

[ ఆది శంకరాచార్యుల జీవిత రహస్యాలు = https://youtu.be/srTCWknBC7Q ]

శైవ గురువుల నుంచి మంత్రదీక్ష తీసుకుని, శైవాగమాల ప్రకారం శివార్చన చేస్తే శైవులం అవుతాము. వైష్ణవ గురువు వద్ద మంత్రదీక్ష తీసుకుని, వైష్ణవాగమాల ప్రకారం అర్చన చేస్తే, అప్పుడు వైష్ణవులం అవుతాము. అదే శక్తి, సూర్య, గణపతి మరియు సుబ్రహ్మణ్యుని అర్చనలో కూడా అన్వయమవుతుంది. అలాగే, ఆయా కుటుంబాల్లో పుట్టినవారు మాత్రమే, జన్మతః ఆయా శాఖలకు చెందుతారు. ఎందుకంటే, అది వారి వంశాచారం. మరి మనమంతా ఎవరము? అనే ప్రశ్న తలెత్తుతుంది. 

దీనికి సమాధనం, మనమంతా జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు ప్రతిపాదించిన స్మార్తులము. ఎప్పుడైనా చెప్పవలసి వస్తే, మనది స్మార్త సంప్రదాయమని చెప్పాలి. స్మార్తులు అంటే ఎవరు? శృతులు (వేదాలను), స్మృతులను ఆధారంగా చేసుకుని, సర్వ దేవతలనూ సమానంగా పూజించేవారు. మనకు శివకేశవ బేధం లేదు. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అనే అహంభావన లేదు. ఏ దేవతను పూజించినా, అన్నీ ఒక్కడికే చేరతాయనే భావన, మన అందరిలో నిగూఢంగా ఉంది. ఇష్టదేవతను కలిగి ఉన్నా, ఇతర దేవతలను తక్కువ చేయము. ఎందుకంటే, మనందరిలో, ఆదిశంకరుల తత్త్వము అనాదిగా నిండి ఉంది. అందుకే, ఎవరైనా మనది ఏ సంప్రదాయం అని అడిగినప్పుడు, శంకర సంప్రదాయమనీ, స్మార్తులమనీ చెప్పవచ్చు. గురువు లేని వారందరికీ గురువు ఆదిశంకరులు. సాక్షాత్తూ శివుడే ఆదిశంకరులుగా అవతరించి, సనాతన ధర్మాన్ని కాపాడారు. వారు జగద్గురువులు. ఈ లోకంలో గురువు లేనివారందరికీ ఆయనే గురువు.

ఈ శ్లోకం రోజూ చదువుకోవచ్చు..

అందుకే మనం 'సదాశివ సమారంభాం అని చెప్పినా, నారాయణ సమారంభాం అని చెప్పినా,
వ్యాస శంకర మధ్యమాం,
అస్మదాచార్య పర్యంతాం, 
వందే గురు పరంపరాం' అని చెప్తాము..

అనగా, సదాశివుడు / నారాయణుడి నుంచి మొదలైన ఈ సంప్రదాయంలో, అనాదిగా కొనసాగుతూ వచ్చింది. అందులో వేదవ్యాసులవారూ, ఆదిశంకరాచార్యుల వారి ద్వారా రక్షించబడింది. అక్కడి నుంచి పరంపరగా వస్తూ, ఇప్పటి నా గురువు ద్వారా నాకిది అందింది, ఈ మొత్తం గురుపరంపరకు నమస్కారం అని భావము.. 

ఆదిశంకరులవారు, 6 మతాలను స్థాపించారు. మీ ఇష్టదేవతను మధ్యలో ఉంచి, మిగితా దేవతలను వారి చుట్టూ ఉంచి పూజించే సంప్రదాయం అది. దానిని పంచాయతనం అంటారు. ఆదిశంకరులు ప్రతిపాదించిన దాంట్లో, వైష్ణవం కూడా ఉంది. ఈనాటికీ, శంకర సంప్రదాయంలో ఉన్న వైష్ణవులు, గణపతినీ, మహేశ్వరుడినీ, అమ్మవారినీ, సుబ్రహ్మణ్యునీ, తమ దేవతార్చనలో పూజిస్తారు. ఉపాసన చేస్తున్నవారు కూడా ఉన్నారు. శంకర సంప్రదాయంలోని శైవులు కూడా, విష్ణువును అంతే భక్తితో ఆరాధిస్తారు. ఆదిశంకర సంప్రదాయంలోని ఏ మతంలో ఉన్నవారైనా, ఇతర దేవతలను తులనాడరు. అదే ఇప్పుడు మనకు అనుసరణీయము.

వందే గురు పరంపరాం!

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes