కామమును ఎలా నిర్మూలించాలో చెప్పిన శ్రీ కృష్ణుడు! Bhagavad Gita

 

కామమును ఎలా నిర్మూలించాలో చెప్పిన శ్రీ కృష్ణుడు!

'భగవద్గీత' తృతీయోధ్యాయం - కర్మ యోగం (40 - 43 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 1 నుండి 6 వరకూ ఉన్న అధ్యాయాలను, కర్మషట్కము అంటారు. దీనిలో మూడవ అధ్యాయం, కర్మ యోగం. ఈ రోజుటి మన వీడియోలో, కర్మ యోగంలోని 40 నుండి 43 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/CzMG2-WXelo ]

దు:ఖహేతువైన కామమును ఎలా నిర్మూలించాలో, శ్రీ కృష్ణుడిలా వివరిస్తున్నాడు..

ఇంద్రియాణి మనో బుద్ధిరస్యాధిష్ఠానముచ్యతే ।
ఏతైర్విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినమ్ ।। 40 ।।

ఇంద్రియములూ, మనస్సూ, బుద్ధీ అనేవి, కోరికల మూల స్థానంగా చెప్పబడుతుంది. వాటి ద్వారా, అది, వ్యక్తి జ్ఞానాన్ని మరుగుపరుస్తుంది, మరియు జీవాత్మని భ్రమకు గురిచేస్తుంది.

కామము నివసించే స్థానాలను వెల్లడి చేయటం ద్వారా, శ్రీ కృష్ణుడు, ఇప్పుడు వాటిని నియంత్రించే పద్దతి ఒకటుందని, వివరిస్తున్నాడు. ముట్టడి చేసే ముందుగా, శత్రువు యొక్క కోటని గుర్తించాలి. ఇంద్రియములూ-మనస్సూ-బుద్ధులలో నుండి కామము, తన ఆధిపత్యాన్ని జీవాత్మపై, చలాయిస్తుంది. ఈ కామ ప్రభావంచే, బాహ్య విషయములను, ఇంద్రియములు కోరుతాయి. దాంతో, ఇంద్రియములు మనస్సుని పిచ్చిపట్టేటట్లు చేస్తాయి. మనస్సు బుద్ధిని తప్పుదారి పట్టిస్తుంది. అప్పుడు బుద్ధి, తన విచక్షణా శక్తిని కోల్పోతుంది. బుద్ధి మసకబారినప్పుడు, వ్యక్తి చిత్త భ్రాంతికి లోనై, కామానికి వశుడై, దాన్ని తీర్చుకోవడానికి, ఏదైనా చేస్తాడు. ఈ ఇంద్రియములూ, మనస్సూ, బుద్ధి - అనే పరికరములు, తమంత తామే చెడ్డవి కాదు. అవి మనకు భగవత్ ప్రాప్తికి సహకరించటానికి, ప్రసాదించబడ్డాయి. కానీ మనమే, కామానికి, వాటిపై ముట్టడి చేసి, వశపరుచుకునే అనుమతినిస్తున్నాం. 

తస్మాత్ త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ ।
పాప్మానం ప్రజహి హ్యేనం జ్ఞానవిజ్ఞాననాశనమ్ ।। 41 ।।

కాబట్టి, ఓ భరత శ్రేష్టుడా.. మొదట్లోనే ఇంద్రియములను నియంత్రణలోనికి తెచ్చి, జ్ఞాన విజ్ఞానములను నశింపచేసే ఈ పరమ పాపిష్టి కామమనే శత్రువును, నిర్మూలించు.

అన్ని అరిష్టములకూ మూలకారణమైన కామాన్ని ఎలా అధిగమించాలో, శ్రీ కృష్ణుడు వివరిస్తున్నాడు. కామము, మానవ అత్మోద్ధరణకు ఎంతో హానికరమైనది. కామము యొక్క నిక్షేప స్థానాన్ని గుర్తించి, మొదట ఈ ఇంద్రియముల కోరికలను నిగ్రహించాలి. అలాకాకుండా వాటిని పెంచితే, అది మన దుఃఖాలకు మూలకారణం అవుతుంది. వాటిని నిర్మూలించటం, శాంతికి మార్గం. శారీరక, ఇంద్రియ విషయముల కొరకై, కోరికలను మనమే సృష్టించుకుంటాం. తరువాత వాటిచే, ఉద్విగ్నతకు లోనవుతాం. మనకు కావలసిన వస్తువు చేజిక్కిన తరువాత, మనంతమనమే సృష్టించుకున్న రోగం, నిర్మూలించబడుతుంది. దాన్నే మనం ఆనందం అనుకుంటాము. కానీ, మనలను మనం జీవాత్మగా పరిగణించుకుంటే, ఆత్మ ఆనందమే మన లక్ష్యం అయితే, ఈ ప్రాపంచిక కోరికలను త్యజించటం, సులువవుతుంది. 

ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః ।
మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధేః పరతస్తు సః ।। 42 ।।

స్థూల శరీరం కన్నా, ఇంద్రియములు ఉన్నతమైనవి. ఇంద్రియముల కన్నా, మనస్సు ఉన్నతమైనది. మనస్సు కన్నా ఉన్నతమైనది, బుద్ధి. బుద్ధి కన్నా మరింత ఉన్నతమైనది, ఆత్మ.

ఒక తక్కువ స్థాయి అస్థిత్వాన్ని, దాని యొక్క ఉన్నతమైన అస్థిత్వంచేత నియంత్రించవచ్చు. ఈ శరీరం, స్థూల పదార్ధంతో తయారయింది. దానికన్నా ఉన్నతమైనవి, ఐదు జ్ఞానేంద్రియములు. ఇంద్రియముల కన్నా మించినది, మనస్సు. మనస్సు కన్నా ఉన్నతమైనది, విచక్షణా శక్తి కలిగిన బుద్ధి. కానీ, ఈ బుద్ధి కన్నా మించినది, దివ్యాత్మ. ఇంద్రియములూ, మనస్సూ, బుద్ధీ, మరియు ఆత్మల ఆధిపత్య క్రమం యొక్క జ్ఞానాన్ని, మన కామాన్ని కూకటి వేళ్ళతో పెకలించి వేయటానికి ఉపయోగించుకోవచ్చు.

ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనా ।
జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదమ్ ।। 43 ।।

ఈ విధంగా జీవాత్మ అనేది, భౌతికమైన బుద్ధి కన్నా ఉన్నతమైనదని తెలుసుకుని, ఓ మహా బాహువులు కలవాడా, నిన్ను నీవు వశపరుచుకొనుము. అంటే, ఇంద్రియమనోబుద్ధులను, నీ ఆత్మ శక్తి ద్వారా లోబరచుకొనుము, మరియు కామమనే బలీయమైన శత్రువును, సంహరింపుము.

ఆత్మ అనేది భగవంతుని అంశ కాబట్టి, అది దివ్యమైనది. అంటే, అది కోరుకునే దివ్య ఆనందం, దివ్య వస్తువు ద్వారానే, లభ్యమవుతుంది. ఎందుకంటే, ప్రాపంచిక వస్తువులన్నీ, భౌతికమైనవే. ఈ భౌతిక విషయములు, ఆత్మ యొక్క గాఢమైన, అంతర్లీన తపనని తీర్చలేవు. కాబట్టి, వాటి కోసం కోరికలను సృష్టించుకోవటం, నిష్ప్రయోజనమైన పని. మనం తప్పకుండా, మన బుద్ధికి శిక్షణ ఇచ్చి, ఆ తరువాత దానిని మనస్సూ, ఇంద్రియములనూ నియంత్రించటానికి వినియోగించాలి. ఉదాహరణకు, ఐదు గుర్రాలచే లాగబడే ఒక రథం ఉంది. ఆ గుర్రాలకు నోటియందు పగ్గాలున్నాయి. ఆ పగ్గాలు, రథ సారథి చేతిలో ఉన్నాయి. ఆ రథం వెనుక భాగంలో, ఒక ప్రయాణీకుడున్నాడు. నిజానికి ఆ ప్రయాణీకుడు, రథ సారధికి దిశా నిర్దేశం చేయాలి. అప్పుడు సారధి, పగ్గాలతో గుర్రాలకి దిశా నిర్దేశం చేయాలి. కానీ, ప్రయాణికుడు నిద్రపోతే, గుర్రాలు తమ ఇష్టానుసారం నడుస్తాయి. ఈ ఉపమానంలో, రథం అంటే శరీరం; గుర్రాలు అనేవి ఐదు ఇంద్రియములు; గుర్రాల నోటియందు ఉన్న పగ్గాలు, మనస్సు; రథ సారధి, బుద్ధి; వెనుక కూర్చున్న ప్రయాణీకుడు, శరీరంలో ఉన్న జీవాత్మ. ఇంద్రియములైన గుర్రాలు, భోగాలను కోరుకుంటాయి. పగ్గాలు, గుర్రాలను నియంత్రించలేనట్లు, మనస్సు ఇంద్రియములపై నియంత్రణ చేయటం లేదు. సారధి పగ్గాల లాగుడుకు వశమైనట్లు, బుద్ధి, మనస్సుకు వశమైపోయింది. కాబట్టి, భౌతికంగా బద్ధుడై ఉన్న స్థితిలో, అయోమయానికి గురై ఉన్న జీవాత్మ, బుద్ధిని సరియైన దిశలో నడిపించలేదు. ఆ విధంగా, రథం ఎటు పోవాలన్న విషయాన్ని, ఇంద్రియములే నిర్దేశిస్తాయి. ఇంద్రియ సుఖములను, జీవాత్మ పరోక్షంగా అనుభవిస్తుంది. కానీ, అవి దానికి సంతృప్తినివ్వలేవు. ఈ రథంలో కూర్చునిఉన్న జీవాత్మ, అలా అనంత కాలం నుండి, భౌతిక ప్రపంచంలో తిరుగుతూనే ఉన్నాడు. ఒకవేళ జీవాత్మ తన ఉన్నతమైన స్వభావంతో మేల్కొని చురుగ్గా వ్యవహరిస్తే, బుద్ధిని సరియైన దిశలో పెట్టవచ్చు. అప్పుడు బుద్ధి, తక్కువ స్థాయి అస్థిత్వాలైన మనస్సూ, ఇంద్రియములను సరిగ్గా నియంత్రిస్తుంది.

ఓం తత్సదితి శ్రీ మద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం
యోగశాస్త్రే శ్రీ కృష్ణార్జునసంవాదే కర్మయోగో నామ తృతీయోధ్యాయ:

శ్రీ మద్భగవద్గీతలోని కర్మషట్కం, మూడవ అధ్యాయం, కర్మ యోగంలోని 43 శ్లోకాలు, సంపూర్ణం.

ఇక మన తదుపరి వీడియోలో, కర్మషట్కములోని నాలుగవ అధ్యాయం, జ్ఞాన, కర్మ, సన్న్యాస యోగంలో, శ్రీ కృష్ణుడు వివరించిన నిగూఢ సత్యాలను తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes