‘త్రిశంకు స్వర్గ రహస్యం’ వశిష్ఠ విశ్వామిత్రుల వైరం!

 

‘త్రిశంకు స్వర్గ రహస్యం’ వశిష్ఠ విశ్వామిత్రుల వైరం!

లోక కళ్యాణం కోసం ఎంతో శ్రమించిన మహర్షులు, మన పురాణాలలో కోకొల్లలు. కానీ, వారిలో ప్రముఖుడు విశ్వామిత్రుడు. క్షత్రియుడిగా, ఒక రాజ్యాన్ని పాలించే రాజు ఎందుకు బ్రహ్మర్షిగా మారాడు? విశ్వామిత్రుడు ఎవరు?

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/p_6Zyl1tZD0 ]

వశిష్ఠుడికీ విశ్వామిత్రుడికీ మధ్య గల వైరానికి కారణమేంటి? వశిష్ఠుడిని ఓడించడం కోసమే తపస్సులు చేశాడా? బ్రహ్మ సృష్టికి ప్రతి సృష్టి చేసి, త్రిశంకు స్వర్గాన్ని ఎందుకు నిర్మించాల్సి వచ్చింది? విశ్వామిత్రుడి జీవితంలో దాగిన మరిన్ని రహస్యాల గురించి, ఈరోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

బ్రహ్మ కుమారుడైన కుశుడి వంశంలో జన్మించిన విశ్వామిత్రుడిని, కౌశికుడిగా కూడా పిలుస్తారు. విశ్వామిత్రుడి అసలు పేరు విశ్వరథుడు. మహారాజుగా రాజ్యపాలన చేస్తున్న సమయంలో, ఒకనాడు విశ్వరథుడు వేటకు వెళ్ళి అలసిపోయి, వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు. రాజుకు అతిథి మర్యాదలు చేయడం కోసం, తన దగ్గరున్న కామధేనువు వంటి హోమధేనువు సహకారంతో, ఏ లోటూ లేకుండా, అన్ని ఏర్పాట్లూ చేశాడు. ఈ గోవును చూసి ఆశ్చర్యపోయిన రాజు విశ్వరథుడు, దానిని సొంతం చేసుకోవాలనుకున్నాడు.

తనకు ఆ హోమధేనువును అప్పగిస్తే, లక్ష గోవులను దానం చేస్తానని వశిష్ఠుడితో అనగా, దానికి మహర్షి ససేమిరా అనడంతో, యుద్ధానికి సిద్ధమయ్యాడు విశ్వరథుడు. సైనికులు ఆ ధేనువును బలవంతంగా తీసుకెళ్లబోతుండగా, అది హూంకారం చేసి, పహ్లవులనబడే వారికి జన్మనిచ్చి, వారి ద్వారా విశ్వరధుడి సైన్యాన్ని సంహరించింది. వశిష్ఠుడి వల్లే తమ సైనికులు మరణించారని, విశ్వామిత్రుడి నూరుమంది కుమారులు, మహర్షి మీదకు దండెత్తారు. దాంతో, వశిష్ఠుడు కళ్ళెర్ర చేయగా, ఆ నూరు మంది కుమారులూ భస్మమైపోయారు. దాంతో విశ్వరథుడు చింతించి, హిమాలయాలకు వెళ్ళి తపస్సుచేయడం ఆరంభించాడు.

అతని ఘోర తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమవ్వగా, తనకు ధనుర్వేదంలోని రహస్యాలన్నీ బోధించమని వేడుకున్నాడు. ఆ విధంగా శివుడి దగ్గర నుండి వరం పొందిన తరువాత, ఆగ్రహంతో వశిష్ఠుడి దగ్గరకు వచ్చి యుద్ధం చేశాడు. కానీ విశ్వరథుడి అస్త్ర శస్త్రాలన్నీ, వశిష్ఠుడి బ్రహ్మదండాన్ని తాకి తునాతునకలయ్యాయి. దాంతో క్షత్రియబలం కన్నా, తపోబలమే గొప్పదన్న విషయం, విశ్వరథుడికి అర్థమయ్యింది. వెంటనే తాను కూడా బ్రహ్మర్షి కావాలని, దక్షిణ తీరానికి వెళ్ళి, బ్రహ్మ గురించి వేయి సంవత్సరాల పాటు తపస్సు చేయగా, చతుర్ముఖుడు సంతోషించి, విశ్వరథుడిని రాజర్షిగా చేసి, వెంటనే అంతర్థానమయ్యాడు. విశ్వరథుడు, దాంతో తృప్తి చెందలేదు. బ్రహ్మర్షి కావడం కోసం, తిరిగి తపస్సునారంభించాడు.

ఇదిలా ఉండగా, ఇక్ష్వాకు వంశానికి చెందిన త్రిశంకుడనే మహారాజుకు, ఒక విచిత్రమైన ఆలోచన కలిగి, తన పూర్వ వంశీయుల వలె కాకుండా, తాను సశరీరంగా స్వర్గానికి చేరుకోవాలనే కోరిక పుట్టింది. కులగురువులైన వశిష్ఠుడికి తన కోరిక విన్నవించాడు. అది ధర్మశాస్త్ర విరుద్ధమని వశిష్ఠుడు వారించగా, వశిష్ఠుని నూరుగురు కొడుకుల వద్దకు వెళ్ళి, తన ఇచ్ఛను ప్రకటించాడు. వారు కూడా, సశరీరంగా స్వర్గానికి వెళ్ళడం కూడని పని అని, మహారాజుకు నచ్చచెప్పచూశారు. దాంతో ఆగ్రహించిన త్రిశంకుడు, ‘మీ వల్ల కాకపోతే, నేను వేరే గురువుని చూసుకుంటాను’ అని విర్రవీగాడు. ఆ మాటలు విన్న వశిష్ఠకుమారులు కోపించి, ‘ఛండాలుడివి కమ్మని’ త్రిశంకుని శపించారు.

మరునాటి ఉదయానికి, మహారాజు మెడలో ఉన్న బంగారు ఆభరణాలు ఇనుప గొలుసులుగా మారిపోయి, త్రిశంకుడు ఛండాలుడిగా మారిపోయాడు. అలా త్రిశంకుడు దేశదిమ్మరిలా తిరుగుతూ, దక్షిణ తీరంలో తపస్సు ముగించిన విశ్వామిత్రుడి కంటపడి, తన వృత్తాంతాన్నంతా వివరించాడు. దాంతో సంతోషించిన విశ్వామిత్రుడు, వశిష్ఠుడు చేయలేని పనిని తాను చెయ్యాలనే కోరికతో, త్రిశంకుడికి అభయమిచ్చాడు. విశ్వామిత్రుడు తన కుమారులను పిలిచి, సమస్త భూగోళంలో ఉన్న బ్రహ్మణులను యజ్ఞానికి అహ్వానించమని పంపించాడు. వశిష్ఠుడి కుమారులు, ఆ యజ్ఞానికి రామని కుండబద్దలు కొట్టారు. ఇక మహోదయుడనే బ్రాహ్మణుడు, క్షత్రియుడు చేయించే యజ్ఞంలో, ఛండాలుడు హవిస్సులిస్తే, దేవతలు తీసుకోరని మండిపడ్డాడు.

కుమారుల ద్వారా  వారి అభిప్రాయాలను తెలుసుకున్న విశ్వామిత్రుడు క్రోధావేశంతో, వశిష్ఠుని నూరుగురు కుమారులూ భస్మరాసి అవుతారనీ, 700 జన్మలు శవమాంసాన్ని తింటూ బ్రతుకుతారనీ, ఆ తరువాత ముష్టికులుగా పుట్టి, కుక్కమాంసం తింటూ బ్రతుకుతారనీ.. ఇక మహోదయుడు, నిషాదుడిగా హీనమైన బ్రతుకు బ్రతుకుతాడనీ, శపించాడు. ఇక తాను తలపెట్టిన యాగంలో హవిస్సులు సమర్పిస్తుంటే, వాటిని తీసుకోవడానికి దేవతలు రాకపోవడంతో, విశ్వామిత్రుడు తన తపోశక్తితో, త్రిశంకుడిని సశరీరంగా స్వర్గానికి పంపించాడు. అది చూసిన ఇంద్రుడు త్రిశంకుడితో, ‘గురుపుత్రుల శాపానికి గురైన నీకు స్వర్గ ప్రవేశం లేదు. వచ్చిన దారినే పొమ్మ’ని భూలోకానికి నెట్టేశాడు. అలా నెట్టి వేయబడ్డ త్రిశంకుడు తలక్రిందులుగా పడిపోతూ, "విశ్వామిత్రా! రక్షించు" అని ఆర్తనాదం చేశాడు.

అప్పుడు విశ్వామిత్రుడు త్రిశంకుడిని మార్గమధ్యంలో ఆపి, బ్రహ్మ సృష్టికి ప్రతి సృష్టిగా స్వర్గాన్నీ, నక్షత్రమండలాన్నీ చేయనారంభించాడు. దీనిని గమనించిన దేవతలు, విశ్వామిత్రుడితో ఇలా ప్రతిసృష్టి చేయడం తగదని వారించగా, వారి అభ్యర్థన మేరకు, త్రిశంకుడుండే స్వర్గాన్ని నక్షత్రమండలానికి ఆవల సృష్టించి, త్రిశంకుడు తలక్రిందులుగా ఆ త్రిశంకు స్వర్గంలో ఉండేటట్లు ఏర్పాటు చేశాడు. త్రిశంకుడిని ఆ విధంగా స్వర్గానికి పంపిన తరువాత, విశ్వామిత్రుడు తపస్సుచేసుకోవడం కోసమని, పశ్చిమ దిక్కుకు చేరుకున్నాడు. విశ్వామిత్రుడి తపస్సును భగ్నం చేయడం కోసం, ఇంద్రుడు మేనకను పంపించాడు. ఆమెను చూసి పరవశుడైన విశ్వామిత్రుడు, మేనకతో తన కోరికను విన్నవించగా, అందుకు ఆమె కూడా అంగీకరించింది.

వారిరువురూ సంతోషంగా రోజులు గడుపుతుండగా, ఒక రోజు విశ్వామిత్రుడికి, ఆ మాయలో పది సంవత్సరాలు గడిచిపోయాయని, స్ఫురణలోకి వచ్చింది. ఇది దేవతల పనని గ్రహించి, కామక్రోధాలకు వశుడయ్యాడని భావించి, తిరిగి హిమాలయాలకు చేరుకున్నాడు. తన తపస్సుతో బ్రహ్మను మెప్పించి, మహర్షిగా మారాడు. కానీ, బ్రహ్మర్షి కావాలనే కోరికతో ఉన్న విశ్వామిత్రుడు, తిరిగి తపస్సు ప్రారంభించాడు. అప్పుడు ఇంద్రుడు రంభను పంపాడు. విశ్వామిత్రుడు దానిని గ్రహించి, తన దృష్టిని మరల్చడానికి వచ్చిన రంభను శిలగా మారమని, శపించాడు.

విశ్వామిత్రడు మనో నిగ్రహంతో తపస్సులో నిమగ్నమై, బ్రహ్మను మెప్పించి, బ్రహ్మర్షిగా మారాడు. ఈ విధంగా, విశ్వరథుడనే మహారాజు, బ్రహ్మర్షి విశ్వామిత్రుడిగా, ముల్లోకాలలో ఖ్యాతి గడించాడు. కానీ, మన పురాణాలలో చాలా సందర్భాలలో, విశ్వామిత్రుడూ, వశిష్ఠుల మధ్య వైరం సుస్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. సత్య హరిశ్చంద్రుడి విషయంలో వీరిరువురి వాగ్వాదం, తార స్థాయికి చేరి, భూలోకాన్ని అతలాకుతలం చేసింది. వీరి యుద్ధం గురించీ, సత్య హరిశ్చంద్రుడి చరిత్ర గురించీ మరింత తెలుసుకోవాలంటే, క్రింద డిస్ర్కిప్షన్ లో ఉన్న వీడియోలను చూడండి..

శ్రీ గురుభ్యో నమః!

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes