కేరళలో శకుని ఆలయం - శకుని జన్మ రహస్యం!

 

కేరళలో శకుని ఆలయం - శకుని జన్మ రహస్యం!

‘మహభారతం’ కేవలం ఆధ్యాత్మిక గ్రంథం మాత్రమే కాదు.. ఎందరో మహానుభావుల జీవిత సారం. భారతంలో పేర్కొనబడిన ఒక్కో వ్యక్తీ, ఒక్కో ప్రాముఖ్యతను కలిగి ఉన్నవారే. వారందరిలో ముఖ్యంగా చెప్పుకోవలసిన వ్యక్తి, కురుక్షేత్ర సంగ్రామానికి తొలి బీజం వేసిన కుటిలుడు, ‘శకుని’. వ్యూహాత్మకంగా వ్యవహరించి, కురు పాండవుల మధ్య విభేదాలు సృష్టించి, తన పంతాన్ని నిలబెట్టుకున్న మేధావి.

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/jyCK65pkCnE ]

కౌరవులకు మేనమామ అయిన శకుని, పాండవులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూనే, కౌరవుల నాశనానికి కారకుడయ్యాడు. తన సోదరి సంతానంపై శకుని ద్వేషానికి కారణమేంటి? తన రాజ్యాన్ని వదిలి, దుర్యోధనుడి పంచన చేరడం వెనుక ముఖ్య ఉద్దేశ్యమేంటి? పాండవులను తన మాయా జూదంతో ఓడించాల్సిన అవసరం ఏమొచ్చింది? శకుని పన్నాగాల వెనుక దాగిన రహస్యం, శకుని జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటనల గురించి, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

గాంధార రాజైన సుబలుడికి సంతానం, నూరుమంది కుమారులూ, ఒక కుమార్తె గాంధారి. హస్తినాపుర రాజైన ధృతరాష్ట్రుడికి, గాంధారినిచ్చి వివాహం చేయడానికి సుబలుడూ, భీష్ముడూ నిర్ణయించారు. అయితే, ధృతరాష్ట్రుడు అంధుడన్న విషయాన్ని, భీష్ముడు బయటపెట్టలేదు. గాంధారికి తన జాతకం ప్రకారం, వైధవ్య ప్రాప్తి ఉంది. అందుకుగానూ, సుబలుడు ముందుగా తనకు మేకనిచ్చి వివాహం చేసి, ఆ తరువాత ధృతరాష్ట్రుడికిచ్చి, వివాహం జరిపించాడు. గాంధారి కూడా తన భర్తననుసరిస్తూ, జీవితాంతం గ్రుడ్డి దానిలాగే బ్రతికింది. గాంధారికి కూడా, నూరు మంది కుమారులూ, ఒక కుమార్తె సంతానంగా కలిగారు. అంతా సజావుగా నడుస్తున్న సమయంలో ఒకనాడు, దుర్యోధునుడు పాండవులను చూసి, ‘క్షేత్రజులంటే, తండ్రికి కాక వేరేవాళ్లకు పుట్టినవాళ్లు’ అని హేళన చేశాడు. దానికి ఆగ్రహించిన పాండవులు, ‘మీరు గోళకులు, అంటే విధవకు పుట్టిన వారు’ అని ఎద్దేవా చేశారు. అది విన్న దుర్యోధనుడు ఆశ్చర్యపడి, అసలు విషయాన్ని ఆరా తీశాడు.

తన తల్లికి ముందుగా మేకతో వివాహం చేశారని తెలిసి, ఆగ్రహంతో, గాంధార రాజ్యంపై దండెత్తాడు. వారిని ఓడించి, అందరినీ కారాగారంలో వేసి, అనేక రకాలుగా శిక్షించాడు. సుబలుడికీ, తన నూరు మంది కుమారులకీ, రోజుకు తలొక మెతుకు చోప్పున ఆహరాన్ని అందించి, చిత్రహింసలు పెట్టిమని కాపలాదారులకు ఆదేశించాడు, దుర్యోధనుడు. అప్పుడు గాంధారి తండ్రి, ‘ఈ రకంగా తినడం వలన ఎవ్వరమూ బ్రతకలేం. అందుకే, అందరి మెతుకులూ కలిపి, ఒక్కణ్నే తినమందాం. కనీసం వాడైనా బ్రతకవచ్చు. దుర్యోధనుడు కనికరిస్తే, బయటపడి, మనందరి తరపునా ప్రతీకారం తీర్చుకోవచ్చు.’ అని సలహా చెప్పాడు. అలా అందరూ కలిసి, తమలో చిన్నవాడైన, అపర మేధావిగా ఖ్యాతి గడించిన శకునిని ఎంచుకుని, అన్నమంతా అతనికే పెట్టారు. తరువాత కొన్నాళ్లకు దుర్యోధనుడు వచ్చి చూసేసరికి, శకుని మాత్రమే మిగిలాడు.

‘ఒక్కడివి ఏం చేయగలవు? వచ్చి మా పంచన పడివుండు.’ అని దుర్యోధనుడు అతన్ని చేరదీశాడు. అలా దుర్యోధనుడి పక్షాన చేరి, తన తెలివితేటలతో మంత్రిగా సలహాలిస్తూ, అతనిలో అహాన్ని రగిలిస్తూ, కురు వంశ నాశనానికి కారకుడయ్యాడు. తన కుటుంబాన్ని క్రూరంగా చంపిన దుర్యోధనుడి వంశాన్ని నాశనం చేసేందుకే, కంకణం కట్టుకున్నాడు శకుని. సుబలుడు చనిపోతూ, తన ఎముకలతో పాచికలు తయారు చేసి, కౌరవుల పతనానికి వాడమని, శకునితో చెప్పాడు. ఆ విధంగానే, తన తండ్రి ఎముకలతో పాచికలను తయారు చేసుకుని, వాటితోనే పాండవులను ఓడించి ఇరువురి మధ్యా నిప్పు రాజేసి, దుర్యోధనుడి పతనానికి పునాది వేసి, ఆనందించాడు. శకుని తన భార్య అర్ష ద్వారా, ఉలుకా, వృకాసురుడూ, వృపర్చితినీ సంతానంగా పొందాడు. ఉలుకుడు, తన తండ్రిని పంతం విడిచి, తమతో పాటు, తమ రాజ్యంలో ఆనందంగా, సకల సౌకర్యాలతో, విలాసవంతంగా జీవించమని అడిగాడు. కానీ శకుని, తన జీవితం కన్నా, కురువంశనాశనమే ముఖ్యమని, వారి మాటను పట్టించుకోలేదు.

శకుని కురుక్షేత్ర యుద్ధంలో వీరోచితంగా పోరాడి, పద్దెనిమిదవ రోజున, పాండవులలో ఒకడైన సహదేవుడి చేతిలో, దారుణంగా మరణించాడు. శకుని కళ్ల ముందే, అతని కొడుకు ఉలూకుణ్ని చంపాడు. శకుని ధనస్సు విరిచాడు. అతను భయంతో పారిపోతూ వుంటే పట్టుకుని, అతని దుర్బుద్ధిని ఎత్తి చూపి, దుర్యోధనుడి ఎదురుగానే, అతని భుజాలు నరికి, ఖడ్గంతో అతని శిరస్సు ఖండించాడు. బాణంతో ఆ శిరస్సును గాలిలో ఎగరవేసి, తన ప్రతీకారాన్ని తీర్చుకున్నాడు, సహదేవుడు. మహా భారతంలో శకుని అంటే, ఒక దుష్టపాత్రగానే అందరూ భావిస్తారు. తన స్వార్థంతో, రెండు వంశాల మధ్య చిచ్చుపెట్టి, కురుక్షేత్ర యుద్ధానికి కారకుడై, కురు వంశ వినాశనానికి మూలమయ్యాడు, శకుని. అయితే, ఇటువంటి వ్యక్తికి కూడా ఆలయం నిర్మించి, ఆదర్శంగా భావించి, నిత్యం పూజించే వారూ ఉన్నారు. కేరళలోని ‘కాలం’ జిల్లాలో, శకునికి గుడి ఉంది. అక్కడి కురవార్ జాతికి చెందిన ప్రజలు, శకునిని భక్తితో కొలుస్తారు.

ఈ ‘మాయమ్‌కొట్టు మలంచరువు మలనాద ఆలయం’, భారతదేశంలో అత్యంత విశిష్ట దేవాలయాలలో ఒకటిగా, పేరొందింది. అయితే, ఈ ఆలయం గర్భగుడిలో, శకుని విగ్రహం ఉండదు. కేవలం అతను కూర్చున్న గ్రానైట్ ముక్క మాత్రమే ఉంటుంది. ఇక్కడకు వచ్చే భక్తులు, ఆచారాలు పాటించడం.. కానుకలు ఇవ్వడం.. మొక్కులు మొక్కడం వంటివేవీ ఉండవు. కేవలం నైవేద్యంగా, లేత కొబ్బరికాయలూ, కొన్ని రకాల స్థానిక ఆహార పదార్ధాలూ అందిస్తారు. పాచికల ఆటలో ఓడిపోయి, ఆ ఆట నిబంధనలలో భాగంగా, అజ్ఞాతంగా నివసిస్తున్న పాండవులను అనుసరిస్తూ వెళ్లిన కౌరవ గుంపులో, శకుని కూడా ఉన్నాడు. ఆ సమయంలో కౌరవులు తమ ఆయుధాలను ఇక్కడే దాచారనీ, అందుకే ఇక్కడ ఆలయం నిర్మించారనీ స్థానికుల కథనం.

అదే విధంగా, ఇక్కడ శకుని కొంతకాలం పాటు ధ్యానం చేసి, తపస్సు చేసినట్లు కూడా చెప్పుకుంటారు. ఈ శకుని దేవాలయాన్ని చూడడానికి, చాలా మంది వస్తుంటారు. పురాణాల్లో దుష్టుడిగా చెప్పబడిన శకునికి పూజలు చేయడం వింతగా అనిపించినా, ప్రజలు ఈ ఆలయాన్ని సందర్శించడానికి ఒక కారణం ఉందని, స్థానికులు అంటున్నారు. శకుని తన పగను నెరవేర్చుకునే క్రమంలో, ఎన్నో అవమానాలు పడ్డాడు. అన్నింటినీ ఓపికగా భరించి, తాననుకున్నది సాధించాడు. అందుకే, అతని సంకల్పానికి నివాళులర్పించడం కోసం, అతని పట్టుదలకు గౌరవసూచికగా, ఈ ఆలయంలో శకునికి నైవేద్యం పెడతారని, అక్కడి వారు చెబుతుంటారు.

మరిన్ని మంచి వీడియోస్ తో, మళ్ళీ మీ ముందుకు వొస్తాను. మరి ఆ వీడియోలు మిస్ కాకూడదనుకుంటే, మన ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేసుకోండి. అలాగే, వీడియోస్ ని లైక్ అండ్ షేర్ చెయ్యడం మరచిపోకండి.. మీకు తెలిసిన, తెలుసుకోదలచిన విషయాలను, క్రింద కామెంట్ బాక్స్ లో, తప్పక తెలియజేయండి.

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes