అరుణాచలం గురించి ఆశ్చర్యకర నిజాలు! History of Arunachalam


ఈ పౌర్ణమి రోజు అరుణాచలంలో గిరి ప్రదక్షిణం అద్భుతమే 🙏 మానసిక దర్శనం కోసం చూడండి..

భూరంభాంస్యనలో‌உనిలో‌உంబర మహర్నాథో హిమాంశుః పుమాన్
ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకమ్ |
నాన్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్పరస్మాద్విభో
తస్మై గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ||

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/PRr5MjGOg_g ]

జగద్గురు శ్రీ ఆది శంకరాచార్య విరచిత శ్రీ దక్షిణామూర్తి అష్టకంలోని ఒక పద్యమిది. దీని అర్థమేమిటంటే, జగమంతా నిబిడికృతమైన శివచైతన్యం, కంటికి కనబడే అష్టమూర్తితత్వంగా ప్రకాశిస్తుందని, వేదాల నుంచి జగద్గురువుల వరకూ, ఈ శివ శక్తిని అష్ట శివ స్వరూపాలుగా పేర్కొన్నారు. పంచభూతాలూ, సూర్య చంద్రులూ, జీవుడూ, ఈ ఎనిమిది శక్తులలో, శివతత్వం ఐక్యమై ఉంటుందని, మన పురాణాలు బోధిస్తున్నాయి. అందుకే ఆ చితాభస్మధారి, ఎనిమిది చోట్ల ఎనిమిది స్వరూపాలుగా దర్శనమిస్తున్నాడు. శ్రీకాళహస్తిలో వాయులింగంగా, జంబుకేశ్వరంలో జలలింగంగా, చిదంబరంలో ఆకాశలింగంగా, అరుణాచలంలో అగ్నిలింగంగా, కంచిలో పృథ్వీ లింగంగా, కోణార్క్ లో సూర్య లింగంగా, సీత కుండంలో చంద్రలింగంగా, ఖాట్మండులో యాజమానలింగంగా ప్రసిద్ధిచెందాడు. వీటిలో, అరుణాచలంలో కొలువైన అరుణాచలేశ్వరుడు, అగ్నిలింగంగా పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ అరుణాచలేశ్వరుణ్ణి అగ్నిలింగంగా ఎందుకు పేర్కొంటున్నారు? ఆ ఆలయ విశిష్ఠతల గురించి, ఈ వీడియోలో తెలుసుకుందాం.

ఈ క్షేత్ర మహిమ పురాణ ప్రసిద్ధం. శివ పురాణం, స్కాంద పురాణం, లింగ పురాణాల్లోనే కాకుండా, ఋగ్వేద, అధర్వణ వేద మంత్రాల్లో కూడా, అరుణాచల ప్రసక్తి ఉంది. కొన్ని ఉపనిషత్తులూ, సంహితలూ, అరుణాచల మాహాత్మ్యాన్ని ప్రశంసించాయి. సకల జనులకూ పరమ పుణ్యధామంగా భాసిల్లుతోంది అరుణాచల క్షేత్రం. అక్కడ స్వామిని, అగ్నిలింగంగా పేర్కొనడానికి, స్కాంద పురాణంలో ఈ విధంగా వివరించబడి ఉంది. సకల జీవుల జన్మ చరితార్థకం చేసుకునే రాశీభూతమైన జ్ఞానాగ్ని, ఆ లింగం నుండి నిత్యం ప్రసరిస్తుంటుంది. జీవకోటి యాత్రలో, అరుణాచల దర్శనం, అజ్ఞానమనే గీతను దాటి పరిపూర్ణ జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అందుకే, జీవి జీవన యానంలో, అరుణాచల ప్రవేశం జరిగిందా లేదా? అని చూడబడుతుందని వివరించబడింది. కానీ, ఆ అరుణాచలేశ్వరుని దర్శన భాగ్యం కలగాలంటే, ఈశ్వరానుగ్రహం తప్పనిసరని, పెద్దలు చెబుతుంటారు. పూర్వం కవిసార్వభౌముడు శ్రీనాథ మహాకవి, కాశీ ఖండం అనే గ్రంథాన్ని రాయదలచి, ఆ పరమ శివుణ్ణి స్మరించిన సమయంలో, సాక్ష్యాత్ ఆ విశ్వేశ్వరుడు, శ్రీనాథుడితో ఇలా పలికాడు.

దర్శనాత్ అబ్రసదసి, జననాత్ కమలాలయే 
స్మరణాత్ అరుణాచలే, కాశ్యాంతు మరణాన్ ముక్తి:

స్వయంగా పరమేశ్వరుడు పలికిన ఈ మాటలను, శ్రీనాథుడు కాశీ ఖండంలో పొందుపరిచనట్లు చరిత్ర చెబుతోంది. ఇంతటి ప్రాశస్త్యం కలిగిన అరుణాచలశ్వేరుణ్ణి దర్శించుకుంటే, కోటిజన్మల పాపాలు పోయి, జ్ఞానమార్గమును పొంది, శివ సాయుజ్యం కలుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. స్థల పురాణం ప్రకారం, పూర్వం ఒకానొక సమయంలో, బ్రహ్మా, విష్ణువులకు ఎవరు గొప్ప అనే విషయంపై తగదా వచ్చి, అది పెద్ద జగడంగా మారింది. వీరిమధ్య జరిగే కలహాన్ని పొగొట్టడానికి, పరమేశ్వరుడు వారివురి మధ్యా, అఖండ జ్యోతిర్లింగంగా ఆవిర్భవించి, తన లింగం యొక్క ఆదీ, అంతం  కనుగొనమని వారికి పరీక్షపెట్టాడు. దాంతో విష్ణువు ఆ లింగం మూలాలు తెలుసుకోదలచి క్రింది వైపుకు వెళ్ళగా, బ్రహ్మ అంతం కనుగొనడానికి పైకి ప్రయాణించాడు. అలా వారివురూ కొన్ని సంవత్సరాలపాటు ప్రయాణించినా, ఎటువంటి ఫలితం లేకపోవడంతో, విష్ణువు తనకు ఆవహించిన అహం అనే మాయలోంచి బయటపడి, లింగం యొక్క ఆది కనుగొనలేకపోయానని ఒప్పుకోగా, బ్రహ్మ మాత్రం, పైకి వెళుతున్న సమయంలో ఎదురైన మొగలిపువ్వు, కామధేనువులతో తిరిగి వచ్చి, తాను లింగం యొక్క అంతం చూశానని చెప్పగా, దానికి మొగలిపువ్వు అవునని సాక్ష్యం చెప్పింది. ఆవు మాత్రం, తలతో అవుననీ, తోకతో కాదనీ పలికింది.

ఈ తతంగాన్ని మొత్తం పరిశీలిస్తున్న శివునికి కోపం వచ్చి, అబద్ధం పలికిన బ్రహ్మకు, భూలోకంలో పూజా విధులుండవని శపించి, మొగలిపువ్వును పూజలలో వాడరాదని నిషేధించాడు. ఆవుకు మాత్రం, తల అబద్ధం చెప్పినందుకు, దాని తలకు నమస్కరించరాదనీ, తోక నిజం చెప్పిన కారణంగా, అక్కడే పూజించాలని శాసించాడు. దాంతో బ్రహ్మకు జ్ఞానోదయమై, శివుణ్ణి ఈ విధంగా ప్రార్థించాడు. “పరమేశ్వరా, నీ జ్యోతిర్లింగంతో నా అహంకార, అజ్ఞానాంధకారాలను తొలగించి, వెలుగులు చిమ్మే జ్ఞానాగ్నిని ప్రసాదించావు. కావున, ఈ సంఘటనకు భూలోకంలో ప్రాచుర్యం కల్పించేలా, సకల జనులకూ జ్ఞానాన్ని అందించే అగ్నిలింగంగా, నీవు భూలోకంలో కొలువుదీరాలి.” అని కోరాడు. బ్రహ్మ కోరికను మన్నిస్తూ, ఆ లయకారుడే అగ్నిలింగంగా, అరుణాచలంలో వెలసి, సకల జనులకూ జ్ఞానాగ్ని కాంతులను ప్రసరింపజేస్తున్నాడు. శివుడు అగ్నిలింగంగా ఆవిర్భవించిన సమయం, మాఘ కృష్ణ చతుర్దశి, అర్ధరాత్రి. ఆ రోజును మహా శివరాత్రి పర్వదినంగా యావద్భారతదేశం పాటిస్తుంది. ఆ రోజున దివారాత్రాలు, అసంఖ్యాకంగా భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తారు. రోజంతా అరుణాచలేశ్వరునికి అభిషేకాలు, అర్చనలు నిరంతరాయంగా జరుగుతాయి.

అర్ధరాత్రి లింగోద్భవ సమయంలో, ఒక్కసారిగా గుడిలోని గంటలన్నీ మ్రోగుతాయి. శంఖనాదాలు మిన్నుముడతాయి. కర్పూర హారతి ప్రకాశిస్తూ, ఆకాశంలో పున్నమి చంద్రుడి వెన్నెలను భాసింపజేస్తుంది. ‘‘అరుణాచల శివా!’’ అనే శరణు ఘోష, దశదిశలా ప్రతిధ్వనిస్తుంది. అరుణాచలేశ్వరునీ, అపీత కుచాంబనూ దర్శించి, భక్తులు తన్మయులవుతారు. అరుణ గిరినే, సోణాద్రిగా, అరుణాచలంగా పేర్కొంటారు. అచలం అంటే కొండ అని అర్థం. ఆ కొండ క్రింది భాగాన్ని, అరుణాచల పాదములని పిలుస్తారు. ఎన్నో ఔషధ మొక్కలతో నిండి ఉండే ఆ కొండ చుట్టుకొలత, 14 కిలోమీటర్లుంటుంది. ఇంతటి మాహాత్మ్యం కలిగిన కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తే, సకల పాపాలూ తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే, ప్రతిరోజూ కొన్ని వేలమంది భక్తులు, అరుణాచలం కొండ చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ప్రత్యేకంగా పౌర్ణమి నాడు, పుణ్యపురుషులూ, ముక్కోటి దేవతలు సైతం, ఇక్కడ గిరి ప్రదక్షిణం చేస్తారని భక్తుల నమ్మిక. అరుణగిరి చుట్టూ, యమ, కుబేర, ఇంద్రాది దేవతలు ప్రతిష్ఠించిన 8 లింగాలను దర్శించవొచ్చు.

భగవాన్ రమణ మహర్షి వంటి ఎంతో మంది రుషులూ, మహర్షులూ, యోగి పుంగవులూ అరుణాచలేశ్వరుణ్ణి దర్శించుకుని, అక్కడ తపస్సిద్ధి పొందినట్లు, అనేక ప్రామాణిక ఆధారాలున్నాయి. అరుణాచలం కొండవద్ద ఒక  రహస్య గుహ ఉందనీ, దానిలో పెద్ద మర్రిచెట్టు క్రింద, సాక్ష్యాత్ దక్షిణామూర్తి కూర్చొని ధ్యానం చేసుకుంటారనీ, అక్కడి ప్రజలు చెబుతుంటారు. ఆ గుహ లోపలికి వెళ్ళడానికి ఎంతో మంది ప్రయత్నించారు గానీ, ఎవ్వరికీ సాధ్యపడలేదు. ఆఖరికి రమణ మహర్షి కూడా ఒకసారి, ఆ గుహలోకి వెళ్ళడానికి ప్రయత్నించారు. అయితే, కొంత దూరం వెళ్ళేటప్పటికి పరిస్థితులు సహకరించకపోవడంతో, ఆయన వెనుదిరిగి వచ్చేశారని చెబుతారు. అరుణాచలంలో పరమేశ్వరుడు లింగాకారంలో వెలసిన తరువాత, ఆ క్షేత్ర నిర్మాణం, అక్కడ జరగాల్సిన పూజాధికాలనూ, గౌతమ మహర్షి స్వయంగా నిర్ధేశించారు. నేటికీ ఆయన శాసించిన ప్రకారమే, అక్కడ పూజలూ, వేడుకలూ జరుగుతుంటాయి. ఈ ఆలయంలో ఉండే ఇప్పచెట్టుకి ఎంతో ప్రాశస్త్యముంది. ఆ ఇప్పచెట్టునే, అరుణాచల స్థల వృక్షంగా పేర్కొంటారు. ప్రధాన ఆలయానికి దక్షిణాన, ఆ ఇప్పచెట్టుంటుంది. ఆ చెట్టు క్రింద ఎంతో మంది యోగులు తపస్సు చేసినట్లు, స్థల పురాణం చెబుతోంది. ఈ ఆలయంలో పార్వతీ దేవి, అపీతాకుచాంబిక అనే పేరుతో పిలవబడుతుంది. ఈ క్షేత్రం లోపలికి వెళ్ళగానే, మొదట సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం కనబడుతుంది. ప్రధాన ఆలయం లోపలికి వెళ్ళేముందు, నందీశ్వరుడి విగ్రహం, మహాకాయుడిగా దర్శనమిస్తుంది. ఈ బసవన్నను, మొదటి నందీశ్వరునిగా పిలుస్తారు. ఆ నందీశ్వరుణ్ణి దర్శించుకుని ముందుకు వెళితే, అరుణాచలేశ్వరుడు లింగాకారంలో కొలువై ఉంటాడు. ఆ స్వామి గర్భాలయంలోపల, చాలా వేడిగా ఉంటుంది.

ఆలయం వెలుపల ఎటువంటి వాతావరణ పరిస్థితులున్నా, గర్భగుడి మాత్రం ఎప్పుడూ చాలా వేడిగా ఉండి, అక్కడికి వెళ్ళిన వారికి చెమటలు పడుతుంటాయి. ఇదొక వింతగా అక్కడి వారు పేర్కొంటారు. ఈ ఆలయంలో మూడు ఉత్సవాలను నిర్వహిస్తారు. వాటిలో, కార్తీక మాసంలో వచ్చే కార్తీక దీపోత్సవం చూడడానికి, రెండు కళ్లూ చాలవని, ఆ ఉత్సవాన్ని దర్శించిన వారు చెబుతుంటారు. ఇక మరో మహత్తర ఉత్సవం, ప్రణయకాల మహోత్సవం. ఈ ఉత్సవాన్ని చూడడానికి, ప్రపంచం నలుమూలల నుండీ, కొన్ని లక్షలమంది భక్తులు, అరుణాచలానికి తరలివస్తారు. అరుణాచలంలో ముఖ్యంగా చెప్పుకోదగ్గ వాటిలో, ఆలయ గోపురాలు, ముందు వరుసలో ఉంటాయి. వీటిలో తూర్పు వైపు గోపురాన్ని, శ్రీ కృష్ణ దేవరాయల వారు, అత్యంత సుందరంగా నిర్మింపజేశారు. ఉత్తరం వైపు గోపురాన్ని, ఆ పరమేశ్వరుని మహా భక్తురాలైన, అమ్మణ్ణి అమ్మాన్ అనే మహిళ కట్టించింది. ఈ గోపుర నిర్మాణం వెనుక ఒక కథ కూడా ప్రచారంలో ఉంది. ఆ మహేశ్వరునిపై ఉన్న భక్తితో, అరుణాచలాన్ని దర్శించిన ఆ భక్తురాలు, క్షేత్రానికి ఉత్తరమున ఓ గోపురాన్ని కట్టించాలనుకుంటున్నాననీ, అయితే, తాను కడుబీదరాలిననీ, అందువలన పుర ప్రజల వద్ద చందా అడిగి, అలా వచ్చిన డబ్బుతో గోపురం కడతానని మొక్కుకుంది. ఆ విధంగా ఆవిడ అందరి ఇంటికీ తిరిగి, చందాలడిగేది. ఎవరైనా తమ వద్ద డబ్బులు లేవని అబద్ధమాడితే, వారింట్లో ఉండే అణాపైసలతో సహా, ఎంత సొమ్ముందో చెప్పేసేదట. అందువల్ల, ఆమె ఇంటి ముందుకు రాగానే, ఆ ఇంటి వారు పరుగు పరుగున వచ్చి, డబ్బు విరాళంగా ఇచ్చేవారట. అలా వచ్చిన డబ్బుతో, ఆమె ఉత్తర గోపురాన్ని కట్టించింది. ఇక్కడున్న మరో గోపురాన్ని, భల్లాల మహారాజు కట్టించారు. దీనిని కిలి గోపురం అని పిలుస్తారు. భల్లాల మహారాజుపై ఒక గాథ ప్రాచుర్యంలో ఉంది. ఆయన మహా శివ భక్తుడు. అయితే, భల్లాల మహారాజుకి సంతానం లేకపోవడంతో, శివ భక్తులు ఎవరు వచ్చి ఏదడిగినా, లేదనకుండా ఇచ్చేశేవాడు. ఒకనాడు అతడి దాన నిష్ఠను పరీక్షించడానికి, కొంతమంది జంగమదేవరలను వెంటబెట్టుకుని, సాక్షాత్ పరమేశ్వరుడే, ప్రధాన జంగమ దేవరగా, భల్లాల మహారాజు వద్దకు వచ్చాడు.

అలా వచ్చిన వారందరికీ, ఆ రాజు అతిథి సత్కారాలు చేశాడు. అయితే, ఆ సత్కారాల తరువాత, తమ వద్దకు దేవదాసీలను పంపాలని కోరారు, జంగమ దేవరలు. ఆ కోరిక మేరకు, రాజు అందరి వద్దకూ దేవదాసీలను పంపగా, ప్రధాన జంగమదేవర వద్దకు పంపేందుకు, దేవదాసీలు లేకపోవడంతో, రాజు రెండవభార్య, తానే దేవదాసీగా వెళతానని, ఆయన ఉండే గదిలోకి వెళ్ళి, నిద్రపోతున్న ఈశ్వరుణ్ణి తాకగానే, చిన్నపిల్లవాడిలా మారిపోయాడు, మారువేషంలో ఉన్న ఆ పరమేశ్వరుడు. ఈ వింతకు ఆశ్చర్యచికితురాలైన రాజు భార్య, వెంటనే ఆ పిల్లవాడితో రాజు వద్దకు వచ్చి, జరిగినది చెప్పి, రాజు చేతిలో ఆ పిల్లవాడిని పెట్టగానే, అతడు మాయమై, అశరీరవాణిగా ఇలా పలికాడు.. “ఓ మహా రాజా, నీకు పిల్లలు లేరనే చింతను విడిచి, నా సేవ చేసుకో. నీవు మరణించిన తరువాత, స్వయంగా నేనే వచ్చి, నీకు తల కొరివి పెడతాను” అని చెప్పాడు. ఇచ్చిన మాట ప్రకారం, భల్లాల దేవ మహారాజు మరణించిన తరువాత, సాక్ష్యాత్ ఆ పరమేశ్వరుడే వచ్చి, తలకొరివి పెట్టాడు. నేటికీ భల్లాల మహారాజు చనిపోయిన రోజున, ఆయన మరణ వార్తను స్వామి వారి ముందు చదువుతారు. అనంతరం, గర్భగుడి తలుపులు మూసివేసి, పార్వతీ సమేత స్వామివారి ఉత్సవమూర్తులను, భల్లాల మహారాజు రాజధానిగా పాలించిన పల్లికట్టుకి తీసుకువెళ్తారు. అక్కడ ఉత్సవ మూర్తలకు స్నానం చేయించి, భల్లాలమహారాజుకు ఆబ్దికం పెట్టి, తిరిగి ఆలయానికి తీసుకువస్తారు. ఆ తరువాత స్వామివారికి అభిషేకం చేసి, దర్శనానికి అనుమతిస్తారు. ఈ విధంగా సాక్షాత్ పరమేశ్వరుడే, తన భక్తుడికి తద్దినం పెడుతున్న ఏకైక క్షేత్రంగా, అరుణాచలం, మహత్తర ఖ్యాతి పొందింది. ఆ స్వామిని నిష్కల్మషంగా, భక్తితో పూజిస్తే, ఆ ఆదిదేవుడు తన భక్తుడి కొరకు ఏమైనా చేస్తాడనడానికి, ఇదొక నిదర్శనంగా భక్తులు చెబుతారు.

శుభం భూయాత్!

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes