బ్రాహ్మీ ముహూర్తం! | Brahma Muhurta – The Time to Create Yourself


బ్రాహ్మీ ముహూర్తం!

సూర్యోదయానికి ముందే నిద్రలేవాలని, మన పెద్దవాళ్లు పదేపదే చెప్పేవారు! తరాలు మారుతున్న కొద్దీ, జీవవనశైలి మారిపోతోంది. నిద్రలేచే సమయాలూ, పనిచేసే వేళలూ మారిపోతున్నాయి. ఇప్పటికే పని చేయడానికీ, నిద్రపోవడానికీ, రాత్రీ పగలుతో సంబంధమే లేకుండా పోయింది. కానీ, ఇప్పటికీ బ్రాహ్మీముహూర్తం అన్న మాట, అక్కడక్కడా వినిపిస్తూనే ఉంటుంది. ఇంతకీ ఆ బ్రాహ్మీముహూర్తం అంటే ఖచ్చితంగా ఏ సమయంలో వస్తుంది? ఆ సమయంలో నిద్రలేవడం వల్ల ప్రయోజనాలేంటి - అనేటటువంటి ఆసక్తికర విషయాలు తెలుసుకోవడానికి, ఈ వీడియోను పూర్తిగా చూడండి..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/bqar6jXtHjc ]

సూర్యోదయానికి 96 నిమిషాల ముందున్న కాలాన్ని, బ్రాహ్మీముహూర్తం అంటారు. అయితే, రుతువుని బట్టి, సూర్యోదయ వేళలు మారిపోతూ ఉంటాయి కాబట్టి, తెల్లవారుజామున 4:00 నుంచి 4:30 సమయాన్ని, బ్రాహ్మీముహూర్తంగా అనుకోవచ్చు. బ్రాహ్మీ అంటేనే సరస్వతి అని అర్థం. మన పెద్దలు చాలా ఆలోచించే, ఆ పేరు పెట్టారేమో అనిపిస్తుంది. ఈ సమయంలో నిద్రలేవడం వల్ల ఉపయోగం ఏంటి? అని అడిగే ప్రశ్నకు చాలానే జవాబులున్నాయి.

ఆ సమయంలో ప్రకృతి మొత్తం ప్రశాంతంగా, నిద్రలోని ఆఖరి జామును గడుపుతూ ఉంటుంది. సూర్యుని వేడి భూమిని కొద్దికొద్దిగా తాకుతూ ఉంటుంది కానీ, వెలుతురు ఇంకా మనల్ని చేరుకోదు. అంటే, రాత్రివేళ చల్లదనాన్నీ, పగటివేళ చురుకుదనాన్నీ ఏక కాలంలో కలిగిఉండే సమయం ఇదన్నమాట! అందుకే ఈ సమయంలో, మనుషులు సత్వగుణం ప్రధానంగా ఉంటారని చెబుతారు. లేలేత కిరణాలు శరీరాన్ని తాకడం చాలా మంచిదని, వైద్యులు కూడా చెబుతున్నారు కాబట్టి, ఉదయాన్నే లేచి, కాలకృత్యాలు తీర్చుకుని, సూర్యనమస్కారాలు చేయడమో, వ్యాహ్యాళికి వెళ్లడమో చేస్తే, ఆరోగ్యానికి చాలా మంచిది.

మనలో, జీవ గడియారం అనేది ఒకటి ఉంటుంది. అది మనం ఏర్పరుచుకున్న అలవాట్లను బట్టీ, ప్రకృతిని బట్టీ నడుచుకుంటూ ఉంటుంది. నిద్రపోవడం, లేవడం, కాలకృత్యాలు తీర్చుకోవడం, ఇవన్నీ సమయానుకూలంగా చేస్తేనే, ఆరోగ్యంగా ఉంటాం. సాక్షాత్తూ ఆయుర్వేదమే, తన ఆరోగ్యాన్నీ, ఆయుష్షునూ కాపాడుకోవాలనుకునేవాడు, బ్రాహ్మీముహూర్తంలో లేవాలని చెబుతోంది. పైగా, ఆయుర్వేదం ప్రకారం, ఈ సమయం, `వాత` ప్రధానంగా ఉంటుంది. శరీరంలోని కదలికలనీ, ఆలోచనలనీ, రక్త ప్రసరణనీ ప్రభావితం చేసేది, ఈ `వాత` లక్షణం. ఈ లక్షణం మన శరీరంలో ప్రముఖంగా ఉన్నప్పుడు, మనం ఎలాంటి పనినైనా చురుగ్గా చేయగలం, ప్రశాంతంగా ఉండగలం, మంచి ఆలోచనలు చేయగలం, చదివిన దానిని ఆకళించుకుని, దీర్ఘకాలం జ్ఞాపకం ఉంచుకోగలం.

అలాగే, ఉదయం వేళ, మనలో కార్టిసోల్ హార్మోన్ ఎక్కువ మోతాదులో విడుదలవుతుంది. ఈ హార్మోన్, మనలోని ఒత్తిడిని తగ్గిస్తుంది, అలాగే జ్ఞాపకశక్తిపై ప్రభావం చూపుతుంది. అందుకే, పిల్లలు బ్రహ్మీ ముహూర్తంలో చదువుకుంటే, చక్కగా గుర్తుంటుంది. ముఖ్యంగా ముందు రోజు భరించిన ఒత్తిడులన్నీ నిద్రలో మరచిపోతాం కాబట్టి, మెదడు ఉత్తేజంతో ఉంటుంది. ధ్యానం చేయాలనుకునేవారికి కూడా, ఈ సమయం చాలా అనుకూలమని, యోగశాస్త్రం చెబుతుంది. మన శరీరంలో, ఇడ, పింగళ, సుషుమ్న నాడులు ఉంటాయని, యోగుల నమ్మకం. బ్రాహ్మీముహూర్తంలో, సుషుమ్న నాడి చాలా ఉత్తేజితంగా ఉండి, ధ్యానం చాలా సులువుగానూ, ప్రభావవంతంగానూ సాగే అవకాశం ఉంటుందని చెబుతారు.

ఉదయాన్నే మన శరీరంలోనూ, చుట్టూ ఉన్న ప్రకృతిలోనూ ఉండే ప్రశాంతత వల్ల, యోగా, ధ్యానం, చదువూ, చాలా తేలికగా, ప్రభావవంతంగా సాగుతాయి. ఉద్యోగం, స్కూలు, కాలేజీ, వంటావార్పూ వంటి రోజువారీ చేయాల్సిన విధులకు ముందు, తగిన సమయం కూడా చిక్కుతుంది. అలా కాకుండా, ఆలస్యంగా లేచి, ఒక్కసారిగా మన పనులలో చేరేందుకు పరిగెత్తడం వల్ల, మన మనస్సూ, శరీరం, విపరీతమైన ఒత్తిడికి లోనవుతాయి.

గుండె జబ్బులున్నవారికి, తెల్లవారు జామునే గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందనీ, పైగా అలా వచ్చే గుండెపోటు చాలా తీవ్రంగా ఉంటుందనీ, వైద్య గణాంకాలు సూచిస్తున్నాయి. గుండెల్లో రక్తనాళాలను గడ్డకట్టించే `థ్రోంబస్‌` అనే సమస్య, ఉదయం వేళల్లోనే ఎక్కువగా ఉంటుందట. ఇలా ఎందుకు జరుగుతుందనే దానికి, ఖచ్చితమైన కారణాలు ఏవీ చెప్పలేకపోతున్నారు, వైద్యులు. పైగా, ఇదే సమయంలో, మనం హడావుడిగా లేచి, విధుల్లోకి చేరాలనే టెన్షన్‌లో, మనలోని రక్తపోటు మరింత ఎక్కువై, అది గుండెపోటుకు దారితీసే అవకాశాలు, ఎక్కువగా ఉంటాయి. అయితే, బ్రాహ్మీముహూర్తంలోనే నిద్రలేచి, వీలైతే కాసేపు ధ్యానం చేసుకుని, స్థిమితంగా రోజువారీ పనులకి సిద్ధపడితే, మన రక్తపోటు కూడా సాధారణంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇన్ని చదివిన తరువాత కూడా, బ్రాహ్మీముహూర్తంలో లేవడాన్ని ఛాదస్తం అని వాదించేవారు మూర్ఖులే!

🚩 శ్రీ మాత్రే నమః 🙏

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes