బోయవాడు 'వాల్మీకి మహర్షి' ఎలా అయ్యాడు? Story of Valmiki in Telugu


బోయవాడు 'వాల్మీకి మహర్షి' ఎలా అయ్యాడు?

మనిషై పుట్టినవాడు కారాదు మట్టిబొమ్మ.. పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ.. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు.. తరతరాలకీ తరగని వెలుగవుతారు.. ఇలవేలుపులవుతారు! అన్న వేటూరి పదాలకు స్ఫూర్తి, ఆదికావ్యమైన రామాయణాన్ని రచించిన వాల్మీకి మహర్షిగా మారిన బోయవాడు.

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/ceNwjWyMyeg ]

కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరమ్, 

ఆరుహ్య కవితాశాఖామ్, వందే వాల్మీకి కోకిలమ్ |

వాల్మీకేర్ముని సింహస్య కవితా వనచారిణః 

శృణ్వన్ రామకథా నాదం కోనయాతి పరాంగతిమ్ ||

వేద వేద్యుడైన పరంధాముడు, దశరథాత్మజుడైన శ్రీరాముడుగా అవతరించగా, నాదాత్మకమైన వేదం, రసాత్మకమైన రామాయణ మహాకావ్యంగా ఆవిర్భవించింది. భారతీయ సంస్కృతికీ, ధార్మిక జీవన విధానానికీ మణి దర్పణం 'రామాయణం'. వేదాంత దర్శనంగానూ, ధర్మ ప్రబోధకంగానూ, ఇహపర సాధకంగానూ, జన జీవితాన్ని ప్రభావితం చేసేదిగానూ అందించబడింది, శ్రీరామకథ.

త్రేతాయుగంలో, గంగా తీరంలోని నైమిశారణ్యంలో, అనేక మంది మునులు ఆశ్రమాలు నిర్మించుకుని, నిష్ఠతో తపస్సు చేస్తూండేవారు. అందులో ఒకరైన ప్రచేతసుడనే ముని కుమారుడు, ప్రాచేతసుడు. ఒకరోజు ఆడవిలో ఆడుకుంటూ దారితప్పి, ఎటుపోవాలో తెలియక, భయంతో ఏడుస్తున్న ప్రాచేతసుడిని, ఆ దారిలో ప్రయాణిస్తున్న ఓ వేటగాడు చూశాడు. ఆ ముని కుమారుని ఓదార్చి, తనతోపాటు తీసుకుపోయిన బోయవాడు, తన కొడుకుగా పెంచుకున్నాడు. తమ కుమారుడు అడవిలో ఏ క్రూర మృగాల బారినో పడి, మరణించి ఉంటాడని, ప్రచేతసుడు భావించాడు. బోయవారి ఇంట పెరిగిన ప్రాచేతసుడు, విలువిద్యలో ప్రావీణ్యం సంపాదించాడు. యుక్త వయస్సుకు వచ్చిన ప్రాచేతసుడికి, ఓ కన్యతో వివాహం జరిపించారు. వీరికి ముగ్గురు సంతానం కలిగారు. వారితో పాటు, తల్లి దండ్రులను పోషించడానికి సంపాదన చాలక, దారి దోపిడీలూ, దొంగతనాలనూ వృత్తిగా చేసుకుని, కొన్ని సందర్భాల్లో బాటసారులను చంపడానికి కూడా వెనుకాడేవాడు కాదు. అలాంటి పరిస్థితులలో, అడవిలో బాటసారుల కోసం ఎదురుచూస్తున్న సమయాన, నారద మహర్షి, ఓ సాధారణ మావన రూపంలో, ఆ దారి వెంట వచ్చాడు. ఆయనను దోచుకోవడానికి ప్రాచేతసుడు ప్రయత్నిస్తే, తన దగ్గర వీణ, రుద్రాక్షలు, కాషాయ వస్త్రాలు తప్ప, ఏమీ లేవన్నా వినిపించుకోకుండా, చంపుతానంటూ భయపెట్టాడు. నీవు ఇన్ని పాపకార్యాలు ఎవరికోసం చేస్తున్నావని నారదుడు ప్రశ్నించగా, తన కుటుంబం కోసమని ప్రాచేతసుడు బదులిచ్చాడు. 'పోషణ కోసం నాకు తెలిసిన విద్య ఇదొక్కటే.. పాప పుణ్యాలు నాకు తెలియవ'ని అన్నాడు.

ప్రాచేతసునికి జ్ఞానోదయం కలిగించడానికి, నారదుడు ఓ ఉపాయం పన్నాడు. 'ఓ బోయవాడా, నీవు చేసే ఈ పాపాల్లో, నీ కుటుంబ సభ్యులు ఎవరైనా భాగం పంచుకుంటారేమో అడిగి తెలుసుకో', అని తనతో పాటు ఇంటికి వెళ్లాడు. 'నేను చేస్తున్న పాపాల్లో, మీరు కూడా భాగస్వాములే కదా?' అని తల్లి దండ్రులూ, భార్యా బిడ్డలను ప్రశ్నించగా, వారు దానికి సమ్మతించలేదు సరికదా, కుటుంబ పోషణ ఇంటి యజమాని బాధ్యత అనీ, పాప, పుణ్యాలు ఒకరి నుంచి ఇంకొరికి ఇవ్వలేమూ, తీసుకోలేమూ.. అని బదులిచ్చారు.

వారి మాటలతో పశ్చ్యాత్తాపం చెందిన ప్రాచేతసుడు, పాప విముక్తి కలిగించమని, నారదుని వేడుకున్నాడు. అప్పుడు నారదుడు తన నిజస్వరూపాన్ని చూపించి, భక్తి మార్గానికి 'రామ' అనే రెండక్షరాల తారక మంత్రాన్ని ఉపదేశించాడు. అప్పటి నుంచి, నైమిశారణ్యంలో, రామ మంత్రాన్ని జపిస్తూ, కొన్నేళ్లు తపస్సు చేశాడు. తపస్సులో కూర్చున్న ప్రాచేతసుడి చుట్టూ, వల్మీకములు మొలిచాయి. అలా పుట్టలో కొన్నేళ్లు గడిచిన తర్వాత, బక్క చిక్కి, బయటి ప్రపంచంతో సంబంధం లేని ఆ ప్రాచేతసుని చెవిలో, 'రామ రామ రామ' అంటూ నారదుడు మూడుసార్లు పలికాడు. ఆ తారక మంత్రాన్ని విన్నంతనే, ప్రాచేతసుడు తపస్సు నుంచి బయటకు వచ్చాడు. 'ప్రాచేతసా, నీవు గొప్ప తపశ్సాలివి అయ్యావు.. దేవుడు నిన్ను కరుణిచాడు.. నీవు మళ్ళీ జన్మించావు.. వల్మీకము నుంచి పుట్టావు కాబట్టి, నీవు వాల్మీకి నామంతో, లోక కల్యాణం కోసం ఓ గొప్ప కావ్యాన్ని రచిస్తావు' అని నారదుడు దీవించి, అదృశ్యమయ్యాడు.

తమసా నది ఒడ్డున, రామచంద్రుని గురించి తలచుకుంటూ ఉండగా, ఒక క్రౌంచ పక్షుల జంటలో, మోహితమైన మగ పక్షిని, ఒక బోయవాడు, బాణంతో చంపాడు. ఆడపక్షి దిక్కుతోచక విలపిస్తోంది. ఆ దృశ్యాన్ని చూసి, విచలితమైన మనస్సుతో ఉన్న వాల్మీకి మహర్షి నోట, ఛందోమయంగా ఉన్న శ్లోకం వెలువడింది. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, వాల్మీకి మహర్షి నోట వెలువడిన మాటలు, అత్యంత ఛందోబద్ధమైన, మహిమాన్వితమైన శ్లోకమనీ, శ్రీరామ కథను అదే ఛందస్సులో వ్రాయమనీ చెప్పాడు. నారద మహర్షీ, బ్రహ్మదేవుల ప్రేరణా, ఆశీస్సులతో, ప్రేమ, కరుణ, జాలితో కూడిన హృదయ స్పందనతో, ధర్మ ప్రచారంగా, అంతర్గత చైతన్యం పలికించగా, ఆచంద్ర తారార్కం వర్థిల్లేటట్లుగా, శ్రీమద్రామాయణ మహా గ్రంథాన్ని రచించాడు వాల్మీకి మహర్షి.

మహర్షిగా మారిన వాల్మీకి, దండకార్యణం అంటే నేటి నల్లమల అడవుల గూండా దక్షిణ భారతదేశం, ఆ తర్వాత శ్రీలంకకు వలస వెళ్ళాడు. మార్గమధ్యంలో వివిధ ప్రదేశాల్లో బసచేస్తూ, అడవి ఆకులూ, దుంపలూ తింటూ, విశ్రాంతి సమయంలో తన రామాయణం కావ్యాన్ని దేవనాగరి లిపిలో వ్రాస్తూ, తను వెళ్ళిన ప్రదేశాల్ని కావ్యంలో పేర్కొన్నాడు. ఆంధ్ర దేశంలో ఉన్న గోదావరి నదీతీరంలో విశ్రమించి, ఆ తర్వాత వృద్ధాప్య దశ వచ్చే సరికి, తమిళనాడు రామేశ్వరం సముద్ర గట్టు వద్ద నున్న షోల్ మీదుగా, శ్రీలంక ప్రవేశించాడు. శ్రీలంకలో తన రామాయణాన్ని యుద్ధకాండతో ముగించాడు. వాల్మీకి తన జీవిత కాలాన్ని శ్రీలంకలోనే ముంగిచాడని విష్లేషకుల భావన. వాల్మీకి రామాయణంలో, తాను శ్రీరాముడికి సమకాలీనుడనని పేర్కొన్నాడు. శ్రీరాముడు వాల్మీకిని అరణ్యవాసంలో కలిసినట్లూ, సీతను వనవాసానికి పంపినపుడు, వాల్మీకి ఆశ్రమంలోనే ఆ తల్లి ఉన్నట్లూ తెలుస్తోంది. ఆ ఆశ్రమంలోనే సీతమ్మ లవ-కుశులకు జన్మ ఇచ్చినట్లూ, వారిద్దరి విద్యాభ్యాసం అక్కడే, వాల్మీకి శిష్యరికంలో జరిగినట్లూ, రామాయణం ద్వారా తెలుస్తోంది.

Link: https://www.youtube.com/post/UgzAg3q7E0EHCyzl-qx4AaABCQ

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes