మహాభారతంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చూపిన సన్యాసి ‘లక్ష్యం’ - 4 హత్యలు!


మహాభారతంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చూపిన సన్యాసి ‘లక్ష్యం’ - 4 హత్యలు!

మహాభారతంలోని అతిరధ మహారధులలో ఒకడిగా, కురుక్షేత్ర సంగ్రామంలో మహా యోధుడిగా, శ్రీ కృష్ణ భగవానుడికి సన్నిహితుడిగా, మన ఇతిహాసాలలో చెప్పబడిన మహోన్నత వ్యక్తి అర్జునుడు. ఇంద్రుని అంశతో, కుంతీ దేవికి జన్మించిన అర్జునుడు, పరమశివుని నుండి రౌద్రాస్త్రాన్నీ, వరుణుడి నుండి వారుణాస్త్రాన్నీ, ఆగ్ని దేవుని నుండి ఆగ్నేయాస్త్రాన్నీ, వాయుదేవుడి నుండి వాయవ్యాస్త్రాన్నీ, ఇంద్రుని నుండి ఇతర అస్త్రాలనూ పొందాడు. అయితే, వీటన్నింటికన్నా అర్జునుడి వద్ద ఉన్న అతి పెద్ద, శక్తివంతమైన అస్త్రం, శ్రీ కృష్ణ పరమాత్ముడు. మహా సంగ్రామంలో గెలవడానికి కారణం, తన ఆయుధాలూ, బలమూ కాదనీ, నిరంతరం తన వెన్నంటే ఉన్న తన బావ శ్రీ కృష్ణుడనీ, ఒకానొక సందర్భంలో, అర్జునుడు స్వయంగా వ్యక్తపరిచాడు. 

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/nxAY2zJ4tZw ]

ధర్మ పరిరక్షణార్ధం, కృష్ణ పరమాత్ముడు అర్జునుడి రథసారథిగా, పాండవులకు మార్గ నిర్దేశనం చేశాడు. అర్జునుడికి శ్రీ కృష్ణుడంటే, ఎనలేని భక్తి, గౌరవం. కృష్ణయ్య మాటను తూ.చ తప్పకుండా పాటించేవాడు. ఒకానొక సందర్భంలో అర్జునుడు, శ్రీకృష్ణుడితో, ‘నన్ను మించిన భక్తుడు, ఈ ప్రపంచంలో నీకు వేరొకరు లేరు కదా బావా!’ అని ప్రేమతో, కించిత్ గర్వంతో అన్నాడు. అందుకు శ్రీకృష్ణుడు చిరు మందహాసం చేసి, అర్జునుడిని నిర్మానుష్యంగా ఉన్న ఒక అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లాడు. శ్రీ కృష్ణుడు అర్జునుడిని ఎక్కడకు తీసుకువెళ్లాడు? నిజంగా కృష్ణ పరమాత్మకు అర్జునుడే గొప్ప భక్తుడా? లీలామానుష రూపధారి అయిన శ్రీ కృష్ణుడు, అర్జునుడికి ఏం తెలియజేయాలనుకున్నాడు? అనే ఆసక్తికర విషయాలు, ఈ రోజుటి వీడియోలో తెలుసుకుందాము...

తానే గొప్ప భక్తుడిననే అపోహలో ఉన్న అర్జునుడిని అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి, చెట్టు క్రింద తపస్సు చేసుకుంటున్న ఒక సన్యాసిని చూపించాడు కృష్ణ పరమాత్ముడు. ‘అర్జునా, ఈతడు పరమ సాత్వికుడు. కేవలం ఆకులూ అలములూ తింటూ ఎప్పుడూ తపోదీక్షలో ఉంటాడు’ అని, అతనిని దూరంనుంచే పరిచయం చేశాడు. అతనిని చూసిన అర్జునుడికి, ఒక సందేహం కలిగింది. ‘అతను పరమ సాత్వికుడు, సత్యమార్గంలో నడిచే సన్యాసే అయితే, అతని దగ్గర కత్తి ఎందుకు ఉంది?’ అని కృష్ణుడ్ని ప్రశ్నించాడు అర్జునుడు. అందుకు కృష్ణ పరమాత్ముడు, ‘నీ సందేహాన్ని అతనినే అడిగి నివృత్తి చేసుకో. నీ ప్రశ్నలకు అతనే సరైన సమాధానం చెబుతాడు.. మరో మాట.. నువ్వు అర్జునుడివన్న సంగతి అతనికి తెలియదు. నీవుకూడా ఆ విషయాన్ని బయల్పరచకు’ అని చెప్పి, అర్జునుడిని ముని వద్దకు పంపాడు కృష్ణుడు. ముని దగ్గరకు వెళ్లిన అర్జునుడు, ‘అయ్యా, భవబంధాలను వదిలి, సన్యాస దీక్షలో జీవిస్తూ, నిత్యం దైవ స్మరణలో మునిగితేలుతుండే మీకు, ఈ కత్తితో అవసరమేముంది?’ అని అడిగాడు. 

అప్పుడా ముని సమాధానం చెబుతూ, ‘నేను, ఈ సృష్టిలో ఓ నలుగురు వ్యక్తులను చంపాలనుకుంటున్నాను. అందుకే, ఈ కత్తిని నా దగ్గర ఉంచుకున్నాను’, అని అన్నాడు. అతని సమాధానం విన్న అర్జునుడు ఆశ్చర్యపోయి, ‘ఏవరు ఆ నలుగురు? వారిని ఎందుకు చంపాలనుకుంటున్నారు? వారి వల్ల మీకేమైనా అపాయం పొంచివుందా?’ అని అడిగాడు. అప్పుడా సన్యాసి, తాను ఎవరిని చంపాలనుకుంటున్నాడో, ఎందుకు చంపాలనుకుంటున్నాడో వివరించాడు. ‘మొదటిగా నారదుడిని చంపాలి. ఆయన ఎప్పుడూ ఆ భగవానుణ్ణి ఇబ్బందులు పెడుతూ ఉంటాడు. నిత్యం "నారాయణ నారాయణ" అంటూ, ఆ పరమాత్మను తలుచుకుంటూ, ఆ భగవానుడికి విశ్రాంతిలేకుండా చేస్తూ ఉంటాడు. నారద ముని, ప్రతీక్షణం కృష్ణ భగవానుడిని తలచుకోవడం వల్ల, ఆయన కొన్ని సార్లు నిద్ర నుంచి తుళ్లిపడుతుంటాడు. నారదుడు ఆ విధంగా కృష్ణ భగవానుడిని ఇబ్బంది పెడుతున్నందుకు, అతనిని చంపాలని నిర్ణయించుకున్నాను. 

ఇక రెండవ వ్యక్తి, ద్రౌపది. పాండవులు వనవాసం చేస్తున్న సమయంలో, ఒకనాడు వారుండే ప్రాంతానికి దూర్వాస ముని వచ్చాడు. సాధారణంగా ఎవరైనా మునివర్యులు ఇంటికి గానీ, ఆశ్రమానికి గానీ వస్తే, వారికి కాస్త త్రాగడానికి నీళ్లిచ్చి, తినడానికి అన్నం పెట్టి, మర్యాద చేయడం సంప్రదాయం. దూర్వాస ముని వచ్చే సమయానికి, పాండవులు ఇంట్లో ఉన్న ఆహారం మొత్తం తిని, బయటకు వెళ్లారు. ఆ సమయంలో దూర్వాసముని రావడంతో, ద్రౌపదికి ఏం చేయాలో అర్థం కాక, అతిథి మర్యాద చేయడానికి ఆహారం లేకపోవడంతో, ముని కోపానికి బలవ్వకూడదని, కృష్ణ భగవానుణ్ణి ప్రార్థించింది. దూర్వాస ముని ఆగ్రహం నుండి బయటపడే మార్గం చెప్పమని, వేడుకుంది. అప్పుడు శ్రీకృష్ణుడు, తాను అన్నం తింటే, ఆ దూర్వాసముని ఆకలి తీరినట్లవుతుందనీ, ఇంట్లో ఉన్న ఎంతో కొంత ఆహారమైనా తనకు ఇమ్మని అడిగాడు. అప్పుడు ద్రౌపది, తాను తినగా మిగిలిన ఎంగిలి మెతుకున్న పాత్రను శ్రీ కృష్ణుడికిచ్చింది. ఆ ఎంగిలి మెతుకును శ్రీ కృష్ణుడు తినగా, దూర్వాస ముని కడుపునిండిపోగా, కుంటి సాకులు చెప్పి, అక్కడి నుండి నిష్క్రమించాడు. సాక్ష్యాత్తూ ఆ నారాయణుడే శ్రీకృష్ణపరమాత్ముడని తెలిసీ, ఆయనకి ఎంగిలి మెతుకు పెట్టింది ద్రౌపది. తాను చేసింది తప్పు. నా కృష్ణయ్యకు ఎంగిలి మెతుకు పెట్టడం, నేను సహించలేను. అందుకే ఆమెను హత్య చేయాలనుకుంటున్నాను.

ఇక నేను చంపాలనుకుంటున్న మూడవ వ్యక్తి ప్రహ్లాదుడు. నారాయణుడికి పరమభక్తుడు ప్రహ్లాదుడు. కానీ, అతని తండ్రి, రాక్షస రాజైన హిరణ్య కశిపుడి వలన, నా భగవానుడు ఎన్నో బాధలనుభవించాడు. నారయణ నామ స్మరణ నచ్చక, ప్రహ్లాదుడిని అతని తండ్రి హిరణ్యకశ్యపుడు చాలా రకాలుగా హింసించాడు. కానీ, వాటన్నింటినుండీ ప్రహ్లాదుడుని కాపాడుతూ వచ్చాడు భగవానుడు. ఈ క్రమంలో, ప్రహ్లాదుడు అనుభవించవలిసిన అనేక బాధలను తాననుభవించాడు. ప్రహ్లాదుడి తండ్రి వలన, అనేక అవమానాలను ఎదుర్కొన్నాడు. అందుకే, ప్రహ్లాదుడిని సంహరించాలనుకుంటున్నాను. 

ఇక చివరిగా, నేను చంపాలని ఎదురు చూస్తోన్న వ్యక్తి, అర్జునుడు. అతని పేరు చెప్పడానికి గల కారణం, కురుక్షేత్రయుద్ధ సమయంలో, కృష్ణుడిని తన రథ సారథిగా పెట్టుకోవడం. ఈ సృష్టి మొత్తానికీ రక్షకుడైన ఆయన్ని, అలా రథసారథిగా మార్చి, ఆయనను మరింత ఉద్వేగానికి లోనుచేయడం, నాకు నచ్చలేదు. అందుకే, అర్జునుడిని చంపాలని నిశ్చయించుకున్నాను. ఈ నలుగురి వల్లా, నా కృష్ణయ్య అనేక బాధలు పడ్డాడు. నా స్వామిని ఇబ్బంది పెట్టిన వారిని, నేను వదిలి పెట్టను’ అని, ఆ భగవానుడిపై తనకున్న ప్రేమను వ్యక్తపరిచి,  తిరిగి తపస్సుకు పూనుకున్నాడు. 

ఆ సన్యాసి చెప్పిన మాటలు విన్న అర్జునుడు, ఒకింత ఆశ్చర్యానికి లోనైనా, తనకంటే ఎంతో గొప్ప భక్తులు, కృష్ణుడికి ఉన్నారన్న సత్యాన్ని అర్థం చేసుకున్నాడు. ఇతరుల భక్తితో పోలిస్తే, తనది ఎక్కువ కాదనీ, ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో, ఆ పరంధాముడి సాంగత్యం లభ్యమయ్యిందనీ భావించి, సిగ్గుతో తల దించుకుని, అర్జునుడు అక్కడి నుండి వెనుదిరిగాడు. 

దైవారాధనలో, దైవకార్యాలు చేసేటప్పుడూ, మన అవసరాల కోసం కాకుండా, మనస్సును పూర్తిగా ఆ భగవంతునిపై లగ్నం చేయడం నేర్చుకోవాలి. మన అవసరాలూ, మన కోరికలూ, ఆ భగవంతునికి తెలియనివి కావు. ఏవి, ఎప్పుడు మన జీవితాల్లో జరగాలో, ఎప్పుడు ఏం కావాలో, మనకన్నా ఆయనకే బాగా తెలుసు. కాబట్టి, ఇకపై దేవుణ్ణి స్మరించేటప్పుడు, కోరికల చిట్టాలతో కాకుండా, మనస్పూర్తిగా, స్వచ్ఛమైన మనస్సుతో స్మరించండి. ఆయన ప్రేమను ఆస్వాదించండి. "కృష్ణం వందే జగద్గురుం!".

Link: https://www.youtube.com/post/UgwpUtA0Hyl9BP6NEwJ4AaABCQ

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes